ఉద్యోగంలో ఎదగాలా?

ఉద్యోగం ఆర్థిక వెసులుబాటు కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తుంది. గుర్తింపు తెచ్చిపెడుతుంది.

Published : 02 Feb 2023 00:04 IST

ఉద్యోగం ఆర్థిక వెసులుబాటు కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తుంది. గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఇన్ని లాభాలు చేకూర్చే ఉద్యోగంలో ఉన్న స్థితిలోనే ఉండిపోలేం కదా! మరింత ఉన్నతి సాధించే క్రమంలో ఈ సూత్రాలు పాటించమంటున్నారు కెరియర్‌ కౌన్సెలర్లు...

* తోటి ఉద్యోగులు మీలాగే ఉండాలని ఆశించొద్దు. ఒకరికి సలహాలివ్వాలని చూడొద్దు. మంచికి పోయినా పెడార్థాలు తీసేవారు ఉంటారని గుర్తుంచుకోండి. మీ వరకూ మీరు ఎంత నాణ్యమైన ఉత్పాదకతను ఇవ్వగలరో ఆలోచించి ప్రణాళికతో, నిబద్ధతతో పనిచేయండి.

* ఏ రంగంలోనయినా ప్రోత్సహించి సాయం అందించేవారితోబాటు నిరుత్సాహపరుస్తూ అవరోధాలు కలిగించేవారూ ఉంటారు. అలాంటివారి మీద కోపతాపాలు వద్దు. అప్రమత్తంగా ఉంటూ లక్ష్యం దిశగా సాగండి.

* ఉద్యోగం ఇష్టంగా కాకుండా భారంగా అనిపించిందంటే ఎదుగుదల మీద ధ్యాస తగ్గుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యమూ దెబ్బతినే ప్రమాదముంది. కనుక చేసే పనుల్లో ఎప్పటికప్పుడు సులువైన మార్గాలు కనిపెట్టండి.

* సహోద్యోగులు లేదా పై అధికారుల విషయంలో మీకేదైనా అసంతృప్తి ఉన్నా.. ఆ విషయాలు చర్చకు పెట్టొద్దు. అవి చిలవలు పలవలై మీమీద సదభిప్రాయాన్ని పోగొడతాయి.

* ఎంత సమర్థంగా చేస్తున్నా ఒక్కోసారి ఆశించిన ఫలితం రాకపోవచ్చు. అడ్డంకులు ఎదురవ్వొచ్చు. మనం నడిచే దారిలో ముళ్లూ రాళ్లూ ఎదురైనంతలో డీలాపడి వెనక్కెళ్లం కదా! ఉద్యోగమైనా అంతే. తెలివిగా దాటుకుంటూ ముందుకెళ్లాలి.

* ముందుగా లక్ష్యాలను నిర్దేశించుకుంటే వాటిని ఎలా చేరాలో స్పష్టత వస్తుంది. సునాయాసంగా గమ్యం చేరిపోతామని ఊహల్లో తేలిపోవద్దు. ఏవైనా ఆటంకాలూ ఎదురైనంతలో నిరాశచెందక పట్టుదలగా ప్రయత్నించాలి.

* పనిలో మూసవిధానానికి స్వస్తి చెప్పండి. లేదంటే ఎదుగుదల ఉండదు. ఎప్పటికప్పుడు ఇంకా కొత్తగా ఏం చేయొచ్చో ఆలోచించండి.

* తోటి ఉద్యోగులతో విభేదాలు వస్తే ఆ విషయాన్ని వారితోనే చర్చించండి. విషయం తేటతెల్లమవుతుంది. అంతే తప్ప తొందరపడి ఉద్యోగం మానేయొద్దు, అశాంతిని కొనితెచ్చుకోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్