చెల్లి ఇంట్లోకి రానివ్వడం లేదు..

అమ్మానాన్నా నాలుగేళ్ల క్రితం మరణించారు. నాన్న రైల్వే ఉద్యోగిగా పదవీ విరమణ చేశారు. ఆయన పేరు మీదున్న ఇంట్లో సగభాగాన్ని నాకు, పెద్ద తమ్ముడు వద్దనడంతో మిగిలినదాన్ని చెల్లీ, చిన్న తమ్ముడి పేర వీలునామా రాశారు.

Updated : 26 Sep 2023 12:56 IST

అమ్మానాన్నా నాలుగేళ్ల క్రితం మరణించారు. నాన్న రైల్వే ఉద్యోగిగా పదవీ విరమణ చేశారు. ఆయన పేరు మీదున్న ఇంట్లో సగభాగాన్ని నాకు, పెద్ద తమ్ముడు వద్దనడంతో మిగిలినదాన్ని చెల్లీ, చిన్న తమ్ముడి పేర వీలునామా రాశారు. ప్రస్తుతం చెల్లి అందులో ఉంటూ ఎవరినీ లోనికి రానివ్వట్లేదు. వేర్వేరు బ్యాంకుల్లో నాన్నకు పెద్ద మొత్తంలో ఎఫ్‌డీలున్నాయి. వాటిలో అమ్మను మాత్రమే నామినీగా పేర్కొన్నారు. సరైన ఆధారాలు చూపించి తొమ్మిదేళ్లలోపు తీసుకోకపోతే ఈ డబ్బులు రిజర్వ్‌ బ్యాంకుకి వెళ్లిపోతాయని అధికారులు అన్నారు. ఇన్నాళ్లూ అమ్మానాన్నల బాధ్యతల్ని నేనే చూశాను. ఈ సమస్యకు పరిష్కారం చూపించగలరు.

- ఓ సోదరి.

  •  మీ నాన్నగారు వీలునామా రిజిస్టర్‌ చేశారా? దాని మీద ఆయన సంతకంతోపాటు ఇద్దరు సాక్షులవి కూడా ఉన్నప్పుడే అది చెల్లుతుంది. ఆ ఇంటిని పూర్తిగా తన నివాసానికి వాడుకునే హక్కు మీ చెల్లికి లేదు. ఆమె మీద ఇన్నాళ్లూ ఎవిక్షన్‌ కేసు ఎందుకు వేయలేదు. 12ఏళ్లు నిరంతరంగా అక్కడే ఉంటే ఆవిడకు ప్రతికూల స్వాధీనపు హక్కులొస్తాయి. మీ చెల్లి మీద క్రిమినల్‌ కేసు వేయొచ్చు. ఐపీసీలోని సెక్షన్‌లు 441 మరొకరి ఆధీనంలోని ఆస్తిలోకి ప్రవేశించడం, 425- ఇతరుల ఆస్తిని దోచుకోవడం, 420-మోసం, 442- హౌస్‌ ట్రెస్‌ పాస్‌ల కింద కేసులు వేయొచ్చు. సాధారణంగా అద్దెదారులు ఇళ్లను ఖాళీ చేయనప్పుడు వీటిని వేస్తారు. ఇందుకు వారికి అద్దె నియంత్రణ చట్టం సాయపడుతుంది. మీ విషయానికొస్తే మీ సోదరి అనాథరైజ్డ్‌ ఆక్యుపెంట్‌. ఈ విషయమై ముందు పోలీసు ఫిర్యాదు ఇవ్వండి. అప్పుడు మెజిస్ట్రేట్‌ సీఆర్‌పీసీ సెక్షన్‌ 145 కింద కేసుని పరిశీలించి తగిన చర్యకు సిఫారసు చేస్తారు. లేదా మా ఆస్తి మాకు ఇప్పించమని సివిల్‌ సూట్‌నీ వేయొచ్చు. ఇక, బ్యాంకు ఎఫ్‌డీల గురించి మీ నాన్నగారు విల్లులో ప్రస్తావించారా? లేదంటే బ్యాంకుల్ని ప్రతివాదులుగా చేర్చి వారసత్వ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేయండి. వారసులు అందరినీ ఇందులో పార్టీలుగా చేర్చాలి. అలానే, ఏయే బ్యాంకుల్లో ఎంత మొత్తం ఉన్నాయో, వారసుల వివరాలను స్పష్టంగా బ్యాంకుకి తెలియచేస్తూ లేఖ రాస్తే మీ డబ్బులు మీకొస్తాయి. ఇంటి విషయంలో ఆఖరి ప్రయత్నంగా మీ తరఫున పెద్దవారిని మధ్యవర్తిత్వం చేయమనండి. కుదరకపోతే ఇల్లు స్వాధీనానికి లీగల్‌ నోటీసు ఇచ్చి ముందుకు వెళ్లండి. ఇకనైనా ఆలస్యం చేయకపోవడం మంచిది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్