Cannes 2023: రెడ్‌ కార్పెట్‌పై ‘దేశీ’ సొగసులు!

సెలబ్రిటీల వేడుకంటే చాలు.. అందరి కళ్లూ వారు ధరించే ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌ పైనే ఉంటాయి. ఇక కేన్స్‌ వంటి అంతర్జాతీయ వేదికపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్‌ స్టైల్స్‌ అన్నీ సాక్షాత్కారమవుతాయి. విభిన్న ఫ్యాషన్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ఈ చిత్రోత్సవంలో...

Published : 20 May 2023 19:25 IST

(Photos: Instagram)

సెలబ్రిటీల వేడుకంటే చాలు.. అందరి కళ్లూ వారు ధరించే ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌ పైనే ఉంటాయి. ఇక కేన్స్‌ వంటి అంతర్జాతీయ వేదికపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్‌ స్టైల్స్‌ అన్నీ సాక్షాత్కారమవుతాయి. విభిన్న ఫ్యాషన్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ఈ చిత్రోత్సవంలో కొందరు భారతీయ సెలబ్రిటీలు, అందాల తారలు ‘దేశీ’ అవుట్‌ఫిట్స్‌లో హొయలుపోయారు. చీరకట్టు, లెహెంగా, పొడవాటి గౌన్లు ధరించి మెరిశారు. సాధారణంగానే భారతీయ డ్రస్సింగ్‌ స్టైల్‌ని ఇష్టపడే విదేశీయులకు.. కేన్స్‌ వేదికపై మరోసారి మన దేశీ స్టైల్స్‌ కనువిందును పంచాయంటే అతిశయోక్తి కాదు. మరి, కేన్స్‌ చిత్రోత్సవంలో మన దేశీ ముద్దుగుమ్మలు ఎవరెవరు, ఎలాంటి ట్రెడిషనల్‌ అవుట్‌ఫిట్స్‌లో మెరిసిపోయారో తెలుసుకుందాం రండి..

కేన్స్‌ వంటి అంతర్జాతీయ వేడుకంటే.. చాలామంది సెలబ్రిటీలు పాశ్చాత్య ఫ్యాషన్స్‌ను ఎంచుకోవడానికే ఆసక్తి చూపుతారు. అలాంటి వేదికపై తమ డ్రస్సింగ్‌తో సగర్వంగా భారతీయతను చాటారు కొందరు భారతీయ సెలబ్రిటీలు, అందాల తారలు. చీరకట్టు, లెహెంగా స్టైల్స్‌తో మెరుపులు మెరిపించారు. ఇలా నిండైన ఆహార్యంతో రెడ్‌ కార్పెట్‌కే వన్నె తెచ్చిన ఆ అందాల్ని ఫొటోల్లో బంధించడానికి అక్కడి ఫొటోగ్రాఫర్లు పోటీ పడ్డారు.


సారా - దేశీ బ్రైడ్!

తొలిసారి కేన్స్‌ చిత్రోత్సవానికి హాజరైంది బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీ ఖాన్‌. వేడుకేదైనా తన ఫ్యాషన్‌ సెన్స్‌తో ఫ్యాషన్‌ ప్రియుల్ని మాయచేసే ఈ ముద్దుగుమ్మ.. తొలి రోజే కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై హొయలుపోయింది. అదీ దేశీ అవుట్‌ఫిట్‌లో! అబుజానీ-సందీప్‌ ఖోస్లా డిజైనర్‌ ద్వయం రూపొందించిన ఐవరీ లెహెంగా-మ్యాచింగ్‌ బ్లౌజ్‌లో ముస్తాబైన సారా.. పొడవాటి దుపట్టాను తలపై నుంచి ట్రెయిల్‌గా ధరించింది. ఇక తన డ్రస్‌కు తగ్గట్లే ట్రెడిషనల్‌ చెవిదిద్దులు, బ్రేస్‌లెట్‌, తక్కువ మేకప్‌తో మెరిసిపోయిందీ పటౌడీ ప్రిన్సెస్‌. ‘కేన్స్‌ వేదికపై ఉన్నానంటే నమ్మలేకపోతున్నా. తొలిసారి కదా.. కాస్త నెర్వస్‌గా అనిపించింది. అయినా.. నేను ఎంచుకున్న అవుట్‌ఫిట్‌ ద్వారా భారతీయతను చాటినందుకు గర్వంగా ఉంది..’ అందీ బాలీవుడ్‌ అందం. ఇలా సారా అటైర్‌ చూసిన చాలామంది ‘దేశీ బ్రైడ్‌’, ‘రాయల్‌ లుక్‌’.. అంటూ ప్రశంసిస్తున్నారు. ఆపై ఇదే వేదికపై మరికొన్ని ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌తో మెరుపులు మెరిపించిందీ పటౌడీ బ్యూటీ.


మృణాల్‌ ‘బీడెడ్‌’ మెరుపుల్!

కేన్స్‌ వంటి ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో పాల్గొనాలన్నది ఎంతోమంది తారల కల. ఆ కలను ఈ ఏడాది నెరవేర్చుకుంది ముంబయి భామ మృణాల్‌ ఠాకూర్‌. వేడుకేదైనా సరే.. దేశీ స్టైల్‌నే ఇష్టపడే ఈ ముద్దుగుమ్మ.. కేన్స్‌ రెడ్‌ కార్పెట్ పైనా అదే ట్రెండ్‌ని కొనసాగించింది. ఫల్గుణీ - షేన్‌ పీకాక్‌ డిజైనర్‌ ద్వయం రూపొందించిన లావెండర్‌ కలర్‌ బీడెడ్‌ ఎంబ్రాయిడరీ చీర ధరించింది మృణాల్‌. దీనికి మ్యాచింగ్‌ బ్రాలెట్ ధరించిన ఆమె.. తన ట్రెడిషనల్‌ అటైర్‌కు కాస్త స్టైల్‌ని జోడించింది. ఇక సింపుల్‌ ఇయర్‌ రింగ్స్‌, తక్కువ మేకప్‌తో రెడ్‌ కార్పెట్‌పై హొయలుపోయిందీ బాలీవుడ్‌ అందం. ‘కేన్స్‌ వంటి అంతర్జాతీయ వేదికపై దేశీ లుక్‌లో మెరిసిపోవడం ఓ అందమైన అనుభూతి’ అంటోన్న ఈ చక్కనమ్మ స్టైల్‌కి సమంత కూడా ఫిదా అయిపోయింది. మృణాల్‌ ఫొటోలకు ‘లవ్‌’ అంటూ కామెంట్‌ పెట్టింది. ఇక ఇదే కాదు.. కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై పలు ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌లోనూ మెరిసిపోయింది మృణాల్.


గౌన్‌లో ఒదిగిపోయిన ‘ఐశ్వర్యం’!

కేన్స్‌ పండగొచ్చిందంటే చాలు.. అందరి చూపులు ఐశ్వర్యారాయ్‌నే వెతుకుతాయి.. ఏటికేడు తాను ఎంచుకునే ఫ్యాషనబుల్‌ లుక్సే ఇందుకు కారణం. ఎప్పటిలాగే ఈసారీ విభిన్న అవుట్‌ఫిట్‌తో దర్శనమిచ్చిందీ బాలీవుడ్‌ అందం. ‘ది ఇండియానా జోన్స్‌ అండ్‌ ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ’ చిత్ర ప్రిమియర్‌కు హాజరైన ఐష్‌.. బ్లాక్‌-సిల్వర్‌ హూడెడ్‌ గౌన్‌ ధరించింది. డ్రస్‌ చుట్టూ ఉన్న పొడవాటి వెయిల్‌ అవుట్‌ఫిట్‌కు మరింత ఆకర్షణగా నిలిచింది. యూఏఈకి చెందిన సోఫీ కోచర్‌ డిజైన్‌ చేసిన ఈ గౌన్‌ తయారీకి రెండు నెలల సమయం పట్టిందట! ఇక ఈ అందమైన గౌన్‌లో నిండుగా ఒదిగిపోయిన ఐష్‌ను చూసి చాలామంది.. ‘దేశీ డాల్‌’, ‘క్వీన్‌’.. అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇక మరో సందర్భంలో భాగంగా ఆకుపచ్చ రంగు గౌన్‌లో మెరుపులు మెరిపించిందీ బాలీవుడ్‌ మామ్.


షానన్‌ కె.. ‘దేశీ’ వైబ్స్!

ప్రముఖ గాయకుడు కుమార్‌ సాను కూతురు, ఇండో-అమెరికన్‌ నేపథ్య గాయని షానన్‌ కె కూడా ఈసారి తన కేన్స్‌ కలను నెరవేర్చుకుంది. అందాల తార ఐష్‌తో కలిసి ‘ది ఇండియానా జోన్స్‌ అండ్‌ ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ’ అనే చిత్ర ప్రిమియర్‌ షోకి హాజరైందామె. ఈ చిత్ర ప్రిమియర్‌లో పాల్గొనే అవకాశం భారత్‌ నుంచి వీరిద్దరికే దక్కింది. కాగా ఈ ఈవెంట్‌ కోసం ఉక్రెయిన్‌ డిజైనర్‌ ద్వయం బ్లాంక్‌-లానా చేత్తో రూపొందించిన ఐవరీ గౌన్‌ను ఎంచుకుంది షానన్‌. తన డ్రస్‌కు తగ్గట్లుగా నెట్టెడ్‌ గ్లోవ్స్‌, మెడలో స్టైలిష్ ఇయర్‌ పీస్‌ ధరించిన ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌.. మన దేవతా మూర్తుల్ని ప్రతిబింబించేలా వజ్రాలతో తయారుచేసిన కిరీటం ధరించి మెరిసిపోయింది. ‘తొలిసారి కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై నడవడం మాటల్లో చెప్పలేని అనుభూతి. కాస్త నెర్వస్‌గానూ అనిపించింది.. అయినా జీవితంలో మధుర క్షణాలివి..!’ అంటూ మురిసిపోయిందీ ముద్దుగుమ్మ.


సెలబ్స్‌.. ‘శారీ’ మూమెంట్!

అందాల తారలే కాదు.. కొందరు భారతీయ చిత్ర దర్శకనిర్మాతలూ కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై చీరకట్టులో మెరిశారు.

కేన్స్‌ చిత్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన ‘అంతర్జాతీయ క్రిటిక్స్‌ వీక్‌ జ్యూరీ’లో భారతీయ ఫిల్మ్‌మేకర్‌-చిత్ర విమర్శకురాలు మీనాక్షీ షెడ్డే కూడా ఒకరు. తన బృందంతో కలిసి రెడ్‌ కార్పెట్‌పై దర్శనమిచ్చిన ఆమె.. అందమైన చీరకట్టులో మెరిశారు. నలుపు రంగు కాటన్‌ చీర-మ్యాచింగ్‌ బోట్‌నెక్‌ బ్లౌజ్‌ ధరించిన ఆమె.. దేశీ నగలతో ముస్తాబయ్యారు. ఇలాంటి ట్రెడిషనల్‌ లుక్‌తో తన బృందంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారామె.

సందర్భమేదైనా చీరకట్టుకే ప్రాధాన్యమిస్తారు ప్రముఖ భారతీయ సినీ నిర్మాత గునీత్‌ మోంగా. తాను తెరకెక్కించిన ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ అనే చిత్రానికి గాను ఇటీవలే ఆస్కార్‌ అవార్డు అందుకున్న గునీత్‌.. తాజాగా కేన్స్‌ చిత్రోత్సవాల్లోనూ పాల్గొన్నారు. ఇక్కడా చీరకట్టులోనే దర్శనమిచ్చారామె. ‘AMPM Fashions’ నుంచి ఎంచుకున్న గోల్డెన్‌ శారీలో ముస్తాబయ్యారామె. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, ట్రెండీ హ్యాంగింగ్స్‌, స్టైలిష్‌ హ్యాండ్‌ క్లచ్‌తో రెడ్‌కార్పెట్‌పై నడిచారు గునీత్.

మాజీ క్రికెటర్‌-క్రికెట్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే దంపతులు కూడా ఈసారి కేన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ వేదికగా రెండు సందర్భాల్లో రెడ్‌ కార్పెట్‌పై నడిచిన ఈ జంట.. సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో దర్శనమిచ్చింది. ఈ క్రమంలో కుంబ్లే సూట్‌లో ముస్తాబవగా, ఆయన భార్య చేతన ట్రెడిషనల్ శారీల్లో దేశీ లుక్‌లో ఆకట్టుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్