ఒంటరిగా విహరిస్తున్నారా.. అయితే!

ఒంటరిగా ప్రయాణించాలని.. దేశాలని చుట్టిరావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ స్నేహితులతో ట్రిప్‌ అంటేనే ఆలోచించే తల్లిదండ్రులు ఒంటరిగా ఎక్కడికైనా పంపిస్తారా? అంతెందుకు... వెళ్దామని ప్లాన్‌ వేసినా మనకే ఏదో ఆందోళన.. ఊరుగాని ఊరు, భాషగాని భాష.. ఎక్కడ ఉండాలి, ఎలా వెళ్లాలి, భోజనం.. ఒకటా రెండా ప్లాన్‌ వేసిన దగ్గర నుంచి అన్నీ భయాలే కదూ.

Published : 22 May 2024 01:38 IST

ఒంటరిగా ప్రయాణించాలని.. దేశాలని చుట్టిరావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ స్నేహితులతో ట్రిప్‌ అంటేనే ఆలోచించే తల్లిదండ్రులు ఒంటరిగా ఎక్కడికైనా పంపిస్తారా? అంతెందుకు... వెళ్దామని ప్లాన్‌ వేసినా మనకే ఏదో ఆందోళన.. ఊరుగాని ఊరు, భాషగాని భాష.. ఎక్కడ ఉండాలి, ఎలా వెళ్లాలి, భోజనం.. ఒకటా రెండా ప్లాన్‌ వేసిన దగ్గర నుంచి అన్నీ భయాలే కదూ. ఇక ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టే. ఎవరి తోడూ లేకుండా చేతిలో ఫోన్‌ ఉంటే చాలు టెక్నాలజీ సాయంతో ప్రపంచాన్ని ఒంటరిగానే చుట్టిరావచ్చు. అదెలాగంటారా..

భద్రతకోసం..

ఆడపిల్లలు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులకు మనశ్శాంతి ఉండదు కదూ! ప్రస్తుతం ప్రతిఒక్కరి దగ్గరా ఫోన్‌ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు పేరెంట్స్‌కో, స్నేహితులకో వాట్సాప్‌లో లైవ్‌ లొకేషన్‌ పంపించండి. దీనిద్వారా మీరెక్కడున్నారో ప్రతి క్షణం వారు అప్‌డేట్‌ తెలుసుకోవచ్చు. మీరు వెళ్లాలనుకున్న ప్రదేశానికి చేరుకోగానే వాళ్లకి ఫోనో, మేసేజో చేసి తెలియజేయండి. దీంతో మీ తల్లిదండ్రులకూ ఎలాంటి భయాందోళనలు ఉండవు. క్యాబ్‌ బుక్‌ చేసుకోవాల్సి వచ్చినప్పుడు సాస్‌(ఎస్‌ఓఎస్‌) యాప్‌ని యాక్టివ్‌లో పెట్టుకుంటే చాలు ఎలాంటి అభద్రతాభావం, భయాలూ లేకుండా ప్రయాణించవచ్చు.

విహరించేందుకు..

మన దగ్గర రాపిడో, ఊబర్‌ల్లా విదేశాల్లో గ్రాబ్, యాండేక్స్‌ లాంటి టాక్సీ యాప్స్‌ ఉంటాయి. విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఈ యాప్స్‌ బాగా ఉపయోగపడతాయి. తక్కువ ఖర్చుతో సులువుగా మనం ఉన్న చోటుకే క్యాబ్‌ వస్తుందన్నమాట. కాకపోతే ముందే వీటి గురించి తెలుసుకుని ఏ యాప్‌ సెక్యూర్‌గా ఉంటుందో రివ్యూస్‌ చూసి వెళ్తే ఆ సమయానికి గందరగోళ పడే అవసరం ఉండదు.

భోజనం కోసం..

రోజంతా తిరిగి బసకి చేరుకునే వరకు ఆలస్యం అవుతుంది. తీరా చూస్తే తినడానికి ఏమీ ఉండదు. చేసుకుందామా అంటే అప్పటికే బాగా అలసిపోయి ఉంటాం. తిందాం అని బయటికి బయల్దేరామా.. ఆ సమయంలో సరైన ఆహారం దొరకదు. ఓ పక్క ఆకలి దంచేస్తుంటుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఈ ఇబ్బందులన్నీ సహజం.. అందుకే మంచి ఆహారం కోసం ఫుడ్‌ యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

భాష తెలియాలంటే..

విదేశీ విహారయాత్రలకు వెళ్లాలనుకున్నప్పుడు ముందుగా మొదలయ్యే సమస్య భాష. అది రాకపోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందనే భయం ఉంటుంది కదూ! దానికోసం గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. మీకు ఏ భాష కావాలంటే అది ఎంపిక చేసుకుని సమాచారం తెలుసుకోవచ్చు.

మ్యాప్స్‌ ఉండాల్సిందే..

ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మ్యాప్‌లు పెట్టుకుని సరైన గమ్యస్థానానికే వెళ్తున్నామో లేదో చూసుకుంటూ ఉండాలి. కొండలు, చెట్లు, జలపాతాలు.. లాంటి ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మొబైల్‌లో సిగ్నల్‌ ఉండకపోవచ్చు, ఇంటర్నెట్‌ సరిగ్గా రాకపోవచ్చు. కాబట్టి నెట్‌ని నమ్ముకుని మాత్రం ఒంటరిగా ప్రయాణించొద్దు. ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఆ ప్రదేశానికి సంబంధించిన మ్యాప్‌ని ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకుంటే అడ్రస్‌ కనుక్కోవడంలో ఇబ్బంది ఉండదు.

లోకల్‌ గైడ్‌ కోసం..

ఒంటరిగా ఎక్కడైనా వెళ్లాలని ప్లాన్‌ వేసుకున్నప్పుడు మొదట చూసేది దానికి సంబంధించిన రివ్యూస్, ఫొటోలు. అయితే అక్కడికి వెళ్లాక అన్నీ దగ్గరుండి చూపించడానికి ఒక లోకల్‌ గైడ్‌ని ఎంచుకోవచ్చు. ప్రతి టూరిస్ట్‌ ప్రదేశాల్లో లోకల్‌ గైడ్స్‌ ఉంటున్నారు. ముఖ్యంగా మీరు వెళ్లిన చోటల్లా వెంటనే స్నాప్, ఇన్‌స్టా స్టోరీలు పెట్టేయకండి. అది మిమ్మల్ని చిక్కుల్లో పడేయొచ్చు. ముందుజాగ్రత్త కోసం లోకల్‌ సిమ్‌ కార్డు కూడా తీసుకోండి. హాయిగా విహరించేయండి. హ్యాపీ జర్నీ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్