‘గుడ్ టచ్ - బ్యాడ్ టచ్’.. ఈజీగా నేర్పించిన ‘గువ్వా గోరింక’!

చిన్నారులపై జరిగే లైంగిక దాడుల్ని అరికట్టడంలో ‘గుడ్‌ టచ్‌ - బ్యాడ్‌ టచ్‌’ కాన్సెప్ట్‌ చక్కగా పనిచేస్తుంది. అయితే దీన్ని సులభంగా అర్థం చేసుకునేలా పిల్లలకు ఎలా నేర్పించాలో, దీనిపై పూర్తి అవగాహన ఎలా కల్పించాలో చాలామందికి అర్థం కాదు.

Published : 06 Apr 2024 11:34 IST

చిన్నారులపై జరిగే లైంగిక దాడుల్ని అరికట్టడంలో ‘గుడ్‌ టచ్‌ - బ్యాడ్‌ టచ్‌’ కాన్సెప్ట్‌ చక్కగా పనిచేస్తుంది. అయితే దీన్ని సులభంగా అర్థం చేసుకునేలా పిల్లలకు ఎలా నేర్పించాలో, దీనిపై పూర్తి అవగాహన ఎలా కల్పించాలో చాలామందికి అర్థం కాదు. అలాంటి వాళ్ల కోసం ఈటీవీలో ప్రసారమయ్యే ‘గువ్వా గోరింక’ సీరియల్‌ బృందం ఓ చిరు ప్రయత్నం చేసింది. చిన్నారులకు, పెద్దవాళ్లకు ఈ కాన్సెప్ట్‌ సులభంగా అర్థమయ్యేలా ఓ వీడియోను రూపొందించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

సామాజిక సమస్యల్ని స్పృశిస్తూ.. చక్కటి సందేశం ఇవ్వడంలో కొన్ని సినిమాలు, సీరియళ్లు ముందుంటాయి. ఇక పలువురు మహిళలు సీరియల్స్‌ని ఎక్కువగా ఫాలో అయ్యే విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొనే చిన్నారులకు సంబంధించిన ఓ కీలకమైన అంశంతో ‘గువ్వా గోరింక’ బృందం తాజాగా మన ముందుకొచ్చింది. చిన్నారులపై జరిగే లైంగిక దాడులకు అడ్డుకట్ట వేసేందుకు తమ వంతుగా ఓ చిన్న ప్రయత్నం చేసింది.

ఒక్క సన్నివేశంతో..!

ఇందులో భాగంగానే తాజా ఎపిసోడ్‌లో ఓ సీన్‌ని ప్రత్యేకంగా జత చేశారు. చిన్నారులకు గుడ్‌ టచ్‌-బ్యాడ్‌ టచ్‌ గురించి అవగాహన కల్పించే సీన్‌ అది. అందులో మహిళ ఓ చిన్నారి శరీర భాగాల్ని తాకుతుంటుంది. ముందుగా బుగ్గలు, చెవులు, తల మీద తాకుతుంది.. దీన్ని గుడ్‌ టచ్‌గా సూచిస్తూ.. ఆ చిన్నారి రెండు చేతులతో థమ్సప్‌ సింబల్‌ని చూపిస్తుంది. ఇక మరో ఫ్రేమ్‌లో.. చిన్నారి ఛాతీ, నడుము, నడుము కింది భాగాల్ని తాకే ప్రయత్నం చేస్తుందా మహిళ. దీనికి ఆ చిన్నారి ప్రతిఘటిస్తూ బ్యాడ్‌ టచ్‌గా సంజ్ఞలు చేస్తుంది. ఈ క్రమంలో రివర్స్‌ థమ్సప్‌ సింబల్‌ని చూపిస్తుంది.

ఇలా ఓ చిన్న వీడియో రూపంలో సింపుల్‌గా ఈ కాన్సెప్ట్‌ని అర్థం చేయించే ప్రయత్నం చేసిందీ చిత్ర బృందం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కుటుంబమంతా కలిసి కూర్చొని చూసే సీరియల్స్‌ ద్వారా ఇలాంటి సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం మంచి పరిణామం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

మరి మీరూ ఆ వీడియో చూసేసి ఫ్రెండ్స్‌కి, బంధువులకు షేర్ చేయండి.. గుడ్‌ టచ్‌-బ్యాడ్‌ టచ్‌ గురించి అవగాహన పెంపొందించండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్