ఆ బరువు వల్లేనట!

కాలంతో పాటు మన బాధ్యతల జాబితా పెరిగిపోయింది. ఇంటా, బయటా ఒత్తిడితో కూడుకున్న పనులెన్నో చేయాల్సి వస్తోంది. అలాంటి వాటిల్లో నిలబడి పనిచేయడం కూడా ఒకటి. దీంతో వచ్చే సమస్యల్ని అధిగమించాలంటే...

Published : 06 Jun 2023 00:08 IST

కాలంతో పాటు మన బాధ్యతల జాబితా పెరిగిపోయింది. ఇంటా, బయటా ఒత్తిడితో కూడుకున్న పనులెన్నో చేయాల్సి వస్తోంది. అలాంటి వాటిల్లో నిలబడి పనిచేయడం కూడా ఒకటి. దీంతో వచ్చే సమస్యల్ని అధిగమించాలంటే...

ఎక్కువ సేపు నిలబడితే... : ఒకప్పుడు ఏవైనా వండాలంటే... పొయ్యి దగ్గర కూర్చుని చేసేవారు. కానీ, ఇప్పుడేమో అన్నీ మాడ్యులర్‌ కిచెన్‌లు... వీటితో సౌకర్యం మాటెలా ఉన్నా ఎత్తుమీదున్న పొయ్యి దగ్గర రోజూ కనీసం రెండు మూడు గంటలైనా నిలబడాలి. విధులకు వెళ్లేటప్పుడు బస్సులూ, రైళ్లలోనూ, పని ప్రదేశాల్లోనూ కూడా ఇదే పరిస్థితి. ఇలా గంటల తరబడి నిలబడటం వల్ల దీర్ఘకాలంలో అనేక అనారోగ్యాల ముప్పు ఉందంటున్నాయి అనేక అధ్యయనాలు. ముఖ్యంగా స్త్రీలలో మూత్ర సంబంధిత సమస్యలు, వెరికోస్‌ వెయిన్స్‌, కాళ్లు ఉబ్బడం, పాదాలూ, వెన్ను, నడుం నొప్పులు కనిపిస్తాయట. అందుకే... అరగంట పాటు నిలబడి పనిచేయాల్సి వస్తే... ఒకే భంగిమలో ఉండొద్దు. అటూ ఇటూ నడవండి.

కూర్చుంటే హాయిగా ఉన్నా... : మెత్తని  కుర్చీల్లో కూర్చోవడం, పరుపుల మీద పడుకోవడం సౌకర్యంగా ఉంటుంది. కానీ, దీన్నే అలవాటుగా మార్చుకుంటే శరీరాకృతి మారడమే కాదు... నడుం, వెన్ను నొప్పులు వేధించొచ్చు. అందుకే ఎక్కడ కూర్చున్నా, నిలుచున్నా శరీరం నిటారుగా ఉండేలా చూసుకోవాలి. విధుల్లో ఎక్కువ సేపు కూర్చోవాల్సి వస్తే... విరామంలో కాళ్లూ, చేతులూ కదిపేలా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం, ప్రతి అరగంట కోసారి సీటు నుంచి లేచి నడవాలి.

వెంట తీసుకెళ్తున్నారా...: గడప దాటి బయట అడుగు పెట్టాలంటే వెంట హ్యాండ్‌ బ్యాగు ఉండాలనుకునే అమ్మాయిల కాలం ఇది. కానీ, ఆ బ్యాగు బరువు ఎప్పుడైనా గమనించారా? మొబైల్‌, ట్యాబ్‌, ఛార్జర్‌, సన్‌ గ్లాసెస్‌, మేకప్‌ సామగ్రి, వాటర్‌ బాటిల్‌... ఇలా కనిపించినవన్నీ ఇందులో పెట్టేయడం మనలో చాలామందికి అలవాటు. ఈ బరువంతా కనీసం ఒకటి రెండు కేజీలైనా ఉంటుంది. పైగా దీన్ని ఒకే భుజంపైనా మోస్తుంటారు. ఈ ఒత్తిడి, బరువు వల్ల మెడ, వెన్ను, తల నొప్పులు తప్పక పోవచ్చు. దీర్ఘకాలంలో ఇది శరీరాకృతిని దెబ్బతీస్తుంది. భుజం నొప్పి, చెయ్యి లాగడంతో పాటు నరాలు, రక్తనాళాలు, పక్కటెముక ఒత్తిడికి గురవుతాయట. అందుకే అవసరానికి మించినవేవీ అందులో ఉంచొద్దు. వీలైనంత తేలిగ్గా వాటిని తీసుకెళ్లడం, బ్యాక్‌ప్యాక్‌లపై ఆధారపడటం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్