Green Travel: పర్యాటకం.. ప్రకృతి హితంగా!

గ్రీన్‌ ట్రావెల్‌.. ఈ విధానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యం పెరుగుతోంది. అంటే.. పర్యటన ద్వారా జ్ఞాపకాలనీ, బోలెడు ఆనందాన్ని మూటకట్టు కోవాలనుకుంటాం. మనం ఆ ప్రదేశాన్ని వదిలాక అక్కడి ప్రజలు మనల్ని తిట్టుకోకుండా ఉండేలా చూసుకోవాలన్నది దీని ఉద్దేశం. డైపర్లు, ఆహార పదార్థాలను ప్యాక్‌ చేసుకున్న కవర్లు, వాటర్‌ బాటిళ్లు..

Published : 06 May 2023 00:25 IST

గ్రీన్‌ ట్రావెల్‌.. ఈ విధానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యం పెరుగుతోంది. అంటే.. పర్యటన ద్వారా జ్ఞాపకాలనీ, బోలెడు ఆనందాన్ని మూటకట్టు కోవాలనుకుంటాం. మనం ఆ ప్రదేశాన్ని వదిలాక అక్కడి ప్రజలు మనల్ని తిట్టుకోకుండా ఉండేలా చూసుకోవాలన్నది దీని ఉద్దేశం. డైపర్లు, ఆహార పదార్థాలను ప్యాక్‌ చేసుకున్న కవర్లు, వాటర్‌ బాటిళ్లు.. ఇవన్నీ ఎక్కడివక్కడ పడేస్తే.. చెత్త పేరుకొని కాలుష్యానికి కారణమవుతుంది. అక్కడ నివసించే వారు తిట్టుకోవడం మామూలే కదా! కాబట్టి..

ప్రాంతం మారితే నీటి ద్వారా రోగాలు సంక్రమిస్తాయని చాలా మంది భయం. అందుకే నీళ్లసీసాలను కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతారు. బరువనుకో కుండా స్టీలు లేదా తిరిగి ఉపయోగించుకునే బాటిళ్లను తీసుకెళ్లండి. శుద్ధి చేసిన నీరు విడిగానూ దొరుకుతుంది. వాటిని పట్టుకుంటే ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించినట్లు అవుతుంది.

మన ప్రయాణం స్థానికులకు ఇబ్బంది కలిగించకూడదన్న స్పృహ ఉండాలి. స్నాక్స్‌ తాలూకూ కాగితాలు, పండ్ల తొక్కలు వంటి వాటిని చెత్తబెట్టలో మాత్రమే వేయండి. గదికి తెచ్చుకొని తినడం కాకుండా నేరుగా స్టాళ్లకో, డైనింగ్‌ హాలుకో వెళ్లి తినండి. అనవసర చెత్త పోగవదు, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలూ అర్థమవుతాయి. ఎక్కువ ఆర్డర్‌ చేసి, ఆహారం పడేయడం లాంటివీ చేయొద్దు.

ఇంటి నుంచి ఆహారం చేసుకొని తీసుకెళ్లడం చాలామంది అలవాటు. బరువు తగ్గుతుందని, తినగానే పడేయొచ్చని ఫాయిల్‌ ప్యాక్‌లు, ప్లాస్టిక్‌ డబ్బాలను ఎంచుకుంటారు. అవీ భూమిలో కలవడానికి ఏళ్లు పడుతుంది. బదులుగా స్టీల్‌ డబ్బాలు మేలు. తేలిగ్గా భూమిలో కలిసిపోయేలా వస్తున్న వాటినీ ప్రయత్నించొచ్చు.

సొంత వాహనంలో వెళ్తుంటే ఏవో ఒకటి తింటూ కవర్లు, చెత్త కిటికీలోంచి బయటకు విసరద్దు. కొన్ని కాగితపు సంచులు దగ్గర ఉంచుకుంటే చెత్త వేసుకోవడానికి పని కొస్తాయి. ఎక్కడంటే అక్కడ ఆపి పిల్లలన కాలకృత్యాలు తీర్చుకోమనడం వంటివీ చేయద్దు.

కొన్ని ప్రాంతాల్లో కారు హారన్‌ మోగించడం పై నిషేధం ఉంటుంది. దానికి సంబంధించిన సూచికలు ఉంటాయి. వాటిని గమనించి అనుసరించండి. వీటన్నింటినీ పాటిస్తే.. మీ ప్రయాణం పర్యావరణ హితమేగా మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్