పనికి తగ్గ ప్రతిఫలం దక్కకపోతే..!

ఉద్యోగంలో మనకు అప్పగించిన బాధ్యతలు, వాటిని మనం సమర్థంగా నిర్వర్తించే విధానాన్ని బట్టే మన కెరీర్‌ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకొనే ఉద్యోగి పదోన్నతులు, జీతభత్యాల పెంపు.. వంటివి ఆయా సంస్థలు నిర్ణయిస్తుంటాయి.

Published : 16 Dec 2023 19:35 IST

ఉద్యోగంలో మనకు అప్పగించిన బాధ్యతలు, వాటిని మనం సమర్థంగా నిర్వర్తించే విధానాన్ని బట్టే మన కెరీర్‌ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకొనే ఉద్యోగి పదోన్నతులు, జీతభత్యాల పెంపు.. వంటివి ఆయా సంస్థలు నిర్ణయిస్తుంటాయి. అయితే కొన్ని సంస్థలు ఈ విషయాన్ని విస్మరించినా, ఎంత కష్టపడ్డా శ్రమకు తగ్గ ఫలితం దక్కకపోయినా.. తిరిగి వారిని అడగడానికి మొహమాటపడుతుంటారు కొందరు ఉద్యోగులు. కానీ అలాంటి మొహమాటం, భయం అక్కర్లేదంటున్నారు నిపుణులు. నిజంగా మీ పనితనంతో మీరు సంతృప్తి పడితే.. ఆ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి.. పనికి తగ్గ ప్రతిఫలం ఆశించడంలో తప్పు లేదంటున్నారు. అయితే అంతకంటే ముందు ఉద్యోగులు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు. అవేంటంటే..!

అంచనాల్ని అందుకోవాలి!

సంస్థలు ప్రతి ఉద్యోగిపై కొన్ని అంచనాలు పెట్టుకుంటాయి. వారి నైపుణ్యాలు, పనితనం, అనుభవాన్ని బట్టి వారికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తుంటాయి. ఈ క్రమంలో ఆయా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తూ పైఅధికారుల అంచనాల్ని అందుకునే ప్రయత్నం చేయాలి. అలాగే కంపెనీ మీకు అప్పగించిన పనిని బాధ్యతాయుతంగా, నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి.. ఆ తర్వాతే జీతం పెంపుదల, పదోన్నతి.. మొదలైన అంశాల గురించి ఆలోచించడం, పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఉత్తమం.

ఆతృత పనికి రాదు!

సహోద్యోగులకు పదోన్నతులు రావడం, జీతం పెరగడం కొంతమంది ఉద్యోగులు జీర్ణించుకోలేరు. ‘మేమూ వాళ్లతో సమానంగా పనిచేశాం.. అలాంటప్పుడు ఎందుకింత పక్షపాతం’ అన్న ధోరణి వాళ్లలో ఉంటుంది. అయితే వాళ్లలా మీకు జీతం పెరగకపోవడానికి/పదోన్నతి రాకపోవడానికి మీరు చేసే పనిలో, మీ ప్రవర్తనలో ఎక్కడో ఏదో ఒక లోపం ఉండి ఉండచ్చన్న విషయం అర్థం చేసుకోమంటున్నారు నిపుణులు. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నారు. తద్వారా అది పునరావృతం కాకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. అలాగే ఈ విషయంలో తొందరపడకుండా మిమ్మల్ని మీరు నిరూపించుకునే దిశగా ముందుకు సాగాలి. ఇందుకోసం కనీసం ఓ ఏడాది సమయాన్ని నిర్దేశించుకోవాలి. ఈ క్రమంలో మీ పనికి సంబంధించిన కొన్ని లక్ష్యాల్ని పెట్టుకొని వాటిని సమర్థంగా పూర్తిచేయాలి. అవసరమైతే ఈ క్రమంలో మీ సీనియర్స్‌/పైఅధికారుల సహకారం కూడా తీసుకోవచ్చు. ఇలా మీరు చేసే పనిని, దానికి సంబంధించిన రిపోర్ట్‌ను పైఅధికారులకు సమర్పించి.. ఆ మేరకు మీకు జీతభత్యాలు పెంచాల్సిందిగా కోరడం సరైన పద్ధతి.

అడగడానికీ ఓ పద్ధతుంది!

నిజంగా మీరు చేస్తోన్న పని, సంస్థ అభివృద్ధి విషయంలో నిర్వర్తిస్తోన్న బాధ్యతలు మీకు సంతృప్తినిస్తే మీకు జీతం పెంపు కావాలని, పదోన్నతి కల్పించాలని అడగడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. అయితే అందుకూ ఓ పద్ధతుందంటున్నారు. ఇతరులకు జీతం పెంచారు.. మాకు పెంచలేదన్న అసహనాన్ని ప్రదర్శించడం సరికాదు. పైగా ఇలాంటి ప్రవర్తన వల్ల మీ కెరీర్‌కే మచ్చ రావచ్చు. అందుకే కాస్త ఓపిక వహించి మీరు చేసిన పనికి సంబంధించి ఎప్పటికప్పుడు పొందుపరిచిన రిపోర్టులు, ఉత్పాదకతకు సంబంధించిన రుజువుల్ని మర్యాదపూర్వకంగా మీ పైఅధికారులకు సమర్పించండి. తద్వారా సంస్థలు మీ ప్రొఫెషనలిజం, మీ ప్రవర్తన, మీ పనితనాన్ని బట్టి తప్పకుండా మీకు జీతభత్యాల పెంపు/ ప్రమోషన్‌.. వంటివి అందించే అవకాశాలుంటాయి.

ఆ విషయాలు వద్దు..!

కొంతమంది తమ కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించడానికి, ఆర్థిక అవసరాలకు వచ్చే జీతం సరిపోకపోవచ్చు. ఇలాంటప్పుడు జీతం పెంచమని అడిగే క్రమంలో ఈ విషయాలను అధికారుల వద్ద ప్రస్తావించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల వారికి మీపై నెగెటివ్‌ అభిప్రాయం ఏర్పడచ్చు. వృత్తిపరమైన జీవితంలోకి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తీసుకురాకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి గుర్తుపెట్టుకోండి!

జీతం పెంపు, పదోన్నతుల గురించి అర్జీ పెట్టుకునే ముందు సంస్థ నియమనిబంధనల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు నిపుణులు. అంటే.. మీరు పనిచేసే సంస్థలో ఎన్నేళ్లకోసారి జీతభత్యాలు పెంచుతున్నారు?, పదోన్నతులు కల్పిస్తున్నారు? వంటివి తెలుసుకోవడం ముఖ్యం.

ఒక్కోసారి మీ పనితనం బాగున్నా, మీరు పైఅధికారుల అంచనాల్ని అందుకున్నా.. మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అలాంటప్పుడు నిరాశ పడకుండా, మీ పనిలో నాణ్యత తగ్గకుండా ముందుకు సాగితే మరోసారి తప్పకుండా ఇంతకంటే రెట్టింపు ఫలితం పొందగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్