ఈ అలవాట్లు ఉన్నాయా?

ఉద్యోగం కావాలంటే కనీసం డిగ్రీ ఉండాలన్నది పాత మాట. కెరియర్‌లో ముందుకు సాగాలంటే కాలానికి తగ్గట్టుగా నేర్చుకోవాలన్నది నేడు సంస్థలు అంటోన్న మాట. అయితే ఏమిటి, ఎలా నేర్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ముందు చెడు అలవాట్లను మార్చుకోవాలి అంటున్నారు నిపుణులు.

Published : 01 Mar 2024 02:02 IST

ఉద్యోగం కావాలంటే కనీసం డిగ్రీ ఉండాలన్నది పాత మాట. కెరియర్‌లో ముందుకు సాగాలంటే కాలానికి తగ్గట్టుగా నేర్చుకోవాలన్నది నేడు సంస్థలు అంటోన్న మాట. అయితే ఏమిటి, ఎలా నేర్చుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ముందు చెడు అలవాట్లను మార్చుకోవాలి అంటున్నారు నిపుణులు. అవేమిటంటే..

పోలిక...

‘ఆమెకు పదోన్నతి వచ్చింది... నాకు రాలేదు’, ‘నన్నయితే కోప్పడతారు, ఆమెను మాత్రం ఏమనరు’... ఆఫీసుల్లో ఈ తరహా పోలికలు చాలా సాధారణం. ఫలితమేంటి? కోపం లేదా బాధ. బదులుగా ‘నేనెందులో గొప్ప, నా ప్రత్యేకతలేంటి’ అని ఆలోచించండి. వాటిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడమే కాదు, ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుందట. ఎదుగుదలకు ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం ఏముంటుంది చెప్పండి?

బాధ్యతలను పక్కన పెట్టండి

అదేంటి? ఎవరైనా బాధ్యతలను తీసుకోవడానికి ముందుకు రమ్మంటారు కదా! ఇలా చెబుతారేంటి అనుకోవద్దు. ‘నో’ చెప్పడం రాకో, మొహమాటం కొద్దో అప్పగించిన పనులన్నీ మీదేసుకుంటాం. ‘మీరు మల్టీటాస్కర్లు’ అనగానే సరేనని చేసేస్తుంటాం. అలసటే కాదు... చేసే పనిపై ఆసక్తీ తగ్గుతుంది. అంతేనా వేరే వాళ్ల చేతిలో మర మనుషుల్లానూ మిగిలిపోవాల్సి వస్తుంది. అలా కావొద్దంటే ‘భారం’ అవుతోంది అనుకున్నప్పుడల్లా ‘చేయలేను’ అని చెప్పండి. తప్పుగా అర్థం చేసుకుంటారు అనిపిస్తే... టీమ్‌లో తప్పించుకునే వాళ్లను ఉదాహరణగా చూపించేయండి.

వదిలేయండి..

కొందరి తీరు భలేగుంటుంది. ముందు ప్రేమగా ఉంటారు. వెనక ఫిర్యాదులు చేస్తుంటారు. పని చేసీ తిట్లు తినడం ఎవరికి మాత్రం నచ్చుతుంది చెప్పండి. వాళ్లని పట్టించుకున్నప్పుడే బాధ... వదిలేయండి. వాళ్లు మనల్ని వదలాలిగా అంటారా? అడిగినా అడగకపోయినా ఫలానా పరిస్థితి గురించి పైవాళ్లతో నేరుగా మాట్లాడేయండి. మీరే విషయం చెప్పినప్పుడు ఇక అపార్థాలకు తావేది?
ఇవేకాదు బాగోదంటూ గంటలకొద్దీ కుర్చీకే పరిమితం అవ్వడం, ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం కూడా చెడు అలవాట్ల కిందకే వస్తాయి. వీటన్నింటినీ వదిలించుకోండి. కోరుకున్న స్థాయికి తప్పక చేరతారంటే నమ్మండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్