నా సంపాదన.. నాకు హక్కులేదా!

నేనెంత సంపాదిస్తున్నా... జీతం ఖాతాలో పడగానే నా భర్త చేతిలో పెట్టాల్సిందే. అలాగని అతడేమీ వ్యసనాలకు ఖర్చు చేయడు. నేనా డబ్బుల్ని వృథా చేస్తానని అపోహ.

Updated : 17 Oct 2023 12:06 IST

నేనెంత సంపాదిస్తున్నా... జీతం ఖాతాలో పడగానే నా భర్త చేతిలో పెట్టాల్సిందే. అలాగని అతడేమీ వ్యసనాలకు ఖర్చు చేయడు. నేనా డబ్బుల్ని వృథా చేస్తానని అపోహ. ఇందుకోసమే పొదుపు పేరుతో ప్రతి పనినీ తూకం వేసి రూపాయలతో ముడిపెడుతున్నారు. గట్టిగా గొడవపడితే నా మీద చెయ్యి చేసుకుంటారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ‘మీ కుటుంబ భవిష్యత్తు కోసమే కదా ఇదంతా’ అంటూ నన్నే తప్పు పడుతున్నారు. నేనిక అతడితో ఉండలేను అనిపిస్తుంది. విడాకులు తీసుకుంటే నా బిడ్డల్ని నేను తెచ్చుకోలేనా?

  - ఓ సోదరి.

మౌనంగా గృహహింసను భరిస్తోన్న స్త్రీలు చాలామందే. వాస్తవానికి భార్యాభర్తలిద్దరికీ సంసార బాధ్యత సమానంగా ఉంటుంది. సంపాదించే డబ్బులో తమ అవసరాలకు కొంత మొత్తాన్ని దాచుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆలుమగలిద్దరూ కలిసి ఇంటి బడ్జెట్‌ వేసుకోవాలి. అందులోనే కొంత పొదుపు, మదుపుల కోసం పక్కన పెట్టుకోవాలి. మీ విషయానికొస్తే...మీ భర్త.. తన చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులేమైనా ఎదుర్కొన్నారేమో, అందువల్లే భవిష్యత్తుని ఆలోచించి ప్రతి రూపాయీ ఆచితూచి ఖర్చుపెడుతున్నారేమో! కొందరు మాత్రం తమ పంతం నెగ్గించుకోవడం, పెత్తనాన్ని చూపించడం కోసమే ఎదుటివారిని బాధపెడుతూ ఉంటారు. ఏదైతేనేం! ఆర్థిక ఆంక్షలు విధించడం, కోపంలో కొట్టడం, తిట్టడం వంటివన్నీ గృహహింస కిందే లెక్క. ఈ చట్టం సాయంతో సెక్షన్‌-18 ప్రకారం రక్షణ కల్పించమని, పిల్లల పోషణ ఖర్చులు అందించమనీ(సెక్షన్‌-20) అడగవచ్చు. అలానే శారీరకంగా, మానసికంగా బాధపెట్టినందుకు ఒకే మొత్తంలో పరిహారం ఇప్పించమనీ (సెక్షన్‌-22) కోరవచ్చు. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 125(1)(బి) మైనర్లైన పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత తండ్రిదే అని చెబుతోంది. దీంతో పాటు హిందూ దత్తత, మెయింటెనెన్స్‌ యాక్ట్‌-1956 కూడా మైనర్‌ పిల్లల పోషణ బాధ్యత తండ్రి తీసుకోవాలంటోంది. గార్డియన్స్‌ అండ్‌ వార్డ్స్‌ చట్టం-1890 ఐదేళ్ల లోపు బిడ్డలు తల్లి దగ్గరే పెరగాలని చెబుతోంది. అయితే, కొన్ని సందర్భాల్లో చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మానాన్నల్లో ఎవరి కస్టడీలో ఉండాలన్నది నిర్ణయిస్తారు. ఈ సమయంలో వారి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. ముందు మీ ఇద్దరూ ఫ్యామిలీ కౌన్సెలర్‌ను కలవండి. లేదంటే ప్రతి జిల్లా కోర్టు ప్రాంగణంలోనూ ఉన్న మధ్యవర్తిత్వ కేంద్రాన్ని సంప్రదించండి. వారు ఇద్దరికీ అవసరమైన కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్