పనితో అలసటా!

ఇంటి పనీ.. ఆఫీసు పనీ.. వేళలకు మించి చేసుకుంటూ వెళితే శరీరం తట్టుకోవడం కష్టమే! ఊరికే జబ్బు పడటం.. త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

Published : 09 Jan 2023 00:32 IST

ఇంటి పనీ.. ఆఫీసు పనీ.. వేళలకు మించి చేసుకుంటూ వెళితే శరీరం తట్టుకోవడం కష్టమే! ఊరికే జబ్బు పడటం.. త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీన్నే ‘బర్న్‌ అవుట్‌’గా చెబుతున్నారు. మీలోనూ ఆ లక్షణాలు కనిపిస్తున్నాయా?

* ఆఫీసుకొచ్చాక ఎన్నిసార్లు కుర్చీలోంచి లేచారు? ‘పని చేయడం లేదనో, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుందనో’ అనుకుంటారని భయం. అలాగని ఏకధాటిగా కూర్చొని కంప్యూటర్‌ వంక చూడటమూ మెదడును అలసి పోయేలా చేస్తుందని తెలుసా? గంటకో సారైనా కుర్చీలోంచి లేవండి. పక్కకు వెళ్లి మానసికంగా, శారీరకంగా ఎలా అనిపిస్తోందో అంచనా వేసుకోండి. నెగెటివ్‌ ఆలోచనలు మొదలవుతున్నాయి అనిపిస్తే.. మీ పని విధానంలో మార్పులు చేసుకోవాలని అర్థం.

* ఏ సందర్భంలోనైనా ఒకరు తోడున్నారన్న ఆలోచన ఎంత బాగుంటుంది! పని ప్రదేశంలో తప్పనిసరి కాబట్టి, అందరితోనూ బాగానే మాట్లాడతాం. నిజమైన స్నేహితులున్నారా? ఆఫీసులో బాగా నచ్చినవారితో స్నేహం చేయండి. కలిసి తినడం.. సరదాగా కబుర్లు చెప్పుకోవడం, మీ ఒత్తిడిని పంచుకోవడం.. అవతలి వారి ఇబ్బందులను వినడం లాంటివి చేయండి. ‘బర్న్‌ అవుట్‌’ పరిస్థితి దరిదాపుల్లోకీ రాదట. అయితే.. ఆఫీసు రహస్యాలు, బృందానికి సంబంధించిన ఆలోచనలను మాత్రం పంచుకోవద్దు. అమ్మాయిల నోట నువ్వు గింజ దాగదన్న అపప్రధ తెలుసుగా!

* ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్న కొద్దీ మందులను ఆశ్రయించేవారే ఎక్కువ. రోజూ కనీసం 20 నిమిషాలు నడిస్తే.. ఆ పరిస్థితి రాదంటున్నారు నిపుణులు. చిన్న చిన్న వర్కవుట్లకు మరో 15 నిమిషాలు కేటాయిస్తే చాలు. వ్యాయామం ఎగ్గొట్టడానికి ఇంట్లో పనిని సాకుగా మాత్రం చెప్పొద్దు. రోజూ కాసేపు శ్లోకాలు వినడం, కథలు చదవడం వంటివీ జోడించుకుంటే శరీరం, మనసు రెండూ దృఢంగా మారతాయి.

* త్వరగా లేవడంపై ఉన్న శ్రద్ధ త్వరగా పడుకోవడంపై ఉండదు మన ఆడవాళ్లకి. తిండి విషయంలోనూ అంతే.. అందరికీ దగ్గరుండి అన్నీ సమకూర్చుతాం కానీ.. మన సంగతి పక్కన పెట్టేస్తాం. ఇదీ ఒత్తిడి, అలసటకి కారణమేనట! ఆరోగ్యకరమైన ఆహారం, వేళలకు తినడం అనే సూత్రాన్ని తప్పక పాటించండి. తగ్గాలి.. నాజూగ్గా కనిపించాలి అని బలవంతంగా చేసే డైట్‌లూ ఈ సమస్యను పెంచేవే! మనస్ఫూర్తిగా కొనసాగించాలనిపిస్తే సరే.. లేదా.. డైట్‌ మార్గం మార్చండి. ‘బర్న్‌ అవుట్‌’ దరిచేరదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్