Orissa Kelly : నాలా బాణం వెయ్యగలరా?

సాధారణంగా లక్ష్యానికి గురిపెట్టి చేతులతో బాణం వెయ్యమంటేనే తడబడతాం. అలాంటిది విన్యాసాలు చేస్తూ, శరీరాన్ని విల్లులా వంచుతూ.. కాళ్లతో, నోటితో బాణం వేయమంటే.. నోరెళ్లబెడతాం. ఇలాంటి సాహసోపేతమైన, ఒళ్లు గగుర్పొడిచే విలువిద్య విన్యాసాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది బ్రిటన్‌కు చెందిన....

Updated : 18 Jan 2023 13:14 IST

(Photos: Instagram)

సాధారణంగా లక్ష్యానికి గురిపెట్టి చేతులతో బాణం వెయ్యమంటేనే తడబడతాం. అలాంటిది విన్యాసాలు చేస్తూ, శరీరాన్ని విల్లులా వంచుతూ.. కాళ్లతో, నోటితో బాణం వేయమంటే.. నోరెళ్లబెడతాం. ఇలాంటి సాహసోపేతమైన, ఒళ్లు గగుర్పొడిచే విలువిద్య విన్యాసాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది బ్రిటన్‌కు చెందిన ఒరిస్సా కెల్లీ. అంతర్జాతీయ ఫుట్‌ ఆర్చర్‌గా/అక్రొబాటిక్‌ ఆర్చర్‌గా పేరుగాంచిన ఆమె.. తన ఆర్చరీ విన్యాసాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోల్ని తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే మరో సాహసోపేతమైన ఆర్చరీ స్టంట్‌కి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పెట్టింది కెల్లీ. అందులో భాగంగా.. అలవోకగా ఆమె చేసిన ఆర్చరీ విన్యాసం ఎంతోమంది మనసు దోచుకుంది.

ఒరిస్సా కెల్లీ.. ఈ పేరు వింటే తనకు, మన దేశానికి ఏదైనా సంబంధముందేమో.. అందుకే తన పేరులో మొదటి సగం ఒరిస్సా అని ఉంది అనుకుంటాం. అయితే ఇది నిజమేనట! మరో బిడ్డ కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతూ వచ్చిన తన తల్లిదండ్రులు.. ఒక దశలో ఒడిశా రాష్ట్రాన్ని సందర్శించి వెళ్లారని, ఆ తర్వాతే తాను పుట్టడంతో.. తనకు ఆ పేరు పెట్టినట్లు ఓ సందర్భంలో పంచుకుందీ స్టార్ ఆర్చర్.

మూడో ఏటే..!

ఇంగ్లండ్‌లోని వాట్‌ఫోర్డ్‌లో పుట్టి పెరిగిన కెల్లీకి చిన్నవయసు నుంచే జిమ్నాస్టిక్స్‌, ఆర్చరీ అంటే ప్రాణమట! ఈ మక్కువతోనే మూడేళ్ల వయసు నుంచే జిమ్నాస్టిక్స్‌ సాధన చేయడం ప్రారంభించిన ఆమె.. గ్రేట్‌ బ్రిటన్‌ తరఫున పలు పోటీల్లోనూ పాల్గొంది. ఇక 17 ఏళ్ల వయసులో పైచదువుల కోసం యూనివర్సిటీలో అప్లై చేసిన అప్లికేషన్‌ రద్దు చేసుకొని మరీ సర్కస్‌లో ప్రదర్శనలివ్వడానికి వెళ్లానంటోంది కెల్లీ. ప్రతి విషయంలోనూ ప్రత్యేకంగా ఆలోచించే ఈ లేడీ ఆర్చర్‌.. విన్యాసాల్లోనూ కొత్తదనం ప్రదర్శిస్తూ చూపరులను ఆకట్టుకునేది. ఈ ప్రత్యేకతే ఆమెకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పచ్చు.

స్వీయ శిక్షణతో..!

ఇలా జిమ్నాస్టిక్స్‌లో పూర్తిగా ఆరితేరిన తర్వాత.. తన దృష్టిని విలువిద్యపై కేంద్రీకరించింది కెల్లీ. అలాగని అనుభవజ్ఞులైన నిపుణుల వద్ద శిక్షణ తీసుకుందేమో అనుకుంటే పొరపాటే! ఎందుకంటే తనకు తానే స్వీయ శిక్షణతో ఆర్చరీలో పట్టు పెంచుకుందామె. అంతేకాదు.. విలువిద్యకు జిమ్నాస్టిక్స్‌ని జోడిస్తూ.. కొత్త రకమైన విన్యాసాలు చేయాలని.. ఈ క్రమంలో తానే అందరిలో ప్రత్యేకంగా నిలవాలని సంకల్పించుకుంది కెల్లీ. ఇందుకోసం ఆరు నెలల పాటు.. రోజుకు ఆరు గంటల చొప్పున పట్టుదలతో సాధన చేసిందామె. ఈ అంకితభావమే ఆమెను అంతర్జాతీయ ఫుట్‌ ఆర్చర్‌గా/అక్రొబాటిక్ ఆర్చర్‌గా నిలబెట్టాయి. ఇలా తన సాహసాలతో విశ్వ వేదికపై ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయడమే కాదు.. తాను చేసే సాహసోపేతమైన విన్యాసాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని తరచూ సోషల్‌ మీడియాలోనూ పోస్ట్‌ చేస్తుంటుంది కెల్లీ. తద్వారా లక్షల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇక తాను చేసే ఈ విన్యాసాల్ని చూడడానికి రెండు కళ్లూ సరిపోవంటే అతిశయోక్తి కాదు.

మండుతున్న బాణాన్ని గురిపెట్టి..!

తలకిందులుగా నిలబడి బాణాన్ని సంధించడం, వ్యతిరేక దిశలో చూస్తూ లక్ష్యాన్ని ఛేదించడం, కాళ్లను 180 డిగ్రీలలో ఉంచి బాణం వేయడం, టేబుల్‌పై పడుకొని కాళ్లతో బాణం వేయడం.. ఇలా విల్లుతో తాను ప్రయత్నించని విన్యాసం లేదని నిస్సందేహంగా చెప్పచ్చు. వీటితో పాటు మండుతున్న బాణాన్ని గురిపెట్టి ఇటీవలే మరో విన్యాసం చేసింది కెల్లీ. తలకిందులుగా ఉండి.. తన శరీరాన్ని వ్యతిరేక దిశలో వంచుతూ కాళ్లతో బాణం వేసి లక్ష్యాన్ని ఛేదించింది కెల్లీ. దీనికి సంబంధించిన వీడియోకు లక్షల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి. కళ్లు చెదిరే ఆమె విన్యాసాలు చూసి ఎంతోమంది ముక్కున వేలేసుకున్నారు. అంతేకాదు.. కెల్లీ కంటెంట్‌ క్రియేటర్‌ కూడా! ఈక్రమంలో ఫుట్‌ ఆర్చరీకి సంబంధించిన మెలకువల్ని సోషల్‌ మీడియా వేదికగా వీడియోల రూపంలో వివరిస్తుంటుందామె. ప్రస్తుతం ఆమె సోషల్‌ మీడియా ఖాతాల్ని లక్షల కొద్దీ అభిమానులు ఫాలో అవుతున్నారు.

నా గెలుపు సూత్రమదే!

తన విన్యాసాలతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న కెల్లీ.. ‘బ్రిటన్స్‌ గాట్‌ ట్యాలెంట్‌ షో’, అమెరికాకు చెందిన టీవీ కార్యక్రమం ‘ది గో బిగ్‌ షో’ల్లో పాల్గొంది. మరోవైపు ‘వండర్‌ ఉమన్‌’ సినిమాలోనూ కనిపించింది. తనకెంతో ఇష్టమైన విల్లుతో రెండుసార్లు ఈ ప్రపంచాన్ని చుట్టేసిన ఈ చిన్నది.. ‘మనపై మనకు విశ్వాసముంటే భవిష్యత్తంతా ఉజ్వలంగా ఉంటుంది.. తద్వారా ప్రపంచాన్ని జయించచ్చు..’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతుంది. అందుకే ప్రతి విషయంలోనూ ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతుంటుంది కెల్లీ. ఇక ఈ స్టార్‌ ఆర్చర్‌కు పీనట్‌ బటర్‌ అంటే విపరీతమైన ఇష్టమట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్