పిల్లలెప్పుడు.. పదే పదే ఇదే అడుగుతున్నారు..!

నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నా భర్తది ఆర్థికంగా స్థిరపడిన ఉమ్మడి కుటుంబం. కుటుంబ సభ్యులంతా ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం. నేను ఇంకా చదువుకుంటూనే ఉన్నా. అయితే పెళ్లికి ముందు ఉద్యోగం వచ్చిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిద్దామని నా భర్తతో పాటు అత్తమామలతో చెప్పా. అందుకు ఒప్పుకున్న తర్వాతే పెళ్లికి సిద్ధపడ్డా.

Published : 23 Mar 2024 14:28 IST

నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నా భర్తది ఆర్థికంగా స్థిరపడిన ఉమ్మడి కుటుంబం. కుటుంబ సభ్యులంతా ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం. నేను ఇంకా చదువుకుంటూనే ఉన్నా. అయితే పెళ్లికి ముందు ఉద్యోగం వచ్చిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిద్దామని నా భర్తతో పాటు అత్తమామలతో చెప్పా. అందుకు ఒప్పుకున్న తర్వాతే పెళ్లికి సిద్ధపడ్డా. ఈ విషయంలో నా భర్త నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, ఉమ్మడి కుటుంబం కావడం వల్ల ఇతర కుటుంబ సభ్యులు పదే పదే పిల్లల ప్రస్తావన తెస్తున్నారు. ఓ సందర్భంలో తెలిసిన గైనకాలజిస్ట్‌ను ఏకంగా ఇంటికే పిలిపించారు. అలా వారి మాటలు, ప్రశ్నల వల్ల విసిగిపోతున్నాను. ఇదే విషయాన్ని నా భర్తతో చెబితే ‘వారి మాటలు పట్టించుకోవద్దు’ అని చెబుతున్నాడు. కనీసం అత్తమామలు కూడా వారిని వారించడం లేదు. కుటుంబ సభ్యుల మాటల వల్ల ఒత్తిడికి లోనవుతున్నా.. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ఈ రోజుల్లో అమ్మాయిలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు చేస్తున్నా.. ఇప్పటికీ ఇలాంటి ప్రశ్నలు చాలామందికి ఎదురవుతున్నాయి. అందుకు మీరే ప్రత్యక్ష ఉదాహరణ. అయితే ఉమ్మడి కుటుంబంలో సహజంగానే పలు సవాళ్లు ఎదురవుతుంటాయి. అలాగే ప్రతి కుటుంబంలో భిన్నమైన సంప్రదాయాలు ఉండడం కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వాతావరణంలో కొత్తగా ఇంట్లో అడుగుపెట్టే అమ్మాయిలకు పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

మీరు చెప్పిన అంశాలను బట్టి మీ భర్త, అత్తమామల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనట్టుగా అర్థమవుతోంది. కానీ, ఇతర కుటుంబ సభ్యుల మాటలు, వారు అడిగే ప్రశ్నల వల్ల మీరు ఒత్తిడికి లోనవుతున్నట్టుగా స్పష్టమవుతోంది. అయితే వారి మాటలు, ప్రశ్నల వల్ల మీలో భయం, ఆందోళన, అభద్రతాభావం వంటి సమస్యలు వస్తున్నాయా? అనే విషయాన్ని పరిశీలించండి. అసలు వారి మాటలు మిమ్మల్ని ఏవిధంగా ఇబ్బంది పెడుతున్నాయో స్పష్టంగా తెలుసుకోగలిగితే.. వాటి నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడమే కాకుండా; మీ ప్రతిస్పందనలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుస్తుంది. అలాగే ఎవరి నుంచి ఎక్కువగా ప్రశ్నలు ఎదురవుతున్నాయో వారికి మీ సమాధానాన్ని స్పష్టంగా తెలియజేయండి. అప్పటికీ మీరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంటే కుటుంబ సభ్యులందరితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయండి. అందులో మీ భర్త చేత మీ నిర్ణయాన్ని చెప్పించే ప్రయత్నం చేయండి. కచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్