స్నేహితుల్లో మార్పు కనిపిస్తే..

ప్రాణస్నేహితులైన రాధిక, రమ్య మధ్య స్నేహం తగ్గి, దూరం పెరుగుతున్నట్లు సహ విద్యార్థులందరికీ తెలుస్తోంది.

Updated : 20 Dec 2022 03:28 IST

ప్రాణస్నేహితులైన రాధిక, రమ్య మధ్య స్నేహం తగ్గి, దూరం పెరుగుతున్నట్లు సహ విద్యార్థులందరికీ తెలుస్తోంది. అత్యంత సన్నిహితులుగా ఉండే వారి మధ్య కూడా అప్పుడప్పుడూ ఇలా విభేదాలొస్తాయంటున్నారు మానసిక నిపుణులు. వాటిని దాటి నిజమైన స్నేహాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేయాలని సూచిస్తున్నారు.

రక్తబంధంకన్నా స్నేహబంధమే మిన్న అంటారు. అటువంటి బంధం దూరమవుతుందనిపిస్తే కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. సమస్య అనిపించినప్పుడు కాసేపు చర్చించుకుంటే చాలు.. పరిష్కారం దొరుకుతుంది. భేదాభిప్రాయాల తెర తొలగిపోతుంది. ఒకరంటే మరొకరికి పూర్తిగా అర్థమవుతుంది. అలాకాకుండా దూరాన్ని పొడిగిస్తూనే ఉంటే అది శాశ్వతమయ్యే ప్రమాదం ఉంది. మనవల్ల అవతలివారికి ఇబ్బంది కలిగిందేమో తెలుసుకోవాలి. నిజంగా వారి మనసు కష్టపడిందని గుర్తిస్తే మాత్రం వెంటనే క్షమాపణలు చెప్పగలగాలి. అప్పుడే ఆ బంధం తిరిగి చిగురిస్తుంది.

చిన్నదే.. స్నేహితుల మధ్య చాలా చిన్న అంశమే పెరిగి పెద్దదవుతుంటుంది. కొన్ని సార్లు మూడోవ్యక్తి లేనిపోనివి మాట్లాడి, వీరి బంధాన్ని బీటలువారేలా చేసే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఆ విషయాన్ని సునిశితంగా గుర్తించగలగాలి. స్నేహితుల గురించి ఎదుటి వారెవరైనా చెడుగా చెప్పినప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. తమ స్నేహితుల గురించి పూర్తిగా తెలుసుకొని ఉంటే ఇటువంటి సమస్యలకు తావుండదు. మూడో వ్యక్తి ప్రవేశానికి ఆస్కారం ఉండదు. స్నేహ బంధం దూరమవకుండానూ.. ఉంటుంది. తమ మధ్య ఏర్పడిన సమస్య చాలా చిన్నదే అనుకొని, దాన్ని దాటే మార్గాన్ని చూసుకుని స్నేహాన్ని నిలబెట్టుకోవాలి.

అపోహ.. స్నేహంలో మంచి, చెడు అంటూ ఉండదని భావించకూడదు. కొందరు స్నేహంగా ఉంటూనే ఎదుటివారి వద్ద మనల్ని తక్కువచేసి హేళనగా మాట్లాడతారు. ఇటువంటి వారిని స్నేహితులుగా భావిస్తే అది అపోహే అవుతుంది. నిజమైన స్నేహితులు తమ తోటివారిని ఏ సందర్భంలోనైనా గౌరవిస్తారు. ఎదుటివారు తక్కువచేసినా ఒప్పుకోరు. అటువంటివారిది నిజమైన స్నేహంగా భావిస్తే మంచి స్నేహితులను పొందొచ్చు. అలాగే ఒకరి నుంచి మరొకరు మంచి విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే స్నేహితులు పరస్పరం స్ఫూర్తి ప్రదాతలవుతారు. ఆ స్నేహం అందరికీ ఆదర్శమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్