Usha Reddi: అప్పుడు మేయర్‌.. ఇప్పుడు సెనేటర్!

భారతీయ మహిళలు విదేశాల్లో స్థిరపడడమే కాదు.. అక్కడి రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే.. భారత సంతతికి చెందిన ఉషా రెడ్డి. అమెరికా క్యాన్సస్ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్‌ 22 స్టేట్‌ సెనేటర్‌గా తాజాగా నియమితులయ్యారామె. విద్యావేత్తగా కెరీర్‌ ప్రారంభించి.. మక్కువతో రాజకీయాల్లోకి....

Published : 14 Jan 2023 20:41 IST

(Photos: Twitter)

భారతీయ మహిళలు విదేశాల్లో స్థిరపడడమే కాదు.. అక్కడి రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే.. భారత సంతతికి చెందిన ఉషా రెడ్డి. అమెరికా క్యాన్సస్ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్‌ 22 స్టేట్‌ సెనేటర్‌గా తాజాగా నియమితులయ్యారామె. విద్యావేత్తగా కెరీర్‌ ప్రారంభించి.. మక్కువతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె.. ప్రస్తుతం డెమొక్రటిక్‌ పార్టీలో కొనసాగుతున్నారు. తన కొత్త బాధ్యతతో అక్కడి ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేస్తానంటోన్న ఈ లేడీ పొలిటీషియన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..!

ఉషా రెడ్డి పుట్టింది భారత్‌లోనే! అయితే 1973లో తనకు ఎనిమిదేళ్లున్నప్పుడు తన కుటుంబం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది. సైకాలజీ, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. క్యాన్సస్ స్టేట్‌ యూనివర్సిటీ నుంచి ఎడ్యుకేషనల్‌ లీడర్‌షిప్‌లో మాస్టర్స్‌ పట్టా అందుకున్నారు.

రెండుసార్లు మేయర్‌గా..!

ఉషకు చదువన్నా, నలుగురికీ విద్యను పంచడమన్నా చాలా ఇష్టం. ఈ ఆసక్తితోనే తొలుత మన్‌హట్టన్ ఆగ్డెన్ పబ్లిక్‌ స్కూల్స్‌లో విద్యావేత్తగా పనిచేశారు. ఈ క్రమంలో ఆ పాఠశాలకు సంబంధించిన ‘నేషనల్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ ఛాప్టర్‌’కి అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తించారు. 2013లో  మన్‌హట్టన్ సిటీ కమిషన్‌కు ఎంపికైన ఆమె.. నాలుగేళ్ల పాటు పనిచేశారు. ఆపై 2017, 2021లోనూ రెండు పర్యాయాలు తిరిగి ఎంపికయ్యారు. 2016-17, 2020లో రెండుమార్లు మేయర్‌గానూ పనిచేశారు. గత 28 ఏళ్లుగా మన్‌హట్టన్‌లోనే నివాసముంటోన్న ఉషకు స్వదేశమంటే ఎనలేని ప్రేమ. తన ట్విట్టర్‌ కవర్‌ ఫొటోగా గాంధీజీ కొటేషన్‌ని పెట్టుకోవడమే ఇందుకు నిదర్శనం!

అదే నా లక్ష్యం!

ప్రస్తుతం డెమొక్రటిక్‌ పార్టీలో భాగమైన ఆమె.. తాజాగా డిస్ట్రిక్ట్‌ 22కు స్టేట్‌ సెనేటర్‌గా నియమితులయ్యారు. సుదీర్ఘకాలంగా ఈ పదవిలో ఉన్న టామ్‌ హాక్‌ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. 2025 వరకు ఈ పదవిలో కొనసాగనున్న ఉష.. ‘చాలా సంతోషంగా ఉంది.. డిస్ట్రిక్ట్‌ 22కు సెనేటర్‌గా పనిచేయడానికి ఉవ్విళ్లూరుతున్నా. సుదీర్ఘకాలం ఈ పదవిలో కొనసాగిన టామ్‌ హాక్‌ ఓ అత్యుత్తమ నాయకుడు. ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తా. ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడమే లక్ష్యంగా పెట్టుకున్నా. త్వరలోనే దానికి సంబంధించిన ప్రణాళికను ప్రకటిస్తా..’ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారామె. ప్రస్తుతం అక్కడి పలు కమ్యూనిటీల్లో క్రియాశీల సభ్యురాలిగా కొనసాగుతోన్న ఉష.. బ్రియాన్‌ అనే అమెరికన్‌ను వివాహమాడారు. ఈ జంటకు నలుగురు పిల్లలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్