ఇంటికి ‘ఉగాది’ శోభ!

పండగంటేనే పచ్చపచ్చని తోరణాలు-రంగురంగుల పూలతో అలంకరించిన గుమ్మాలు.. రంగవల్లికలతో తీర్చిదిద్దిన ముంగిళ్లు.. ఇలా ప్రతి ఇల్లూ ఓ సరికొత్త కళను సంతరించుకుంటుంది. అలాంటిది కొత్త సంవత్సరాది ఉగాది అంటే ఇంటి అలంకరణలో....

Published : 20 Mar 2023 21:18 IST

పండగంటేనే పచ్చపచ్చని తోరణాలు-రంగురంగుల పూలతో అలంకరించిన గుమ్మాలు.. రంగవల్లికలతో తీర్చిదిద్దిన ముంగిళ్లు.. ఇలా ప్రతి ఇల్లూ ఓ సరికొత్త కళను సంతరించుకుంటుంది. అలాంటిది కొత్త సంవత్సరాది ఉగాది అంటే ఇంటి అలంకరణలో మరింత శ్రద్ధ వహిస్తుంటాం. అప్పుడే పండగ శోభ రెట్టింపవుతుంది. ఈ సంతోషం ఏడాదంతా మనతోనే ఉంటుంది. మరి శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాదికి ఇంటిని ఎలా ముస్తాబు చేసుకోవాలో తెలుసుకుందాం రండి..

పచ్చటి తోరణాలు - ముచ్చటైన ముగ్గులు!

పండగైనా, శుభకార్యమైనా.. ఉదయాన్నే ఇంటి ముంగిట్లో ముచ్చటైన ముగ్గుల్ని తీర్చిదిద్దడం మన సంప్రదాయం. అలాగే ఉగాది రోజునా ఇంటి ముంగిట్లో రంగులు, పూలతో ముగ్గులు తీర్చిదిద్దితే ఇంటికి సగం పండగ కళ వచ్చేసినట్లే..! ఇక ముగ్గు త్వరగా వేయడానికి వీలుగా ప్రస్తుతం వివిధ డిజైన్లలో రూపొందించిన రంగోలీ స్టెన్సిల్స్‌ మార్కెట్లో దొరుకుతున్నాయి.

ఇక పండగ రోజున ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, కొత్త బట్టలు ధరించి.. ఇంటి గుమ్మాలకు పచ్చటి మామిడాకు తోరణాలు కట్టాలి. అలాగే గుమ్మం వద్ద అరటి చెట్టు కాండాలను కూడా నిలబెట్టచ్చు. తద్వారా ఈ పచ్చటి ఆకుల్లాగే మన సంసారం ఎప్పుడూ పచ్చగా, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో తులతూగుతుందని చాలామంది నమ్మకం! ఇక మామిడాకులతో పాటు పూల దండల్ని కూడా గుమ్మాలకు వేలాడదీయచ్చు. ఇక రాత్రి పూట పండగ శోభ ఉట్టిపడేలా ఫ్లోరసెంట్‌ లైట్లతో ఇంటి ముంగిలిని అలంకరించచ్చు.

పూజగది ముస్తాబు ఇలా!

ప్రతి పండక్కి పూజగదికి చేసే అలంకరణే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. ఉగాది రోజున కూడా దీన్ని కొనసాగిస్తుంటాం. ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసిన తర్వాత పూజ గదిని శుభ్రం చేసి ముగ్గులు వేయాలి. ఆపై దేవుడి విగ్రహాలను శుభ్రం చేసి.. పసుపు, కుంకుమ, పూలతో అలంకరించాలి. అనంతరం గది గుమ్మానికి పచ్చటి మామిడాకులు కట్టి, పూలదండలతో అలంకరించాలి. ఇందులోనూ కాస్త వైవిధ్యం కోరుకునే వారు పూలు, మామిడాకులు కలిపి సరికొత్తగా లభిస్తున్న తోరణాలను ఇంటి గుమ్మానికి, పూజ గది గుమ్మానికి వేలాడదీస్తే పండగ శోభ ఉట్టిపడుతుంది. రాత్రిపూట శోభాయమానంగా కనిపించడానికి.. చిన్న చిన్న ఫ్లోరసెంట్ బల్బులను కూడా మందిరానికి అమర్చచ్చు. అలాగే గుమ్మాలకు టెర్రాకోటాతో రూపొందించిన డోర్‌ హ్యాంగింగ్స్‌ని కూడా వేలాడదీయచ్చు. ఇక సాధారణంగా పూజగదిలో రోజూ ఇత్తడి సామగ్రిని ఉపయోగించడం మనకు అలవాటు! అయితే ఈ పండగ రోజున మీకు వీలుంటే వీటికి బదులుగా వెండి, రాగి.. వంటి వస్తువుల్ని వాడచ్చు. ఇక పూజ పూర్తయ్యాక నైవేద్యాల కోసం రాగి, చెక్కతో తయారుచేసిన ప్లేట్స్‌/బౌల్స్‌.. వంటివి ఎంచుకుంటే వింటేజ్‌ లుక్‌నీ తీసుకురావచ్చు.

పూలతో కొత్త లుక్కు!

అలంకరణతో పాటు ఆహ్లాదం కోసం ఇప్పుడు చాలామంది ఇండోర్‌ ప్లాంట్స్‌ని పెంచుకోవడం కామనైపోయింది. అలాగే కొంతమంది బయటదొరికే ఫ్లవర్‌వాజుల్నీ ఇంట్లో అలంకరించుకుంటారు. అయితే ఈ పండగ సందర్భంగా వీటిలో ఉండే ప్లాస్టిక్‌ పూలను తొలగించి.. చామంతి, బంతి.. వంటి నిజమైన పూలను అమర్చుకోవచ్చు. అంతేకాదు.. బయట దొరికే బ్లష్‌ ఫ్లవర్స్‌నీ మధ్యమధ్యలో చేర్చుకుంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక ఇంటి ముంగిట ఏర్పాటు చేసే పాత్రలోనూ నీళ్లు మార్చి రంగురంగుల పూలతో అలంకరిస్తే ఇంటికొచ్చే అతిథులకు స్వాగతం పలికినట్లుగా ఉంటుంది.

అతిథుల కోసం..

ఉగాది రోజున ఇంటికి వచ్చే అతిథులను మరింతగా మెప్పించాలంటే.. ఉగాది పచ్చడి, బొబ్బట్లు, పులిహోర.. వంటి ప్రత్యేక వంటకాలన్నీ ఆకర్షణీయమైన సర్వింగ్‌ బౌల్స్‌లో అమర్చి డైనింగ్‌ టేబుల్‌పై సర్దాలి. వీలైతే వాళ్ల కోసం చిన్న చిన్న కానుకలు సిద్ధం చేసి.. వెళ్లేటప్పుడు వారికి అందిస్తే మరింత సంతృప్తిపడతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్