అది ఆఫీసులో కుదరదు!

ఇంట్లో, స్నేహితులతో... మనసు బాగుంటే ఆనందంగా నవ్వుతూ మాట్లాడేస్తాం. మూడ్‌ బాగోకపోతే మూతి ముడుచుకొని కూర్చుంటాం. మనవాళ్లు కదా... అర్థం చేసుకుంటారు. ఆఫీసులో మాత్రం అలా కుదరదు. కుర్చీలో కుర్చొనేప్పటికి గజిబిజి ఆలోచనలను డిలీట్‌ కొట్టి, సానుకూలంగా పనిలోకి దిగాల్సిందే!

Published : 31 Mar 2024 01:35 IST

ఇంట్లో, స్నేహితులతో... మనసు బాగుంటే ఆనందంగా నవ్వుతూ మాట్లాడేస్తాం. మూడ్‌ బాగోకపోతే మూతి ముడుచుకొని కూర్చుంటాం. మనవాళ్లు కదా... అర్థం చేసుకుంటారు. ఆఫీసులో మాత్రం అలా కుదరదు. కుర్చీలో కుర్చొనేప్పటికి గజిబిజి ఆలోచనలను డిలీట్‌ కొట్టి, సానుకూలంగా పనిలోకి దిగాల్సిందే! సరైన తీరును గమనించుకోవాల్సిందే!

  • ఒక ప్రాజెక్టు ఓకే అవ్వడానికి సగం మనం చేసిన హోమ్‌వర్క్‌ కారణమైతే... మిగతా సగం ఎంత నింపాదిగా, ఆసక్తికరంగా దాని గురించి వివరించారన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. అదే చిరాకుతో ఉన్నామనుకోండి. అవతలివాళ్లు అడిగే ప్రతిదానికీ అసహనం వస్తుంది. చిన్నదానికే కోపం తన్నుకొస్తుంది. ఈ తీరు సరిగా సిద్ధమవలేదనో, ఏవో లోపాల్ని దాస్తున్నట్లుగానో అనుకునే ప్రమాదం ఉంది. అందుకే చిరాకులన్నీ బయటే వదిలేయాలి.
  • క్లయింట్‌తో మీటింగ్‌... అకస్మాత్తుగా క్యాన్సిల్‌ అయ్యింది. అప్పటిదాకా ఎంతో సిద్ధమై ఉంటాం. తీరా చివరి నిమిషంలో ఇప్పుడు కాదంటే ఎవరికైనా కోపం వస్తుంది. అలాగని అది చూపిస్తానంటే కుదరదు. అవతలివాళ్ల తీరు నచ్చలేదా పైవాళ్లతో మాట్లాడండి. ఏం చేయాలన్న సలహా తీసుకోండి. ఎందుకంటే అక్కడ మీరు సంస్థ ప్రతినిధి. మీరేం చేసినా సంస్థ చేసినట్లుగా భావిస్తారు. అది ఒక్కోసారి నష్టాలకీ దారి తీయొచ్చు. అందుకే కోపం దాటనివ్వకూడదు.
  • ఇంటి పనులు, ఆఫీసు, ప్రయాణం... హడావుడి సహజమే. కొన్ని విషయాలు మర్చిపోతాం కూడా. తీరా ఏ అర్ధరాత్రో గుర్తొస్తుంది. అప్పుడేం చేస్తారు? ఫోన్‌ తీసి సూచనలు మొదలుపెట్టేయొద్దు. తగిన సమయమేనా అని చూడండి. వీలుంటే ఓ మెసేజ్‌ పెట్టి వదిలేయండి. తర్వాత ఉదయాన్నే ఫోన్‌ కాల్‌లోనో, ఆఫీసులోనో వివరంగా మాట్లాడొచ్చు. కంగారుపడ్డారో... విషయం మరింత   జఠిలం కాగలదు.
  • కొన్ని పనుల్ని అప్పటికప్పుడు పూర్తిచేయాలి. వేగంగా చేసినప్పుడు తప్పులు సహజమే! మరీ ఎక్కువగా ఉంటే అవతలివారికీ కోపం వస్తుంది. ఆ సమయంలో అర్థం చేసుకోవాలి అనుకోవడమూ తప్పే. కాబట్టి, ఓసారి సరిచూసుకున్నాకే ఇవ్వండి. అప్పుడు ఈ ఇబ్బందులు ఉండవు. ఇవన్నీ ఎవరూ దగ్గరుండి నేర్పించరు. ఇలా ఉండాలనీ సరిచేయరు. కానీ గమనించుకొని తెలుసుకోవాల్సిన అంశాలివి. అశ్రద్ధ చేశారో ఎదిగే క్రమంలో ఆటంకాలు కాగలవు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్