ఏం వద్దో చూసుకున్నారా?

కెరియర్‌ అయినా, వ్యాపారమైనా మేమూ ఎవరికీ తీసిపోము అంటున్నారీ తరం అమ్మాయిలు. టాప్‌లో నిలవడానికి ఎంత కష్టపడటానికైనా సిద్ధమంటున్నారు.

Published : 08 Feb 2024 04:14 IST

కెరియర్‌ అయినా, వ్యాపారమైనా మేమూ ఎవరికీ తీసిపోము అంటున్నారీ తరం అమ్మాయిలు. టాప్‌లో నిలవడానికి ఎంత కష్టపడటానికైనా సిద్ధమంటున్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి విజేతల రహస్యాలను తెలుసుకుంటుంటారు కదా! మరి ఏ లక్షణాలు ఉండొద్దో చూసుకున్నారా?

  • ఎప్పటి పని అప్పుడు పూర్తిచేస్తారా? ఆఖరి నిమిషం వరకూ వేచి చూస్తారా? కొన్నిసార్లు సమయం వెంట పరుగెత్తి టాస్క్‌లు పూర్తిచేయాల్సి వస్తుంది. అది సహజమే. చాలా సమయం ఉందిలెమ్మని కూర్చోవడం, ఫోన్లు, చాటింగ్‌లు, ఇతర వ్యాపకాలు చూసుకుంటూ ఆఖర్లో పరుగులు తీస్తోంటే మాత్రం తీరు మార్చుకోవాల్సిందే. హడావుడిగా చేసే పనిలో తప్పులకు ఆస్కారమెక్కువ. ఆ నెగెటివ్‌ అభిప్రాయం చాలదూ... వెనకబడటానికి!
  • ‘బాస్‌కి నేనంటే ఇష్టం లేదు, తనేం చేసినా మెచ్చుకుంటారు’ ఇలా ప్రతికూలంగా ఆలోచిస్తోంటే ఇక పనెలా ముందుకు సాగుతుంది? మనసు నిరాశ, అసూయలతో నిండితే స్పష్టమైన ఆలోచనలూ రావు. కాబట్టి, వేరే వాళ్ల ఆలోచనలు మాని, ‘ఈరోజు ఇవి చేయాలి’ అనుకుంటూ చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి. వాటిని పూర్తిచేస్తూ వెళ్లండి. మీ పనితనం పైవాళ్లకి తెలుస్తుంది. మీలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
  • ‘నేను అప్పుడు చేశాను, అన్ని అవార్డులు అందుకున్నా’... లాంటివి రెజ్యూమెకి అదనపు విలువ తేవడానికి బాగుంటాయి. కానీ గతం గతః అన్నమాట విన్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎంత మెరుగ్గా పనిచేస్తున్నారన్నదే ముఖ్యం. మనకు ఇల్లు, పిల్లల బాధ్యతలు అదనమే అయినా, వాటి సాకుతో పనిచేయకపోవడం, పొరపాట్లకు తావిస్తానంటే కుదరదు కదా? ఎంతవరకూ చేయగలరో చేయండి... అయితే ఆ పని కచ్చితంగా ఉంటే చాలు. సంస్థలో మీ స్థానమెప్పుడూ పదిలమే.
  • ‘అమ్మో తప్పులొస్తాయి, బాబోయ్‌ తిడతారు’... అని ప్రతిదానికీ వెనకాడొద్దు. కచ్చితత్వానికి మారుపేరైన సాంకేతికత కూడా కొన్నిసార్లు పొరపాటు చేస్తుంది. మనుషులం కావాలని కాకపోయినా తెలియకుండానే పొరపాట్లు జరుగుతాయి. అలాగని భయపడుతూ ఉంటే మిమ్మల్ని ఎవరైనా ఎలా నమ్ముతారు? నాయకురాలవ్వడానికీ, పొరపాట్లకు బాధ్యత వహించడానికి వెనకాడొద్దు. తప్పులకు వెరవక వాటి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే చాలు... అప్పుడు ఆగిపోవడమన్న మాటే ఉండదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్