ఆత్మవిశ్వాసం చూపించొచ్చు!

‘దూసుకెళ్లే తత్వం తక్కువ’ చాలామంది హెచ్‌ఆర్‌లు అమ్మాయిల విషయంలో చెప్పే మాటిది. బలమైన ఆలోచనలు ఉన్నా.. భయపడి ఆగిపోతుంటారు. దీంతో వాళ్లపై వాళ్లకే ఆత్మవిశ్వాసం లేదన్న అభిప్రాయానికి వస్తారు పైవాళ్లు. ముందుకు సాగాలా.. ఆ భయాన్ని నెట్టేయండిలా..!

Updated : 05 Dec 2022 00:33 IST

‘దూసుకెళ్లే తత్వం తక్కువ’ చాలామంది హెచ్‌ఆర్‌లు అమ్మాయిల విషయంలో చెప్పే మాటిది. బలమైన ఆలోచనలు ఉన్నా.. భయపడి ఆగిపోతుంటారు. దీంతో వాళ్లపై వాళ్లకే ఆత్మవిశ్వాసం లేదన్న అభిప్రాయానికి వస్తారు పైవాళ్లు. ముందుకు సాగాలా.. ఆ భయాన్ని నెట్టేయండిలా..!

* మీపై మీకు నమ్మకం ఉంటే సరిపోదు. ఎదుటివారికీ దాన్ని చూపించాలి. ఏదైనా చెప్పేటప్పుడు కూర్చునే, నిల్చొనే విధానాన్ని సరిచూసుకోండి. నడుము నిటారుగా, భుజాలు వంగకుండా సూటిగా చూస్తూ ఉండండి. ఇది అవతలివారికి మీపై విశ్వాసం కలిగించడమే కాదు.. మీ వ్యక్తిగత ఆరోగ్యానికీ మేలు చేస్తుంది.

* మీరెవరితోనో మాట్లాడుతున్నారు. వాళ్లేమో మీవైపు కనీసం చూడకుండా బదులిస్తున్నారు.. మీకెలా ఉంటుంది? అవమానంలా తోయదూ! అధికారుల దగ్గరికొచ్చేసరికి ఆసక్తి లేదన్న అభిప్రాయానికొస్తారట. కాబట్టి, ఎవరైనా మాట్లాడుతున్నా.. మీరు బదులిస్తున్నా సూటిగా చూడటం అలవాటు చేసుకోండి.

* మాట్లాడేప్పుడు బిగుసుకుపోవడం, చేతులు వెనక్కి పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారా? చేతులు ఉపయోగించే తీరును బట్టే ఆత్మవిశ్వాసంతో ఉన్నారా లేక భయపడుతున్నారా అనేది తేలుస్తారట. కాబట్టి వీలైనంత వరకూ చేతుల్ని ఫ్రీగా వదిలేయండి. చేతుల్ని నలపడం, పిడికిలి బిగించడం వంటివీ చేయొద్దు.

* ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఒకటికి రెండుసార్లు మననం చేసుకోండి. అవకాశమొచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడేయండి. అంతేకానీ.. తడబడుతూ.. నీళ్లు నములుతూ మాత్రం చెప్పొద్దు. ఎక్కువసేపు మాట్లాడకపోయినా ఫర్లేదు. మాట్లాడిన కొద్దిసేపు మాత్రం లోపాలు కనపడనీయొద్దు.

* కొద్దిమేర భయం, ఒత్తిడి ఎప్పుడూ ఆరోగ్యకరమే! అది పరిధులు దాటితేనే ప్రమాదం. నాకు భయం అని కూర్చుంటే ఎప్పటికీ ముందుకెళ్లలేరు. పైవాళ్లంటే భయమా? వారితోనే చిన్న చిన్న సంభాషణలు జరపండి. చర్చలే కానక్కర్లేదు. రోజూ పలకరించడం, చిన్నచిన్న సంభాషణలకు చోటివ్వండి. ఏదీ ఒక్కరోజులోనే రాదు. కాబట్టి, కంగారొద్దు. కానీ మొదలుపెట్టడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది. రోజూ ఉదయం అద్దం ఎదుట నిల్చొని సాధన చేయండి. మీలో మార్పు మీకే స్పష్టంగా కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్