వాళ్లలా సంతోషంగా ఉండాలంటే..!

ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటుంటారు. దీని ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడుతుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనలతో జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా ముభావంగా ఉంటారు.

Published : 13 Jan 2024 12:33 IST

ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటుంటారు. దీని ప్రభావం మానసిక ఆరోగ్యంపై పడుతుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనలతో జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా ముభావంగా ఉంటారు. ఇంకొందరు చిరాకు పడడం, కోపంతో ఊగిపోవడమూ చూస్తుంటాం. అయితే ఇంత ఒత్తిడిలోనూ కొందరు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటూ తమ చుట్టూ ఉన్న వారిని ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి వాళ్లను చూస్తే ‘ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వీళ్లు మానసికంగా ఇలా దృఢంగా ఎలా ఉండగలుగుతున్నారు?’ అనిపిస్తుంటుంది. ఇందుకు వారి జీవనశైలిలో చేసుకున్న మార్పులు, వారు పాటించే రోజువారీ అలవాట్లే కారణమంటున్నారు నిపుణులు. మరి, వాళ్లలా మానసికంగా దృఢంగా, సంతోషంగా ఉండాలంటే ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలో తెలుసుకుందాం రండి..

⚛ గత జ్ఞాపకాలు, సంఘటనల్నే తలచుకుంటూ మానసిక ఒత్తిడికి గురవుతుంటారు చాలామంది. కానీ మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. గతాన్ని మర్చిపోయి వర్తమానంలో జీవిస్తుంటారు. ఈ క్షణం ఎంత సంతోషంగా, ఎంత విలువైనదిగా గడపాలనే వారి ఆరాటమే వారిని ఎల్లప్పుడూ హ్యాపీగా, పాజిటివిటీ మనస్తత్వంతో ఉంచుతుందని చెబుతున్నారు నిపుణులు.

⚛ ప్రశంసలకు పొంగిపోవడం, సవాళ్లు ఎదురైతే కుంగిపోవడం మానసికంగా బలహీనంగా ఉండే వారి స్వభావం. అదే మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు తమ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమానంగా స్వీకరిస్తారు. సవాళ్లు ఎదురైనా వాటిని ఓర్పుతో, నేర్పుతో అధిగమిస్తూ తమ చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు.

⚛ జీవితం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండదు.. ఎప్పుడూ ఏదో ఒక మార్పు చోటుచేసుకుంటుంది. ఆ మార్పుల్ని స్వీకరిస్తూ వాటికి అనుగుణంగా మనమూ మారినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలం. మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు ఇలా ఉండడానికే ఇష్టపడతారంటున్నారు నిపుణులు. అది సానుకూల మార్పైనా, ప్రతికూల మార్పైనా.. అక్కడే ఆగిపోకుండా.. పాజిటివిటీతో ముందుకు సాగడం వారికి ముందు నుంచే అలవాటని చెబుతున్నారు.

⚛ ఉన్న దాంట్లో తృప్తి పడరు చాలామంది. ఈ క్రమంలో ఇంకా కావాలన్న ఆరాటమే వారి అసంతృప్తికి కారణమవుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కానీ మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు తమకు ఉన్న దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. ఈ సంతృప్తే వారిని సంతోషంగా ఉంచుతుంది.

⚛ మానసికంగా దృఢంగా ఉండే వారి ఆలోచనలన్నీ ఎక్కువ శాతం తాము వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా ఎలా ఎదగాలా? అన్న దానిపైనే కేంద్రీకృతమై ఉంటాయి. దీనివల్ల వారు ఇతర విషయాల గురించి ఆలోచించి మనసు పాడుచేసుకునే అవకాశమే ఉండదు. ఇలా ఎదిగే క్రమంలో నిపుణుల వద్ద నుంచి తెలియని విషయాలు తెలుసుకోవడానికీ వారు వెనుకంజ వేయరు.. నామోషీగా ఫీలవ్వరు.

⚛ చాలామందిలో ఎదురయ్యే మానసిక సమస్యలకు కారణం ఆర్థిక పరమైన అంశాలే! ఇవి తలెత్తకుండా ఉండాలంటే దీర్ఘకాలిక లక్ష్యాలు మేలు చేస్తాయని, భవిష్యత్తుపై భరోసాను పెంచుతాయని నిపుణులు చెబుతుంటారు. తద్వారా మానసికంగా ఒత్తిడి ఉండదు. మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులూ ఈ అలవాట్లనే పాటిస్తుంటారట! దీర్ఘకాలిక లక్ష్యాల్ని ఏర్పరచుకోవడంతో పాటు.. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, సవాళ్లను స్వీకరించడం.. ఇలాంటి నిబద్ధతతో కూడిన జీవనశైలే వారిని సానుకూలంగా ముందుకు నడిపిస్తుందంటున్నారు నిపుణులు.

⚛ ఏ విషయంలోనైనా సరే.. చుట్టూ ఉన్న వారి మెప్పు పొందాలన్న ఆరాటం కొంతమందిలో ఉంటుంది. ఈ కుతూహలమే మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. కానీ మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు ఇతరుల గురించి పట్టించుకోరు.. ఇతరుల జడ్జ్‌మెంట్‌తో పనిలేకుండా తమకు నచ్చినట్లుగా తాము ఉండడానికే ఆసక్తి చూపుతారు. ఇదే వారిని సంతోషంగా, సంతృప్తికరంగా జీవించేలా చేస్తుంది.

⚛ ఇతరులతో పోల్చుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంటుంది. అందుకే ఇలాంటి పోలికలకు దూరంగా ఉంటారట మానసికంగా దృఢంగా ఉన్న వారు. ఇతరుల సక్సెస్‌ను చూసి అసూయ పడకుండా.. వారిని ప్రశంసించడంలో ముందుంటారట! అంతేకాదు.. వారి నుంచి కొన్ని విషయాలు/నైపుణ్యాలు నేర్చుకోవడానికీ వెనకాడరని చెబుతున్నారు నిపుణులు.

⚛ అనుకున్న పనులు వెంటనే పూర్తైపోవాలి అన్న ఆరాటం కొంతమందిలో ఉంటుంది. నిజానికి ఈ ఆతృత మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. అదే మానసికంగా దృఢంగా ఉండే వ్యక్తులు ఇలాంటి తక్షణ ఫలితాల్ని ఆశించరు. వారు పూర్తి చేయాల్సిన పనులు సక్రమంగా నిర్వర్తించి.. ఫలితం ఎప్పుడొచ్చినా, ఎలా వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ పాజిటివిటీనే వారిని అనుక్షణం సంతోషంగా, సంతృప్తికరమైన జీవితం గడిపేలా చేస్తుందట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్