పిల్లల కోసం సొంతంగా హెల్మెట్‌ తయారు చేసింది..!

టీనా సింగ్.. కెనడాలో స్థిరపడిన సిక్కు మహిళ. ముగ్గురు పిల్లల తల్లి. వారికి సైక్లింగ్‌ అంటే ఆసక్తి. అయితే సైక్లింగ్‌ చేయాలంటే రక్షణ కోసం హెల్మెట్ ధరించాలి. కానీ సిక్కులు వారి సంప్రదాయం ప్రకారం తలపైన టర్బన్‌ కట్టుకుంటారు. దానివల్ల హెల్మెట్‌ ధరించడం....

Updated : 12 Jan 2023 16:32 IST

(Photos: Instagram)

టీనా సింగ్.. కెనడాలో స్థిరపడిన సిక్కు మహిళ. ముగ్గురు పిల్లల తల్లి. వారికి సైక్లింగ్‌ అంటే ఆసక్తి. అయితే సైక్లింగ్‌ చేయాలంటే రక్షణ కోసం హెల్మెట్ ధరించాలి. కానీ సిక్కులు వారి సంప్రదాయం ప్రకారం తలపైన టర్బన్‌ కట్టుకుంటారు. దానివల్ల హెల్మెట్‌ ధరించడం సాధ్యపడదు. కానీ తల్లి మనసు కదా.. అందుకు ఒక పరిష్కారం కనుగొనాలనుకుంది. ఈ క్రమంలో తనే సొంతంగా హెల్మెట్‌ను తయారు చేసి ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవలే ఆమె తయారు చేసిన హెల్మెట్‌కు అంతర్జాతీయ సంస్థ నుంచి గుర్తింపు లభించింది.

భారత సంతతికి చెందిన టీనా సింగ్‌ కెనడాలోనే పుట్టి పెరిగింది. ఆమె టొరొంటోలోని యార్క్‌ యూనివర్సిటీలో సైకాలజీ పూర్తి చేసింది. ఆ తర్వాత టొరొంటో యూనివర్సిటీలో ఆక్యుపేషనల్‌ థెరపీలో మాస్టర్స్‌ చేసింది. చదువు పూర్తైన తర్వాత నుంచి అక్కడే ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌గా పనిచేస్తోంది. టీనాకు ముగ్గురు పిల్లలు. పిల్లలు పుట్టిన తర్వాత యూట్యూబ్‌లో వ్లాగ్స్‌ చేయడం ప్రారంభించింది. యూట్యూబ్‌ ఛానల్‌లో తన కుటుంబంతో పాటు వివిధ అంశాల గురించి అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది.

టీనా పిల్లలకు సాహసాలు చేయడమంటే ఇష్టం. ఈ క్రమంలో ఒకరోజు టీనా పెద్దబ్బాయి జోరా.. సైక్లింగ్‌పై తనకున్న ఆసక్తిని తల్లితో పంచుకున్నాడు. సైక్లింగ్‌ చేసేటప్పుడు దెబ్బలు తగలకుండా ఉండేందుకు హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి. కానీ వారి సంప్రదాయంలో తలపైన టర్బన్‌ కట్టుకోవడం చేత హెల్మెట్‌ ధరించడం సాధ్యపడలేదు. ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌ అయిన టీనా తలకు దెబ్బలు తగిలిన పేషెంట్లను చాలామందిని చూసింది. కాబట్టి, సైక్లింగ్‌ చేయాలంటే హెల్మెట్‌ తప్పనిసరిగా ఉండాలని భావించింది. అందుకోసం వివిధ ప్రయత్నాలు చేసింది. పెద్ద హెల్మెట్‌ కొని అందులో స్పాంజ్‌ను నొక్కి పెట్టడం, టర్బన్ ఉండే చోట హెల్మెట్‌కు రంధ్రం చేయడం వంటి ప్రయత్నాలు చేసింది. కానీ అవేవీ సురక్షితమైన మార్గాలు కావని టీనాకు అర్థమైంది. అలాగని పిల్లల కోరికను కాదనలేకపోయింది. దాంతో తనే సొంతంగా వారికి హెల్మెట్‌ను తయారు చేయాలనుకుంది.

రెండేళ్ల కృషి ఫలితంగా..

అనుకుందే తడవుగా టీనా తన ఆలోచనను ఆచరణలో పెట్టడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో రెండు లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఒకటి హెల్మెట్‌లో టర్బన్‌ పట్టడానికి వీలుగా ఉండడం. రెండు ధరించడానికి సౌకర్యంగా ఉండేలా చేయడం. అలా రెండేళ్ల పాటు కష్టపడిన టీనా వివిధ రకాల డిజైన్లతో హెల్మెట్‌ను తయారు చేసింది. అవి వారి పిల్లలకు నప్పడంతో వాటిని మరింత మందికి చేరువ చేయాలనుకుంది. ఈక్రమంలోనే గత నెలలో ఇంటర్నేషనల్‌ టెస్టింగ్‌ కంపెనీ ఎస్‌జీఎస్‌ నుంచి గుర్తింపు పొందింది. దాంతో ఎంతోమంది నుంచి ప్రశంసలు అందుకుంటోంది. టీనా ఈ హెల్మెట్‌ను కేవలం సైక్లింగ్‌కు మాత్రమే కాకుండా ఇన్‌లైన్‌ స్కేట్స్‌, కిక్‌ స్కూటర్స్‌, స్కేట్‌ బోర్డింగ్‌ వంటి స్పోర్ట్స్‌కు కూడా ఉపయోగించుకునేలా తీర్చిదిద్దింది. దీనిని 5 నుంచి 12 సంవత్సరాల వయసు పిల్లలు ఉపయోగించుకోవచ్చు.

ఎస్‌జీఎస్‌ నుంచి గుర్తింపు పొందిన తర్వాత టీనా తన ప్రయాణం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఇది సుదీర్ఘమైన ప్రయాణం. ఇప్పటికీ కొన్ని విషయాలను నేర్చుకుంటున్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా.. నిద్రలేని రాత్రులు గడిపా.. కానీ, ఎప్పటికప్పుడు ‘నేను ఎందుకు చేస్తున్నాను? ఏం చేస్తున్నాను’ వంటి విషయాలను గుర్తుకు తెచ్చుకునేదాన్ని. ఈ హెల్మెట్‌ నా పిల్లల కోసం.. నాలాంటి తల్లుల కోసం.. ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని రాసుకొచ్చింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్