Election Results: హిట్‌ కొట్టిన అందాల తారలెవరంటే..!

రాజకీయాల్లో రాణించడమంటే అంత సులువు కాదు. ప్రచారంలో ప్రజలకిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చుతూనే.. సమర్థ పాలనతో వారి మనసులు గెలుచుకోవాల్సి ఉంటుంది. తెరపై తమ నటనతో మెప్పించిన కొందరు నాయికలు ఇందులోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

Published : 05 Jun 2024 21:24 IST

(Photos: Twitter)

రాజకీయాల్లో రాణించడమంటే అంత సులువు కాదు. ప్రచారంలో ప్రజలకిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చుతూనే.. సమర్థ పాలనతో వారి మనసులు గెలుచుకోవాల్సి ఉంటుంది. తెరపై తమ నటనతో మెప్పించిన కొందరు నాయికలు ఇందులోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన సాధారణ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుంచి పోటీ చేసి గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. ఇందులో కొంతమందికి రాజకీయ అనుభవం ఉంటే.. మరికొందరు కొత్తగా బరిలోకి దిగారు. అయితే తాజాగా వెలువడిన ఫలితాల్లో ఎవరు హిట్‌ కొట్టారు? ఎవరు ఫ్లాప్‌ అయ్యారు? తెలుసుకుందామా...

హిట్‌ ఎంట్రీ..!

వెండితెరపై విభిన్న పాత్రల్ని ఎంచుకుంటూ, మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది కంగనా రనౌత్‌. తన నటనతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసింది. ‘తలైవి’ చిత్రంతో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో వెండితెరపై నటించిన ఆమె.. ఇప్పుడు నిజజీవితంలో తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి తన పూర్తి మద్దతిచ్చిన కంగన.. అదే పార్టీ తరఫున తన స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. తద్వారా మొదటిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనుంది. విలక్షణ నటనతో సినిమాల్లో ఆకట్టుకున్న ఈ తార.. పార్లమెంటులో ప్రజాగళాన్ని వినిపించనుంది. ఇక చదువు విషయానికొస్తే కంగనా 12వ తరగతి పూర్తి చేసింది.


హుగ్లీ సీటుకు ‘దీదీ నం.1’!

అవడానికి బెంగాలీ అయినా.. తెలుగు సినిమాల్లో నటించి అచ్చ తెలుగమ్మాయిలా టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది రచనా బెనర్జీ. ‘కన్యాదానం’, ‘మావిడాకులు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’.. మొదలైన చిత్రాలలో నటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, ఒడియా, బెంగాలీ చిత్ర పరిశ్రమల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బెంగాలీ టీవీ రియాల్టీ షో ‘దీదీ నం.1’ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఇలా తనకు బెంగాల్‌లో ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగిందీ అందాల తార. ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా హుగ్లీ లోక్‌సభ ఎంపీ స్థానానికి పోటీపడింది రచన. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆమె తన సమీప బీజేపీ అభ్యర్థి లాకెట్‌ చటర్జీపై 76 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. తద్వారా ఆమె మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టనుంది. రచన ప్రత్యర్థి లాకెట్‌ చటర్జీ కూడా నటి కావడం గమనార్హం.


డ్రీమ్‌గర్ల్‌.. హ్యాట్రిక్..!

1970-80ల మధ్యకాలంలో వరుస చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపింది లెజెండరీ నటి హేమామాలిని. బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌గానూ పేరుగాంచిన ఈ ముద్దుగుమ్మ.. శాస్త్రీయ నృత్యకారిణి కూడా! భరతనాట్య కళాకారిణి అయిన ఆమె.. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో నృత్య ప్రదర్శనలిచ్చారు. ప్రస్తుతం ఏడు పదులు దాటినా ఇప్పటికీ తన డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో ‘వయసు సంఖ్య మాత్రమే!’ అని నిరూపిస్తున్నారీ గ్లామర్‌ క్వీన్‌. ఇలా తన నటన, డ్యాన్స్‌తో సినీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన ఆమె.. 1999 లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత బీజేపీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న హేమ.. 2004లో అధికారికంగా బీజేపీలో చేరారు. 2003-2009 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన ఆమె.. 2010లో ఏడాది పాటు బీజేపీ జనరల్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మథుర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె.. 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించి ప్రత్యర్థిని చిత్తు చేశారు. 2019 ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక తాజా ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేశారు. ఆమె తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్‌ ధన్‌గర్‌పై దాదాపు 3 లక్షల ఓట్ల మెజారిటీ సాధించి మూడోసారి విజేతగా నిలిచారు. ఇక చదువు విషయానికొస్తే హేమ 12వ తరగతి పూర్తి చేశారు. భారత చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గాను 2012లో హేమను సర్‌ పదమ్‌పత్‌ సింఘానియా యూనివర్సిటీ డాక్టరేట్‌తో సత్కరించింది.


సంపన్న అభ్యర్థిగా నిలిచి..!

తన గ్లామర్‌, నటనతో దక్షిణాది సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు రాధికా శరత్‌కుమార్‌. రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న ఆమె.. 2006లో తన భర్త శరత్‌కుమార్‌తో కలిసి అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఆపై 2007 లో ‘All India Samathuva Makkal Katchi’ పార్టీకి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన రాధిక.. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి పూర్వమే ఈ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో విరుదునగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె అత్యంత సంపన్న అభ్యర్థుల్లో ఒకరిగా నిలవడం విశేషం.


తల్లిని అనుసరిస్తూ..!

జన హృదయ విజేత సుష్మా స్వరాజ్‌ కూతురు బన్సూరీ స్వరాజ్‌. తన కట్టూ, బొట్టూ, రాజకీయ చతురతతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపిన తన తల్లి.. తనకూ ప్రేరణగా నిలిచారని ఆమె చెబుతుంటారు. ‘బీపీపీ లా స్కూల్‌’లో న్యాయవిద్య పూర్తిచేసిన బన్సూరీ.. ‘ఇన్నర్‌ టెంపుల్‌’ కోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేసి బారిస్టర్‌గా అర్హత సాధించారు. ఆపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన సెయింట్‌ క్యాథరిన్‌ కాలేజీ నుంచి మాస్టర్స్‌ పూర్తి చేశారు. 2007లో దిల్లీ బార్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం తీసుకున్న ఆమె.. న్యాయవాద వృత్తిలో 16 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గడించారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ లీగల్‌ సెల్‌ కో-కన్వీనర్‌గా చేరి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె న్యూదిల్లీ పార్లమెంట్‌ స్థానానికి మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు. ఆమె తన సమీప ఆప్‌ అభ్యర్థి సోమ్‌నాథ్‌ భారతిపై 3.78 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించారు.


గ్లామర్‌ క్వీన్.. దక్కని విజయం!

తెలుగు తెరపై పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ముంబయి బ్యూటీ నవ్‌నీత్‌ కౌర్‌ రాణాకు రాజకీయాలు కొత్త కాదు. ప్రముఖ రాజకీయ నాయకుడు రవి రాణాను వివాహమాడాక ఇటువైపుగా అడుగులేసిన ఆమె.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేశారు. 2019లో అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీ పదవికి పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఈ ఏడాది మార్చిలో బీజేపీలో చేరిన ఆమె.. ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీపడ్డారు. కానీ ఆమె తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి బలవంత్‌ బసవంత్‌ వాంఖడే చేతిలో కేవలం 1.68 శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్