చిన్నపిల్లలై పోదామా!

అందరం అలా కూర్చొని చిన్ననాటి కబుర్లు పంచుకుంటోంటే తెలియకుండానే ముఖంపై చిరునవ్వు వచ్చేస్తుంది కదూ! కొత్త దుస్తులు ప్రయత్నించాలన్నా, స్నేహితులకు సమయం కేటాయిద్దామన్నా మనకు గుర్తొచ్చేది పనే!

Published : 14 Nov 2022 00:18 IST

అందరం అలా కూర్చొని చిన్ననాటి కబుర్లు పంచుకుంటోంటే తెలియకుండానే ముఖంపై చిరునవ్వు వచ్చేస్తుంది కదూ! కొత్త దుస్తులు ప్రయత్నించాలన్నా, స్నేహితులకు సమయం కేటాయిద్దామన్నా మనకు గుర్తొచ్చేది పనే! ఏమంటే.. ఇంకా చిన్నపిల్లలమా అని మనకు మనమే సర్ది చెప్పేసుకుంటాం. కాస్త బాధ్యతల్ని పక్కన పెట్టి మనలోని పిల్లల్ని తట్టిలేపుదామా?

* కారణం లేకుండా... చివరిసారి బాగా ఆనందించిన సందర్భమేది? చాలాసేపు పట్టిందా? మనకు ఉత్సాహం, పట్టలేని సంతోషం కావాలంటే ఒక గట్టి కారణం కావాలనుకుంటున్నాం. మంచి ర్యాంకు, ఉద్యోగం, భర్త, పిల్లలు, వాళ్ల ర్యాంకులు ఇలా ఆనందంగా ఉండాలంటే ఏదో సాధించాలి అనుకోవడమూ సమస్యే. చిన్నారులను చూడండి. అవతలి వారి పలకరింపు కూడా వాళ్లలో నవ్వులు పూయించగలదు. కాబట్టి, వాళ్లని అనుసరించి ప్రతిదానిలో ఆనందాల్ని వెతుక్కోండి.
* చెప్పేయండి.. భయం తెలియనప్పుడు చుట్టూ ఆనందమే. పెరిగేకొద్దీ ఎవరేమనుకుంటారో అనే భయాన్ని పెంచేసుకుని ఆందోళన చెందుతుంటాం. ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చొంటే మన ఆలోచనల్ని పంచుకునే తీరికెక్కడిది? చిన్నతనాన్ని గుర్తుచేసుకోండి. ఎప్పుడైనా ఇలా ఆలోచించామా? లేదు కదా! తిరిగి పాటించేయండి.

* మర్చిపోదాం.. మనసుల మధ్య గోడలు పిల్లలకు తెలియదు. కోపం, గిల్లికజ్జాలు ఏవైనా కొద్దిసేపే! ఎందుకంటే సారీ చెప్పేయగానే మన ఫ్రెండేగా అనేసుకుంటాం, క్షమించేస్తాం. అక్కడ కోపాన్ని వాళ్లపై ప్రేమ జయిస్తోంది. ఇప్పుడేమో అహం అడ్డొస్తుంది. నేనే ఎందుకు తగ్గాలనుకుంటాం. ఇంట్లో వాళ్ల విషయంలో అలా ఆలోచించం కదా! అందరి విషయంలోనూ అలాగే ఉంటే సరి. మనసుకెంత హాయో మీరే గమనిస్తారు.

* ఈ క్షణం.. ఆకలేస్తే అమ్మ చుట్టూ తిరగడం, ఏదైనా కావాలనిపిస్తే నాన్నను కాకా పట్టడం, తోబుట్టువులతో ఆటలు.. ఎంత సింపుల్‌ జీవితం పిల్లలది. రేపేమిటన్న బెంగే ఉండదు వాళ్లకి. మనమే... రేపు గురించి ఆలోచిస్తూ ఈరోజు మరచిపోతుంటాం. కడుపున పుట్టిన వాళ్లకోసం, ఇంటికోసం అంటూ కూడబెడుతూనే కూర్చోవద్దు. జాగ్రత్త మంచిదే. మీ దగ్గరికొచ్చే సరికే అన్నీ అనవసరం అనుకోవద్దు. స్నేహితుల్ని కలవండి. టూర్‌ వేయాలనిపించిందా వెళ్లండి. నచ్చింది తినండి. అన్నిసార్లూ కుదరకపోయినా కొన్ని సార్లయినా ఆ సంకెళ్లను తొలగించుకుంటేనే జీవితాన్ని అనుభవించినట్లు. చేద్దామా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్