Mentorship: టీమ్‌ని జాగ్రత్తగా గైడ్ చేస్తున్నారా?

ఉద్యోగంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా ఒకేలా ఉండకపోవచ్చు. కొంతమంది తమ హోదాను ప్రదర్శించచ్చు.. మరికొంతమంది పొగరుగా, అన్నీ నాకే తెలుసన్నట్లుగా వ్యవహరించచ్చు.

Published : 15 Dec 2023 21:16 IST

ఉద్యోగంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా ఒకేలా ఉండకపోవచ్చు. కొంతమంది తమ హోదాను ప్రదర్శించచ్చు.. మరికొంతమంది పొగరుగా, అన్నీ నాకే తెలుసన్నట్లుగా వ్యవహరించచ్చు. అయితే ఇలాంటి అతి విశ్వాసాన్ని పక్కన పెట్టి.. కింది స్థాయి ఉద్యోగులకు మీ అనుభవాలే స్ఫూర్తి పాఠాలు కావాలని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరే వారికి మెంటర్‌గా వ్యవహరిస్తూ వారిని తీర్చిదిద్దాలంటున్నారు. తద్వారా అటు వారు లబ్ధి పొందుతూనే.. ఇటు మీరూ కెరీర్‌లో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించచ్చు. మరి, ఉన్నత స్థానాల్లో ఉన్న ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగులకు మెంటర్‌గా వ్యవహరించాలంటే వాళ్లేం చేయాలో తెలుసుకుందాం రండి..

మీ అనుభవం.. వారికి పాఠం!

కెరీర్‌లో ఉన్నత స్థానాల్ని అధిరోహించాలంటే మాటలు కాదు. ఈ క్రమంలో ఎన్నో బాధ్యతల్ని భుజాలకెత్తుకోవాల్సి ఉంటుంది. మరెన్నో సవాళ్లను దాటాల్సి వస్తుంది. అందులోనూ మీకు కొన్ని మంచి జ్ఞాపకాలను అందిస్తే.. మరికొన్ని చేదు అనుభవాలుగా మిగిలిపోవచ్చు. అయితే కొంతమంది కెరీర్‌లో తమకు కలిసొచ్చిన సందర్భాలు, మంచి అనుభవాలను మాత్రమే సహోద్యోగులతో పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. చేదు జ్ఞాపకాలు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భాలు తమ కింది స్థాయి ఉద్యోగులతో చర్చిస్తే.. తామెక్కడ లోకువైపోతామోనన్న ఫీలింగ్‌తో వాటి గురించి చెప్పనే చెప్పరు. కానీ ఓ ఉన్నతోద్యోగిగా మీరు మీ కింది స్థాయి ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపాలనుకుంటే మాత్రం.. కెరీర్‌లో మీరు ఎదుర్కొన్న ప్రతి అనుభవాన్నీ వారితో పంచుకోవడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. అంతేకాదు.. అలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని వారికి అందించే బాధ్యత కూడా మీదే! ఇలా కెరీర్‌లో ఉండే ఒడిదొడుకులు, మంచి చెడుల గురించి వారికి ముందే ఓ అవగాహన ఉంటే.. వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి అన్ని విధాలా సంసిద్ధులవుతారు. ఓ మెంటార్‌గా మీరు వారితో వేయించే తొలి అడుగు ఇది!

తలపడనివ్వండి!

కింది స్థాయి ఉద్యోగుల బాధ్యత తీసుకోవడమంటే.. పనులన్నీ మీరే అరటి పండు ఒలిచిపెట్టినట్లుగా విడమరచి చెప్పమని కాదు.. వారికీ సవాళ్లతో కూడిన కొన్ని టాస్కులు అప్పగించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వారికి అనుభవం లేని అంశాలకు సంబంధించిన పనులు చేయమని పురమాయించడంలో తప్పు లేదు. నిజానికి దీనివల్ల ఇటు మీకు, అటు వాళ్లకు కాస్త అసౌకర్యం కలుగుతుందన్న మాట వాస్తవమే అయినా.. వారు అన్ని విషయాల్లోనూ రాటుదేలేలా మీరు వారిని గైడ్‌ చేస్తున్నారన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో ఇలా కఠినంగా ఉంటేనే పనులు జరుగుతాయి. ఈ ధోరణి కెరీర్‌లో మిమ్మల్నే కాదు.. మీరు గైడ్‌ చేసే ఉద్యోగుల్నీ ఉన్నత స్థానాలు అధిరోహించేలా చేస్తుంది.

మౌనం వీడండి!

పని ప్రదేశంలో ఉద్యోగులందరూ ఒకేలా ఉండాలని లేదు. ఒకరు సౌమ్యంగా ఉండచ్చు.. మరొకరు దూకుడుగా వ్యవహరించచ్చు.. ఎదుటివారు ఎదుగుతుంటే ఓర్వలేని వారు ఇంకొందరు ఉంటారు.. తోటి ఉద్యోగులను లైంగికంగా వేధించేవారూ ఉండచ్చు. అయితే ఇలాంటి వారి వల్ల మీ కింది స్థాయి ఉద్యోగుల్లో ఎవరికైనా సమస్య ఎదురుకావచ్చు. అలాంటప్పుడు వారి సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తే.. సమస్య నాది కాదు కదా అని మౌనం వహించకుండా.. దాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఈ క్రమంలో మరోసారి ఈ తప్పు చేయకుండా వారిని ఎలా అదుపు చేయాలి, బాధితులకు మళ్లీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి.. వంటివన్నీ మీరే బాధ్యత తీసుకొని అధికారులతో మాట్లాడచ్చు. ఇలా సందర్భం వచ్చినప్పుడే కాదు.. మీరు మెంటార్‌గా వ్యవహరించే మీ బృందంలోని ఉద్యోగులతో తరచూ మాట్లాడడం, వారి సమస్యల్ని అడిగి తెలుసుకోవడం.. వల్ల కూడా ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం పెరుగుతుంది. సంస్థ అభివృద్ధి చెందాలంటే ఉద్యోగుల మధ్య ఉండాల్సింది కూడా ఇలాంటి అనుబంధమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్