మా మేనేజర్‌.. కోరిక తీర్చమని వేధిస్తున్నాడు..!

నాకు పెళ్లయ్యింది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా. మా మేనేజర్‌ ప్రేమ పేరుతో వెంటపడటం, లైంగిక వాంఛ తీర్చమని వేధించడం తట్టుకోలేక హెచ్‌ఆర్‌కి ఫిర్యాదు చేశా. ఇది జరిగి మూడు నెలలయ్యింది.

Updated : 14 May 2024 18:26 IST

నాకు పెళ్లయ్యింది. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా. మా మేనేజర్‌ ప్రేమ పేరుతో వెంటపడటం, లైంగిక వాంఛ తీర్చమని వేధించడం తట్టుకోలేక హెచ్‌ఆర్‌కి ఫిర్యాదు చేశా. ఇది జరిగి మూడు నెలలయ్యింది. ఇప్పటివరకూ వాళ్లు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. పైగా ఇలా బయట మాట్లాడితే నీ పరువే పోతుంది. ఇష్టం లేకపోతే ఉద్యోగం మానేయ్‌ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. అతడూ తన బుద్ధి మార్చుకోలేదు. మా వారు ఆఫీసులో చర్యలు తీసుకోకపోతే బయట పోలీస్‌ కేసు పెడదాం అంటున్నారు. దీనివల్ల నాకు న్యాయం జరుగుతుందా?

ఓ సోదరి

పనిచేసే చోట లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడం కోసం 2013లో ‘పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం’ వచ్చింది. 1997లో ‘విశాఖ వర్సెస్‌ రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వం’ మధ్య జరిగిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన నియమావళి ఆధారంగా ఈ యాక్ట్‌ని రూపొందించారు. దీని ప్రకారం పదిమంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఒక ఇంటర్నల్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. వీళ్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేస్తారు. ఒకవేళ అలా చేయకపోతే కంపెనీ వ్యాపార లైసెన్సులు కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. ముందు మీరు కంప్లయింట్‌ ఇచ్చినా ఎటువంటి యాక్షన్‌ తీసుకోవడం లేదని విమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌లో ఫిర్యాదు చేయండి. వారు పిలిపించి మాట్లాడతారు. అదీ జరగకపోతే జిల్లా మేజిస్ట్రేట్‌ లేదా అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌కోర్టులో ప్రైవేటు కంప్లయింట్‌ ఫైల్‌ చేయండి. మీ సంస్థనూ, ఫిర్యాదు కమిటీ సభ్యులనూ ప్రతివాదులుగా చేర్చండి. లైంగిక వేధింపులను తీవ్రమైన నేరారోపణగా పరిగణిస్తారు. సంఘటన జరిగిన మూడు నెలల్లోపు ఇంటర్నల్‌ కమిటీకి కంప్లయింట్‌ చేయాలి. అందుకు మీరు తగిన సాక్ష్యాధారాలు చూపించగలగాలి. క్రిమినల్‌ కేసు ఫైల్‌ అయ్యి... ఆ నేరం నిరూపణ అయితే నిందితులకు జైలు శిక్ష పడుతుంది. అబద్ధమని తేలితే కంప్లయింట్‌ చేసినవారికీ జరిమానా విధించొచ్చు. ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్