విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!

వేదికపై నిలబడిన ఆ అందమైన భామలంతా మెరుపు తీగల్లా ఉన్నారు. ‘మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌-2024’ అర్హత కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఎంపిక ముగిసింది. మైకులో ‘అలెజాండ్రా మారిసా రోడ్రిగేజ్‌’ పేరు వినబడటంతో అంతా ఆశ్చర్యపోయారు.

Updated : 29 Apr 2024 12:35 IST

వేదికపై నిలబడిన ఆ అందమైన భామలంతా మెరుపు తీగల్లా ఉన్నారు. ‘మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌-2024’ అర్హత కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఎంపిక ముగిసింది. మైకులో ‘అలెజాండ్రా మారిసా రోడ్రిగేజ్‌’ పేరు వినబడటంతో అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందాల పోటీలంటే పాతికేళ్లలోపు యువతులు వేదికపై మెరుస్తారు. అయితే తొలిసారిగా 60 ఏళ్ల రోడ్రిగేజ్‌ తనకన్నా రెండుపదుల వయసు తక్కువ ఉన్నవాళ్లను వెనక్కు నెట్టి మరీ కిరీటాన్ని సొంతం చేసుకుంది.

‘ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విశ్వసుందరి పోటీల్లో 60ఏళ్లవారూ... పాల్గొనవచ్చనే అవకాశాన్ని పొందిన తొలిమహిళను కావడం సంతోషంగా ఉంద’ంటున్న రోడ్రిగేజ్‌ది అర్జెంటీనాలోని లాప్లాటా. వృత్తిరీత్యా న్యాయవాది, జర్నలిజంలోనూ అనుభవం ఉందీమెకు. ఇటీవల అర్జెంటీనాలో ‘మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌ 24’ పోటీలు జరిగాయి. అందాల పోటీలంటే 18-28లోపు వారిని మాత్రమే అర్హులుగా పరిగణించే ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీ నిర్వాహకులు ఈ ఏడాది మాత్రం 18 ఏళ్లు నిండిన మహిళలంతా పాల్గొనొచ్చని ప్రకటించారు. ‘నా వయసువారి తరఫున, అలాగే నా మాతృభూమి నుంచి ప్రాతినిథ్యం వహించగలగడం గర్వంగా ఉంది. అందాల పోటీలంటే మహిళల శారీరక సౌందర్యం మాత్రమే కాదు, విలువల్నీ ప్రామాణికంగా తీసుకుంటారు అనడానికి నేను నిదర్శనం కావాల’ని చెబుతోందీ 60 ఏళ్ల అందగత్తె. ప్రస్తుతం ‘మిస్‌ యూనివర్స్‌-24’కు మిస్‌ అర్జెంటీనాగా అర్హతను సాధించడానికి బ్యూనస్‌ ఎయిర్స్‌ నుంచి పోటీకి ఎంపికైందీమె. మేలో జరగనున్న పోటీల్లో ఈమె విజేతగా నిలిస్తే, సెప్టెంబరులో మెక్సికోలో ప్రపంచస్థాయిలో నిర్వహించే ‘మిస్‌ యూనివర్స్‌-24 పోటీల్లో పాల్గొనే అర్హతను పొందుతుంది.

రహస్యమేంటంటే...

ఆరు పదులు నిండినా చెక్కుచెదరని రోడ్రిగేజ్‌ అందం వెనుక రహస్యం వారానికి  మూడురోజులపాటు క్రమం తప్పకుండా చేసే వ్యాయామమట. ఉదయం, రాత్రి భోజనానికి మధ్య ఎక్కువ విరామం, లేదా ఉపవాసం పాటించడంతోపాటు ఆహారంలో పోషకాలుండేలా జాగ్రత్త పడుతుందట. తాజా కాయగూరలు, పండ్లుసహా రోజుకు నాలుగైదు లీటర్ల నీటిని తీసుకోవడంతో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతుందట. మానసికారోగ్యానికి పెద్దపీట వేసే రోడ్రిగేజ్‌ ప్రకృతినెంతో ప్రేమిస్తుంది. మనసుకు నచ్చినట్లు జీవించడం, సంగీతం వినడంతో నిత్యం సంతోషంగా ఉంటుందీమె. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యక్తిగత సమయాన్ని కేటాయించుకోవడం, స్వీయ ప్రాతినిధ్యానిచ్చుకునే ఈమె ఆరు పదుల్లోనూ అందగత్తెగా నిలవడమే కాదు, విశ్వసుందరిగా గెలవాలని ఆశిద్దాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్