హింసను.. ఏకమై.. ఎదిరిద్దాం!

ఆధునిక మహిళ అంతరాలను దాటి ఆకాశానికెగిసినా.. తనపై జరుగుతోన్న హింసకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఈ విషయంపై ఆడవాళ్లకు సరైన అవగాహన కల్పించాలనీ, వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఐరాస ఏటా నవంబర్‌ 25న ‘మహిళలపై హింస నిర్మూలనా దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది.

Updated : 25 Nov 2023 02:56 IST

ఆధునిక మహిళ అంతరాలను దాటి ఆకాశానికెగిసినా.. తనపై జరుగుతోన్న హింసకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఈ విషయంపై ఆడవాళ్లకు సరైన అవగాహన కల్పించాలనీ, వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఐరాస ఏటా నవంబర్‌ 25న ‘మహిళలపై హింస నిర్మూలనా దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. ఈ ఏడాది.. ‘ఏకమవుదాం’(యునైట్‌) అనే థీమ్‌తో అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది..

  • పావని, సతీష్‌(పేర్లు మార్చాం)లు ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు... తనకంటే భార్యది మంచి హోదా అన్న ఒక్క విషయాన్ని పట్టుకుని నిత్యం ఆమెని సూటిపోటి మాటలతో వేధిస్తుంటాడు. ఇతరులతో అక్రమ సంబంధాలు అంటగట్టి అనుమానిస్తుంటాడు. రోజూ తాగొచ్చి ఆమెతో గొడవపడుతుంటాడు. ఒళ్లు హూనమయ్యేలా కొడుతుంటాడు.
  • లావణ్యది మరో బాధ. ప్రేమిస్తున్నా అని వెంటపడ్డ అతడిని కాదనడమే నేరం అంటూ... ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేశాడు. తను చెప్పినట్లు వినకపోతే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తానంటూ వేధిస్తున్నాడు.
  • నలభై ఏళ్లకు దగ్గరగా వైవాహిక జీవితం. అయినా సరే, కాఫీ వేడిగా లేదనో, పిలిచినా పలకలేదనో... మీదకు దూసుకొచ్చే భర్తతో కాపురం చేస్తోంది శాంతి. అతడి కోపం వల్ల పదిహేడేళ్లుగా పుట్టింటికి దూరమై వేదన అనుభవిస్తోంది.

ఇవన్నీ వేర్వేరు ఉదాహరణలు కావొచ్చు. కానీ, అన్ని రూపాల్లో ఉన్నదీ మహిళలపై కొనసాగుతోన్న హింసే. ముఖ్యంగా స్త్రీల వ్యక్తిగత, సామాజిక జీవితానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం, వెకిలి చూపులు, వ్యంగ్యంగా మాట్లాడటం, అనుమానించడం, అందరిలో అవమానించడం వంటివన్నీ ఇవే! ఆడపిల్లల అక్రమ రవాణా, ఆన్‌లైన్‌ ట్రోల్స్‌, ఫొటోలు మార్ఫింగ్‌ చేయడం, గృహహింస, అవకాశాల్లో అసమానతలు, బాల్య వివాహాలు, నిర్బంధ వివాహాలు, వరకట్నం.. ఈ తరహానే.

ఎందువల్ల!

పురుషాధిక్య భావజాలం, బాల్యంలో ఎదుర్కొన్న అనుభవాలు, మత్తు పదార్థాలు, పోర్నోగ్రఫీ వంటివి మగవారిలో హింసను ప్రేరేపిస్తే..., నిరక్షరాస్యత, కుటుంబ పరిస్థితులు, పేదరికం, నిస్సహాయత వంటివాటి వల్ల మహిళలు సాధారణంగా హింస బారిన పడుతుంటారు.

ఆందోళన వద్దు..

సమస్య వచ్చినప్పుడు అరచేయి కూడా ఆయుధం కావాలంటే... ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టాలి. కుటుంబ పరువు పోతుందనీ, సమాజంలో చెడ్డ పేరు వస్తుందనీ భయపడటం, పిల్లల భవిష్యత్తుకోసం ఆందోళన పడటం వంటివి చేయొద్దు. మీరు నోరు విప్పితే చాలు మీకు అండగా ఉండేందుకు చాలామందే ఉన్నారు. మిమ్మల్ని ఆ నరకం నుంచి బయటపడేస్తారు.

దోపిడీ అడ్డుకుంటారు...

మహిళలపై జరిగే హింస, దోపిడీని, బాలికల అక్రమ రవాణా, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడానికి హైదరాబాద్‌ కేంద్రంగా మై ఛాయిసెస్‌ ఫౌండేషన్‌ ఏర్పాటైంది. మైనర్‌ పెళ్లిళ్లు, సెక్స్‌ ట్రాఫికింగ్‌ విషయాల్లో సాయం కోసం 18004198588 నంబరుకు, గృహహింస బాధితులు రక్షణకోసం 18002129131కు మిస్డ్‌కాల్‌ ఇచ్చినా చాలు. 24 గంటల్లోగా ఈ సంస్థ ‘పీస్‌ మేకర్లు’ మిమ్మల్ని చేరుకుంటారు. దేశంలో ఏ మూల ఉన్నా... స్థానిక ఎన్‌జీవోల సాయంతో ఆపద నుంచి బయట పడేస్తారు.


మీకు తెలుసా?

యూఎన్‌ ఉమెన్‌, డబ్ల్యూహెచ్‌వో నివేదికల ప్రకారం...

  • భారతీయ వివాహితల్లో 40శాతంమంది నిత్యం తమ ఇళ్లల్లో వేధింపులనూ, హింసనూ ఎదుర్కొంటున్నారట.
  • ప్రతి ముగ్గురు స్త్రీలలో ఇద్దరు... తాము ఎదుర్కొంటున్న హింస, వేధింపుల గురించి ఎవరితోనూ ఎప్పుడూ పంచుకోలేదట. హింస నుంచి తప్పించుకోవడానికి ఎవరి సాయమూ కోరలేదు.
  • ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ జీవిత కాలంలో శారీరక, లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారేనట.

పునరావాసం కల్పిస్తారు...

సయోధ్య హోమ్స్‌.. లైంగిక, గృహహింస బాధితులైన మహిళలూ, పిల్లలకు పునరావాసం కల్పిస్తారిక్కడ. అవసరమైన వైద్య సాయం, కౌన్సెలింగ్‌ చేస్తారు. నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గాలనూ చూపిస్తారు. అత్యవసర సాయం కోసం సంప్రదించాల్సిన నంబరు 18005991811


మహిళలపై జరుగుతున్న హింసాత్మక చర్యలను మౌనంగా భరించకుండా అందుబాటులో ఉన్న భరోసా, సఖి కేంద్రాలను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. డయల్‌ 100తో పాటు ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 1091, జాతీయ మహిళా కమిషన్‌ 7827170170కు ఫోన్‌ చేయొచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్