వచ్చింది... దేవిక!

నుదుటిన ఎర్రటి బొట్టు. చెవులకి చక్కని బుట్టలు. ముక్కుకు ముక్కెర, అందమైన చీరకట్టు, చేతినిండా గాజులు... చూడగానే భారతీయత ఉట్టిపడే అమ్మాయి దేవిక. తన లుక్‌తోనే కాదు, పనితనంతోనూ ప్రపంచాన్ని ఆకర్షించేసింది.

Published : 04 Apr 2024 01:53 IST

నుదుటిన ఎర్రటి బొట్టు. చెవులకి చక్కని బుట్టలు. ముక్కుకు ముక్కెర, అందమైన చీరకట్టు, చేతినిండా గాజులు... చూడగానే భారతీయత ఉట్టిపడే అమ్మాయి దేవిక. తన లుక్‌తోనే కాదు, పనితనంతోనూ ప్రపంచాన్ని ఆకర్షించేసింది. ఇంతకీ ఎవరీ అమ్మాయి అంటే...

దేవిక... ఏఐ ఇంజినీర్‌. ఇంకా పక్కాగా చెప్పాలంటే యూఎస్‌కి చెందిన స్టార్టప్‌ కంపెనీ ‘డెవిన్‌’ పేరుతో ప్రపంచంలోనే స్వయం ప్రతిపత్తితో పనిచేయగల ఏఐ కోడర్‌ని రూపొందించింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచానికి పరిచయం చేసింది. దానికి పోటీగా దేశీయంగా తయారైంది మన దేవిక. తను మనిషి కాదు, వర్చువల్‌ మాయ. కానీ మన పనుల్ని సులభతరం చేయడానికి సిద్ధమైంది. మనం వాడే సాంకేతికత ఏదైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలంటే తెర వెనక బోలెడు కమాండ్స్‌ పనిచేయాలి. సాఫ్ట్‌వేర్‌ పరిభాషలో కోడింగ్‌ అని చెప్పొచ్చు. దాన్ని వేగంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తిచేయడంలో దేవిక దిట్ట. మనమిచ్చిన సూచనలను అర్థం చేసుకొని, కాస్త పరిశోధన చేసి మరీ కోడింగ్‌ పూర్తిచేస్తుందట. కోడింగ్‌కి సంబంధించి ఎంతటి క్లిష్టమైన పనైనా అలవోకగా చేయగలదు. మధ్యలో మనం చెక్‌ చేయడం, చిన్న చిన్న పొరపాట్లను సవరించడం లాంటివి అసలు అవసరమే ఉండదు. తనే ప్రతి దశని సరిచూసుకొని, తప్పిదాలుంటే సరిచేసుకోగలదు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలదు. దేవికను కేరళకు చెందిన లిమినల్‌ అండ్‌ స్టిషన్‌ వ్యవస్థాపకుడు, 21 ఏళ్ల ముఫీద్‌ రూపొందించాడు. అయితే ‘డెవిన్‌’తో పోలిస్తే మన దేవిక కాస్త వెనకబడే ఉంది. దాన్నీ అధిగమించి పోటీలో నిలిపే పనిలో ఉన్నారు ఆమె రూపకర్తలు. వెనకా ముందూ ప్రస్తావన పక్కన పెడితే తన ఆహార్యంతో, పనితనంతో ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించడంలో మాత్రం దేవిక సఫలమైంది. డెవిన్‌కి చేసినట్లుగా మధ్యలో సరిచేయాల్సిన పని లేకపోవడం తన ప్రత్యేకత. అందుకే ఇలా ఇంకెన్ని సర్‌ప్రైజ్‌లను మోసుకొస్తుందో చూడాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారంతా. ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్