ఇకపై అక్కడి విద్యార్థినులకు నెలసరి సెలవు!

‘నీరసంగా ఉంది’, ‘కడుపునొప్పితో ఈ రోజు రాలేకపోతున్నా..’ అంటూ ఏవేవో సాకులు చెప్పి కాలేజీకి సెలవు పెడుతుంటారు చాలామంది అమ్మాయిలు. అంతేకానీ.. నెలసరి వల్ల రాలేకపోతున్నామని ధైర్యంగా చెప్పే వారు అరుదు! ఇలా తమ విద్యార్థినుల ఇబ్బందిని అర్థం చేసుకుంది గువహటి విశ్వవిద్యాలయ యాజమాన్యం.

Updated : 14 Nov 2023 21:22 IST

‘నీరసంగా ఉంది’, ‘కడుపునొప్పితో ఈ రోజు రాలేకపోతున్నా..’ అంటూ ఏవేవో సాకులు చెప్పి కాలేజీకి సెలవు పెడుతుంటారు చాలామంది అమ్మాయిలు. అంతేకానీ.. నెలసరి వల్ల రాలేకపోతున్నామని ధైర్యంగా చెప్పే వారు అరుదు! ఇలా తమ విద్యార్థినుల ఇబ్బందిని అర్థం చేసుకుంది గువహటి విశ్వవిద్యాలయ యాజమాన్యం. అందుకే నెలనెలా నెలసరి సెలవును ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు తాజాగా ప్రకటించి వార్తల్లోకెక్కిందీ యూనివర్సిటీ. ఈ నేపథ్యంలో దేశంలో నెలసరి సెలవుల్ని అమలు చేస్తోన్న కొన్ని విద్యాసంస్థలు, వాటి పాలసీల గురించి తెలుసుకుందాం..!

నెలసరి సెలవు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా దీనిపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కొన్ని దేశాలు దీన్ని చట్టబద్ధంగా అమలు చేస్తున్నాయి. మరికొన్ని దేశ/విదేశీ సంస్థలూ తమ ఉద్యోగినులకు ఈ సెలవును అందిస్తున్నాయి. ఇక ఈ జాబితాలో మన దేశానికి చెందిన కొన్ని విశ్వవిద్యాలయాలూ ఒక్కొక్కటిగా చేరుతున్నాయి. తాజాగా అసోంలోని గువహటి విశ్వవిద్యాలయం తమ విద్యార్థినులకు నెలసరి సెలవును అందించనున్నట్లు ప్రకటించి వార్తల్లోకెక్కింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన నియమ నిబంధనల్ని వెల్లడించింది.

2 శాతం సడలించి..!

ప్రస్తుతం మన దేశంలో నెలసరి సెలవులకు సంబంధించిన చట్టమేదీ లేదు. ఇలాంటి ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని గతంలో స్త్రీశిశు సంక్షేమ శాఖ ఓ సందర్భంలో తెలిపింది. అయితే విద్యార్థినుల సౌకర్యార్థం వారికి ఈ సెలవును అందించాలని విద్యాసంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఒక్కో విశ్వవిద్యాలయం తమ విద్యార్థినులకు ఈ సెలవును అందిస్తున్నాయి. అసోంలోని గువహటి విశ్వవిద్యాలయం కూడా తమ విద్యార్థినుల నెలసరి ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ త్వరలోనే ఈ సెలవును అందించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో మహిళా విద్యార్థుల మొత్తం హాజరులో రెండు శాతం సడలింపునిచ్చింది. ఇప్పటికే దీనిపై రూపొందించిన పాలసీ ప్రకారం.. సెమిస్టర్‌ పరీక్షలు రాయడానికి అర్హత సాధించాలంటే ప్రతి విద్యార్థినికి 73 శాతం హాజరు తప్పనిసరి చేసింది.

‘మహిళల సంపూర్ణ ఆరోగ్యంలో నెలసరి పరిశుభ్రత-ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తాయి. జీవితంలోని ప్రతి దశ పైనా ఇది ప్రభావం చూపుతుంది. అందుకే నెలసరి ఆరోగ్యం విషయంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుంది’ అంటూ ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు.

కేరళ ఫస్ట్!

అయితే గువహటి విశ్వవిద్యాలయం కంటే ముందే నెలసరి సెలవును ఇవ్వనున్నట్లు ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది కేరళలోని ‘కొచ్చి యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’. తద్వారా దేశంలోనే నెలసరి సెలవును తెరమీదికి తెచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ ఘనత సాధించింది. కొన్నేళ్లుగా అక్కడి విద్యార్థి సంఘాలు దీనిపై పోరాటం సాగిస్తోన్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసిందీ విద్యాసంస్థ. ఈ క్రమంలో ఆ యూనివర్సిటీకి చెందిన అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 4 వేలకు పైగా విద్యార్థినులు ఈ సెలవును ఉపయోగించుకుంటున్నారు. ఇక ఈ విశ్వవిద్యాలయం రూపొందించిన పాలసీలో భాగంగా.. ప్రతి సెమిస్టర్‌కు కావాల్సిన మొత్తం హాజరులో రెండు శాతం సడలింపునిచ్చారు. అలాగే 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షలు రాయడానికి అనుమతినిచ్చింది యాజమాన్యం. కొచ్చి యూనివర్సిటీ తర్వాత.. అసోంలోని ‘తేజ్‌పూర్‌ యూనివర్సిటీ’, ‘నేషనల్‌ లా యూనివర్సిటీ-జ్యుడీషియల్‌ అకాడమీ’, మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లోని ‘ధర్మశాస్త్ర నేషనల్‌ లా యూనివర్సిటీ’.. తదితర విద్యాసంస్థలు సైతం నెలసరి సెలవును ప్రకటించాయి.

ఇదిలా ఉంటే.. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఉన్న త్రిపునితుర ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుకునే విద్యార్థినులకు కూడా పిరియడ్‌ లీవ్‌ను అందిస్తున్నారు. ఆ పాఠశాలలో చదువుకొనే విద్యార్థినులు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయినులకు కూడా నెలసరి సమయంలో సెలవు తీసుకునే వెసులుబాటును ఎప్పటినుంచో కల్పిస్తోందీ పాఠశాల.

బిహార్‌.. ఆదర్శం!

విద్యార్థినులే కాదు.. కొన్ని సంస్థల ఉద్యోగినులూ నెలసరి సెలవుతో లబ్ధి పొందుతున్నారు. ఈ క్రమంలో బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం 1992 నుంచే అక్కడి ప్రభుత్వ ఉద్యోగినులకు రెండు రోజుల నెలసరి సెలవును అందిస్తూ దేశం మొత్తానికే ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడి ప్రభుత్వ ఉద్యోగినులు శారీరక కారణాల దృష్ట్యా ప్రతినెలా రెండు రోజులు ప్రత్యేక సెలవులు తీసుకునే అవకాశం ఉంది. ఇతర సెలవులకు అదనంగా వీటిని అందించడం విశేషం.. ఇలా ప్రభుత్వ ఉద్యోగినులకు ‘బయలాజికల్‌ రీజన్స్‌’ పేరిట నెలకు రెండు రోజులు సెలవులు అందిస్తోన్న ఏకైక రాష్ట్రం కూడా బిహారే! మరే ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగినులకు ఇలాంటి సౌకర్యం లేకపోవడం గమనార్హం! ఇక ఇప్పటికే కొన్ని ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలు, డిజిటల్‌ మీడియా సంస్థలు, స్టార్టప్స్‌.. తదితర ప్రైవేట్‌ కంపెనీలు నెలసరి సెలవును అందిస్తూ.. మహిళల నెలసరి ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్