అయితే... ప్రేమలో పడండి!

‘నాయకత్వానికి దూరమనే మహిళలే ఎక్కువ’ చాలా అధ్యయనాలు చెబుతోన్న మాటే ఇది. చేయగలదా అన్న సందేహాలు, ఈమె చెబితే చేయాలా అన్న తోటివారి ధోరణి... ఒత్తిడి పెంచుతోంటే వెనకడుగు వేయడానికే మొగ్గు చూపుతున్నారంతా. అలా అయితే వెనకబడ్డట్టేగా! బదులుగా సవాళ్లతో ప్రేమలో పడి చూడండి అంటున్నారు నిపుణులు.

Updated : 23 Feb 2024 04:34 IST

‘నాయకత్వానికి దూరమనే మహిళలే ఎక్కువ’ చాలా అధ్యయనాలు చెబుతోన్న మాటే ఇది. చేయగలదా అన్న సందేహాలు, ఈమె చెబితే చేయాలా అన్న తోటివారి ధోరణి... ఒత్తిడి పెంచుతోంటే వెనకడుగు వేయడానికే మొగ్గు చూపుతున్నారంతా. అలా అయితే వెనకబడ్డట్టేగా! బదులుగా సవాళ్లతో ప్రేమలో పడి చూడండి అంటున్నారు నిపుణులు.

  • గడువులోగా పని ముగించడం, పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడటం... చెప్పినంత సులువేమీ కాదు. కానీ ఆ కంగారులోనే ఒత్తిడి కమ్మేస్తుంది. అది పెరుగుతున్న కొద్దీ మరిన్ని తప్పులు దొర్లుతాయి. వాటిని దాటడానికి అవసరమైన మార్గాలూ కనిపించవు. కాబట్టి, కంగారొద్దు. సవాళ్లు వస్తాయని ఎలాగూ తెలుసు కదా! వాటిని ప్రేమించండి. భారంలా కాకుండా మిమ్మల్నెలా పరీక్షిస్తాయా అని ఉత్సాహంగా ఎదురు చూడండి. వాటిని పరిష్కరిస్తుంటే వచ్చే మజానే వేరు.
  • నాయకురాలి హోదా అంత సులువేం కాదు. కనిపించగానే పలకరింపులు, సలహాలు, అనుమతుల కోసం అభ్యర్థనలు వగైరా ఉంటాయి. కానీ, ఆఫీసు వాతావరణంలో మనసు విప్పి మాట్లాడే స్నేహితులే కష్టం. ఉన్నత స్థానానికి వెళ్లే కొద్దీ ఒంటరవ్వడం మామూలే. అలాగని కుంగిపోనక్కర్లేదు. మీకు తోడు నిలిచే, మాటలను ఆలకించే, సలహాలనిచ్చే స్నేహితుల కోసం బయట వెతకండి. వారితో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఒంటరి భావన వదిలి ఒకరు అండగా ఉన్నారన్న ఊహతో పనిచేయడం కొత్త ప్రేరణని ఇస్తుంది.
  • మనల్ని ఒకరు తిట్టుకుంటున్నారంటే ఎంత బాధ? కానీ ‘బాస్‌ ఎవరైనా... అందరికీ నచ్చరు’ ఈ నిజాన్ని నమ్మక తప్పదు. కొందరు ఎదురుగానే మీ నిర్ణయాన్ని వ్యతిరేకించొచ్చు. వారి వల్ల ఇబ్బందేమీ ఉండదు. ముందు సరే అని వెనక తెగిడే వారితోనే ఇబ్బందంతా. అలాగని అతిగా ఆలోచిస్తూనో, వాళ్లని మార్చాలనో కూర్చుంటే మొదటికే మోసం వస్తుంది. బృందంలో అందరి పనితీరూ మిమ్మల్ని మెప్పించదు కదా! అలాగే ఇదీ అనుకోండి. విమర్శలు, ఫిర్యాదులు సరైన రీతిలో ఉంటే మార్చుకోండి, లేదనిపిస్తే నమ్మిన బాటలో సాగితే సరి. నిర్ణయమేదైనా ముందు మీ ఆత్మవిశ్వాసం చెడదు.
  • ఇవన్నీ చెప్పినంత సులువు కాదు. ఆఫీసులో రాణిస్తే, ఇంట్లో వ్యతిరేకత రావొచ్చు. కుటుంబానికి ప్రాధాన్యమిస్తే ఇక్కడ వెనకబడుతున్నామని అనిపించొచ్చు. ఆ క్షణం ఎక్కడ మీ అవసరం ఎక్కువ అన్నది బేరీజు వేసుకోండి. ఇంటా బయటా గెలుపు ఖాయం. అయితే వచ్చే ప్రతి సవాలునీ చిరునవ్వుతో స్వీకరించగలగాలి మరి!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్