కెరీర్‌లో రాణించాలంటే ఆ అలవాట్లు మార్చుకోవాల్సిందే!

పని.. పని.. పని.. ఆఫీస్‌లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి, తిరిగి ఇంటికి చేరుకునే దాకా పనే లోకంగా, వ్యవహరిస్తుంటాం. అయితే పని పైనే ఎంత దృష్టి పెట్టినా కొన్ని అలవాట్లు ఆఫీస్‌లో మన పనికి తగ్గ గుర్తింపు దక్కకుండా....

Published : 26 May 2023 11:58 IST

పని.. పని.. పని.. ఆఫీస్‌లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి, తిరిగి ఇంటికి చేరుకునే దాకా పనే లోకంగా, వ్యవహరిస్తుంటాం. అయితే పని పైనే ఎంత దృష్టి పెట్టినా కొన్ని అలవాట్లు ఆఫీస్‌లో మన పనికి తగ్గ గుర్తింపు దక్కకుండా చేస్తాయంటున్నారు నిపుణులు. తద్వారా ఎంత సమర్థంగా పనిచేసినా అందుకు తగ్గ ఫలితం అందుకోలేకపోతామని చెబుతున్నారు. వ్యక్తిగతంగా ఈ అలవాట్లను మార్చుకుంటేనే.. కెరీర్‌లోనూ రాణించచ్చంటున్నారు. మరి, ఏంటా అలవాట్లు? తెలుసుకుందాం రండి..

ప్రతిరోజూ లేటేనా?

ఒకసారి పొరపాటు జరిగితే మరోసారి అది పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాం. ఆఫీస్‌ పని వేళలకూ ఇది వర్తిస్తుంది. ఒక రోజు ఆఫీస్‌కి రావడం ఆలస్యమైతే.. మరుసటి రోజు ఇంకాస్త ముందే బయల్దేరతాం. అయితే కొంతమంది రోజూ ఆలస్యంగానే వస్తుంటారు. ఏవేవో సాకులు చెబుతుంటారు. ఆఫీస్‌ పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చిందని అబద్ధాలాడే వారూ లేకపోలేదు. ఏదేమైనా తరచూ ఇలా ఆఫీస్‌కు ఆలస్యంగా చేరుకోవడం మంచి అలవాటు కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల పని ఆలస్యంగా ప్రారంభించడం, ఒకవేళ మీటింగ్స్‌ ఉంటే వాటికీ లేటవడం, ఆలస్యమైందన్న హడావిడిలో ప్రాధాన్యతల్ని బట్టి పనుల్ని విభజించుకోవడంలోనూ తేడాలు రావడం, పనిపై పూర్తి దృష్టి పెట్టలేకపోవడం, ఎదుటి వారు మీపై ఇంప్రెషన్‌ కోల్పోవడం.. ఇలా పని ప్రదేశంలో మీ ఉనికి, మీ పనితీరు.. రెండూ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆలస్యంగా వచ్చే అలవాటును మార్చుకొని సమయపాలన పాటించడం ముఖ్యం!

నమ్మకం నిలబెట్టుకోవాలి!

పనిచేసే చోట ఉద్యోగులపై బాస్/యాజమాన్యానికి, యాజమాన్యంపై ఉద్యోగులకు.. ఇలా ఒకరిపై ఒకరికి నమ్మకం కుదిరినప్పుడే పనులన్నీ సమర్థంగా పూర్తవుతాయి.. పనికి తగ్గ ప్రతిఫలమూ దక్కుతుంది. అయితే కొంతమంది ఉద్యోగులు తమ అతి ప్రవర్తన కారణంగా పైఅధికారుల దృష్టిలో తమపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతుంటారని చెబుతున్నారు నిపుణులు. ఉదాహరణకు.. అత్యవసర పరిస్థితుల్లో కొన్ని అదనపు పనులు స్వీకరించకపోవడం, ఉద్యోగులు-పైఅధికారులతో సరైన కమ్యూనికేషన్‌ కొనసాగించకపోవడం, అన్నీ తమకే తెలుసన్న అతి విశ్వాసం.. ఇలాంటి ప్రవర్తన చుట్టూ ఉన్న వారికి మీపై ప్రతికూల భావన కలిగేలా చేస్తుంది. కాబట్టి ఇలాంటి అలవాట్లను మార్చుకొని.. పని వాతావరణానికి తగ్గట్లుగా మనల్ని మనం మలచుకోగలిగితే.. కెరీర్‌లోనూ ఎదగచ్చు.. సహోద్యోగులకూ ఆదర్శంగా నిలవచ్చు.

రాజకీయాలొద్దు!

పని ప్రదేశంలో విభిన్న వ్యక్తిత్వాలున్న ఉద్యోగులుంటారు. ఒకరు ఎదుగుతుంటే అసూయ పడుతుంటారు. ఈర్ష్యాద్వేషాలతో వారిపై లేనిపోని పుకార్లు పుట్టిస్తుంటారు. అందరూ తమ మాటే వినాలని కల్పించుకొని మరీ అందరి దృష్టిలో పడుతుంటారు. నిజానికి పనితనం చూపలేని వారు, నైపుణ్యాలు లేని వారే ఇలాంటి రాజకీయాలు చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రవర్తన చుట్టూ ఉన్న ఉద్యోగుల పని వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటి రాజకీయాలు మాని.. బృందంతో కలిసి పోయి పనిచేయడం, ఇతరుల ఉన్నతిని ప్రోత్సహించడం.. వంటివి అలవర్చుకుంటే.. ప్రత్యక్షంగా మీకు, పరోక్షంగా మీ కెరీర్‌కు ప్లస్‌ అవుతుంది.

ఈ నిర్లక్ష్యం తగదు!

రోజూ చేసే పనితో పాటు యాజమాన్యం కూడా అప్పుడప్పుడూ ఉద్యోగుల అదనపు నైపుణ్యాల్ని పరీక్షించడానికి కొన్ని పరీక్షలు పెడుతుంటుంది. వారి సమర్థతను పరీక్షించడానికి, ఓపిక ఎంతుందో తెలుసుకోవడానికి అదనపు పని అప్పగించడం, ఉన్నట్లుండి మీటింగ్స్‌ పెట్టడం.. వంటివి అందులో కొన్ని! అయితే ఇలాంటి సమయాల్లో ఆ పని తమది కాదన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు కొందరు ఉద్యోగులు. నిజానికి ఇది వ్యక్తిగతంగానే కాదు.. కెరీర్‌పరంగానూ దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. పని చేసే చోట.. ఎలాంటి బాధ్యతనైనా/పరిస్థితినైనా స్వీకరించి సమర్థత చూపినప్పుడే సక్సెస్‌ సాధించగలమంటున్నారు. కాబట్టి ఆఫీస్‌లో అన్ని వేళలా శారీరకంగా, మానసికంగా అలర్ట్‌గా ఉండడం మంచిదంటున్నారు.

ఇవే కాదు.. పరిమితికి మించి సెలవులు పెట్టడం, సరైన పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నైపుణ్యాల విషయంలో అప్‌డేట్‌ కాకపోవడం.. కెరీర్‌లో ఎదగాలంటే ఇలాంటి అలవాట్లనూ మార్చుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్