నాయకత్వం తీసుకోవాలా? వద్దా

అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ ఉద్యోగాలూ అందుకుంటున్నా... పై పదవులు చేపట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం వెనకడుగు వేస్తుంటారు. ఇందుకు ఆ పదవిలో నెగ్గగలమా అన్న భయంతో పాటూ సమయాన్ని సమన్వయం చేసుకోలేమేమో అన్న సందేహమే కారణం అంటారు కెరియర్‌ నిపుణులు.

Updated : 13 Dec 2022 04:53 IST

అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ ఉద్యోగాలూ అందుకుంటున్నా... పై పదవులు చేపట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం వెనకడుగు వేస్తుంటారు. ఇందుకు ఆ పదవిలో నెగ్గగలమా అన్న భయంతో పాటూ సమయాన్ని సమన్వయం చేసుకోలేమేమో అన్న సందేహమే కారణం అంటారు కెరియర్‌ నిపుణులు. ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవేంటంటే...

భయాన్ని వదిలేయాలి... ఏ పని చేసినా ఏమవుతుందో? ఎలా చేయగలనో అన్న భయాన్ని వదిలేయాలి. ఉద్యోగపరంగా ఎదురైన సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచించడంలో మెదడును చురుకుగా ఉంచుకోవాలి. సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోగలగాలి. ఆలోచనల్లో స్పష్టత, చక్కటి ప్రణాళిక ఉంటే... ఎంతటి పని అయినా సులువవుతుంది. ఇందుకోసం మీరున్న రంగం గురించీ, ఇందులో వచ్చే మార్పులూ, కొత్త సాంకేతికత... మార్కెట్‌ ఒడుదొడుకులూ అన్నీ గమనించుకోండి. కావలసినంత సమాచారం మీ దగ్గర ఉంటే మీరు వేసే ప్రతి అడుగూ సరిగానే పడుతుంది.

నాయకత్వ లక్షణాలు... ఉన్నతస్థాయిలో ఉద్యోగం చేయాలంటే మొదట కావాల్సిన అర్హతే నాయకత్వ లక్షణం. కింది ఉద్యోగులను సమన్వయం చేస్తూ, పని పూర్తిచేయించాల్సిన బాధ్యత ఉండాలి. ఇందుకు అవసరమైన చొరవ మీ నుంచే మొదలవ్వాలి. ముందు ఎదుటి వారు చెప్పేది వినే ఓపిక కావాలి. మీరు చెప్పాలనుకున్నది స్థిరంగా చెప్పే స్థైర్యమూ ఉండాలి. ఇవన్నీ మీకు పరిస్థితులపై పట్టుని కల్పిస్తాయి. నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి.

సమయం మీ చేతుల్లో... మహిళలు కుటుంబ బంధాలూ, ఆఫీసు పని ఒత్తిళ్లలో నలిగిపోతుంటారు. రెండింటికీ న్యాయం చేయాలని తహతహలాడుతూ ఆందోళనకు గురవుతుంటారు. తీరా... అవకాశాలు దక్కినప్పుడు వెనక్కి తగ్గుతుంటారు. మీరలా చేయొద్దు. కుటుంబ, ఆఫీసు బాధ్యతల్ని విడివిడిగానే చూడండి. దేని సమయాన్ని దానికే కేటాయించుకోండి. కెరియర్‌లో ఎదగాలన్న ఆలోచన ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడానికీ, తోడుగా నిలబడతామనే హామీని పొందడానికీ వెనుకాడొద్దు. ఆపై ఎవరి పనులు వారు చేసుకునేలా... బాధ్యతల్ని పంచండి. అప్పుడే మీకు సమయం చిక్కుతుంది. వచ్చిన అవకాశాల్ని సమర్థంగా ఉపయోగించుకోగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్