నైట్‌షిఫ్టులతో సమస్యలు తప్పవు..!

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ఈ రోజుల్లో.. ఒకే షిఫ్టుకు పరిమితం కాకుండా వేర్వేరు షిఫ్టుల్లో పనిచేయాల్సి వస్తోంది. కొంతమంది రోజుల తరబడి నైట్‌షిఫ్టులకే అంకితమైపోతున్నారు. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. ఈ షిఫ్టుల వల్ల పురుషులతో పోల్చితే.....

Published : 01 Oct 2022 16:54 IST

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ఈ రోజుల్లో.. ఒకే షిఫ్టుకు పరిమితం కాకుండా వేర్వేరు షిఫ్టుల్లో పనిచేయాల్సి వస్తోంది. కొంతమంది రోజుల తరబడి నైట్‌షిఫ్టులకే అంకితమైపోతున్నారు. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. ఈ షిఫ్టుల వల్ల పురుషులతో పోల్చితే మహిళల ఆరోగ్యం పైన అధిక ప్రభావం పడుతున్నట్లు ఓ అధ్యయనం కూడా తేల్చింది. ఈ నేపథ్యంలో రాత్రి షిఫ్టులు, తరచూ మారే షిఫ్టుల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఎలాంటి సమస్యలొస్తాయో తెలుసుకుందాం రండి..

డిప్రెషన్‌ రెండింతలట!

రాత్రి నిద్రే మన ఆరోగ్యానికి మంచిది! కానీ రాత్రి షిఫ్టుల్లో పనిచేసినా, తరచూ షిఫ్టులు మారుతున్నా.. ఇది కుదరకపోవచ్చు. ఇంట్లో పనులు, ఇతర బాధ్యతలు పెట్టుకొని పగటి పూట ఏడెనిమిది గంటలు నిద్రపోయే పరిస్థితులూ ఉండకపోవచ్చు. ఇది క్రమంగా నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. ఇది దీర్ఘకాలంలో ఒత్తిడి, ఆందోళనలు.. వంటి మానసిక సమస్యలకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. డిప్రెషన్‌తో బాధపడే వారిలో పురుషులతో పోల్చితే మహిళలే రెండింతలు ఉన్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకు నిద్రను త్యాగం చేయడం కూడా ఓ కారణమే అంటున్నారు నిపుణులు. కాబట్టి షిఫ్టుల్లో పనిచేసినా నిద్రకు తగిన సమయం కేటాయించడం, మానసిక ప్రశాంతత కోసం నచ్చిన పనులు చేయడం.. వంటివి అలవాటు చేసుకోవాలి.

అబార్షన్ ముప్పు..

ఆఫీసుకెళ్లినా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా- కొంతమంది గర్భంతో ఉన్నప్పుడు కూడా షిఫ్టుల్లో పని చేయాల్సి వస్తుంది. అయితే దీనివల్ల ప్రెగ్నెన్సీపై ప్రతికూల ప్రభావం పడుతుందంటోంది ఓ అధ్యయనం. వారానికి కనీసం రెండు రోజులు రాత్రి షిఫ్టుల్లో పనిచేసిన వారిలో అబార్షన్‌ అయ్యే ముప్పు పొంచి ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకు నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత.. వంటివి కారణాలంటున్నారు నిపుణులు. అందుకే గర్భిణిగా ఉన్నప్పుడు సంస్థ అనుమతితో సాధారణ షిఫ్టుల్లో పనిచేసేలా అనుమతి తీసుకోవడం తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యానికి శ్రేయస్కరం అంటున్నారు. అలాగే ఈ సమయంలో శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండేలా జీవనశైలిలో పలు మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిది.

నెలసరి సమస్యలు..

రాత్రి షిఫ్టుల్లో పనిచేసే వారు పూర్తిగా విద్యుత్ దీపాల వెలుగులోనే పనిచేయాల్సి వస్తుంది. తద్వారా ఈ కాంతి జీవక్రియలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫలితంగా హార్మోన్లలో మార్పులు, జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతినడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా హార్మోన్ల మార్పుల వల్ల నెలసరి సమస్యలొస్తాయి. ఈ క్రమంలో ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌, పీసీఓఎస్‌.. వంటివి చాలామందిలో చూస్తుంటాం. ఒక దశలో ఇవి సంతానలేమికీ దారితీయచ్చని చెబుతున్నారు నిపుణులు.

ఆ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందట!

కొన్ని వృత్తి ఉద్యోగాల్లో ఉన్న మహిళలు ఏళ్ల తరబడి రాత్రి షిఫ్టులకే పరిమితమవ్వాల్సి రావచ్చు. అయితే ఇలా దీర్ఘకాలంగా రాత్రి షిఫ్టుల్లో కొనసాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 79 శాతం అధికంగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇందుకు కారణం జీవక్రియలపై ప్రతికూల ప్రభావం పడడమే అంటున్నారు నిపుణులు. అయితే దీనిపై మరింత లోతుగా అధ్యయనాలు జరుగుతున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఇలా దీర్ఘకాలం పాటు రాత్రి షిఫ్టుల్లో పనిచేయకపోవడమే మంచిదన్నది నిపుణుల సలహా!

ఆ ‘కోరిక’ తగ్గుతుంది!

దాంపత్య బంధాన్ని దృఢం చేసుకోవాలంటే.. అందులో శృంగారం కీలకమైన అంశం. కానీ రాత్రి షిఫ్టుల్లో పనిచేసే వారిలో, తరచూ షిఫ్టులు మారే వారిలో ఈ కోరిక తగ్గుతుందంటున్నారు నిపుణులు. ఇందుకు ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత.. వంటివి ప్రధాన కారణాలుగా మారుతున్నాయంటున్నారు. అలాగని ఎక్కువ రోజులు కలయికకు దూరంగా ఉంటే భార్యాభర్తల మధ్య దూరం పెరగడంతో పాటు నెలసరి నొప్పులు తీవ్రమవడం, వెజైనా పొడిబారడం.. వంటి దుష్ప్రభావాలు ఎదుర్కోక తప్పదంటున్నారు. కాబట్టి లైంగిక జీవితంపై ప్రభావం పడకుండా పనివేళ్లలో మార్పులు చేసుకోవడం, నిపుణుల సలహాలు-కౌన్సెలింగ్‌ తీసుకోవడం.. వంటివి ముఖ్యం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్