సానుకూలత ఉన్నా.. నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా.. ఏం చేయను?

ఏడాది కిందటి వరకూ నేను, మా బాస్ ఒకేచోట కలిసి పని చేసేవాళ్లం. కానీ ఈ మధ్యకాలంలో ఆమెకి యాజమాన్యం అదనపు బాధ్యతలు అప్పగించడంతో వేరే చోటు నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఆమె పర్యవేక్షణలో దాదాపుగా అన్ని పనులూ...

Published : 06 Jun 2022 19:47 IST

ఏడాది కిందటి వరకూ నేను, మా బాస్ ఒకేచోట కలిసి పని చేసేవాళ్లం. కానీ ఈ మధ్యకాలంలో ఆమెకి యాజమాన్యం అదనపు బాధ్యతలు అప్పగించడంతో వేరే చోటు నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఆమె పర్యవేక్షణలో దాదాపుగా అన్ని పనులూ నేనే చేసుకుంటున్నాను. మరీ ఏదైనా పెద్ద బాధ్యత అనుకుంటే తప్ప ఆమె చేయిపెట్టడం లేదు. సమావేశాలు అస్సలు జరగడం లేదు. అత్యవసరం అయితే ఒక ఫోన్‌కాల్‌.. ఈమెయిల్‌ ద్వారానే ఉత్తర-ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఇక నా పనితీరు గురించి చర్చించినప్పుడు అంతా సానుకూలంగా చెబుతున్నారు. కానీ ఇలా ఒంటరిగా నాకు నేనే సొంత నిర్ణయాలు తీసుకుంటూ పని చేయడం భయంగా ఉంటోంది. నన్నేం చేయమంటారు? - ఓ సోదరి

జ: మీరు ఒంటరిగా బాధ్యతలు నిర్వహించే విషయంలో కాస్త తడబడుతున్నారు. అదే మీ సమస్య. అయితే మీ పనితీరు గురించిన సమీక్షల్లో అంతా సానుకూలమైన అభిప్రాయాలే ఉంటున్నాయి కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ పనితీరుపై కాస్తంత నమ్మకాన్ని పెంచుకోవాల్సి సమయం ఇది. అలాగే ఒక్కరే అన్ని పనులూ చక్కబెట్టుకోవడానికి కూడా మీరు అలవాటు పడాల్సి ఉంటుంది. అదే సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మీరు పనిలో కాస్తంత అప్రమత్తంగా ఉండేందుకు, అవసరమైతే పనిలో అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకునేందుకు మెంటార్లుగా ఒకరిద్దరిని ఎంచుకోండి. చిన్నచిన్న విషయాల్లో వారి సలహాలు తీసుకోండి. అలాగే నన్ను ఎవరూ ఏమీ అనడం లేదు కదా.. అని పనిలో నిర్లక్ష్యం చేయడం కూడా తగదు. పెద్దగా ఎవరి సహాయం లేకుండా మీరిన్ని పనులు చేస్తున్నారనే విషయాన్ని యాజమాన్యం తప్పకుండా గుర్తిస్తుంది. అయితే మీ పరిధిలో లేని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం మీ బాస్‌కి చెప్పి ఆమె నుంచి రాతపూర్వకంగా అనుమతి తీసుకుని కానీ చేయొద్దు. ముఖ్యంగా ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పక్కాగా ఉండాల్సిందే.

ఇన్ని చేసిన తర్వాత కూడా మీ పనిలో ఇంకా ఏదో లోటు, చేయలేనేమో అన్న అపనమ్మకం కనిపిస్తే.. మీ పనుల్ని ఓసారి సమీక్షించుకోండి. మీరు ఏ పనులు చేయలేను అని అనుకుంటున్నారో పక్కాగా రాసుకోండి. వాటిల్లో 20 శాతం పనుల గురించి మీ బాస్‌తో ఒక సమావేశం పెట్టుకుని చర్చించండి. 80 శాతం పనులు నేను సమర్థంగా చేస్తానని ఒప్పించండి. అప్పుడు మీకు ఆమె నుంచి తప్పకుండా మద్దతు లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్