ఎలా ఉన్నా సిగ్గుపడకండి.. నచ్చినట్లు చేయండి!

కాస్త లావుగా ఉంటే వదులైన దుస్తులతో శరీరాకృతిని దాచేస్తాం.. వేసుకోవాలని ఉన్నా బికినీ, జీన్స్‌.. వంటి వాటి ఊసే ఎత్తం. ఇక డ్యాన్స్‌ మాట దేవుడెరుగు! ఇలాంటి వాళ్లు ముంబయికి చెందిన తన్వీ గీతా రవిశంకర్‌ను చూస్తే తప్పకుండా తమ మనసు మార్చుకుంటారు. ఎందుకంటే ఆమె బరువు వంద కిలోల....

Published : 05 Jan 2023 15:49 IST

(Photos: Instagram)

కాస్త లావుగా ఉంటే వదులైన దుస్తులతో శరీరాకృతిని దాచేస్తాం.. వేసుకోవాలని ఉన్నా బికినీ, జీన్స్‌.. వంటి వాటి ఊసే ఎత్తం. ఇక డ్యాన్స్‌ మాట దేవుడెరుగు! ఇలాంటి వాళ్లు ముంబయికి చెందిన తన్వీ గీతా రవిశంకర్‌ను చూస్తే తప్పకుండా తమ మనసు మార్చుకుంటారు. ఎందుకంటే ఆమె బరువు వంద కిలోల పైమాటే! ఎవరేమనుకున్నా తనకు నచ్చినట్లుగానే ఉంటానంటోంది.. ఇష్టమైన దుస్తులే వేసుకుంటానంటోంది. అంతెందుకు.. ఊబకాయం ఉన్నా డ్యాన్స్‌తో అదరగొట్టేస్తుంటుంది. అందుకే ‘బేషరమ్‌ రంగ్‌’ పాటకు మొన్న దీపిక స్టెప్పులేస్తే మిశ్రమంగా స్పందించినా.. అవే స్టెప్పులు ఇప్పుడు తన్వి వేస్తే తెగ ప్రశంసిస్తున్నారు. లావు, శరీరాకృతి పక్కన పెట్టి.. ఆత్మ విశ్వాసంతో ఆమె చేసిన డ్యాన్స్కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇదనే కాదు.. తన ప్రతి పోస్ట్‌తో స్వీయ ప్రేమను, బాడీ పాజిటివిటీని చాటే తన్వీ కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం!

సిగ్గుపడకండి.. నచ్చినట్లుగా ఉండండి!

షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణె నటించిన ‘పఠాన్‌’ చిత్రంలోని ‘బేషరమ్‌ రంగ్‌’ అనే పాట ఇటీవలే విడుదలై మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే! ముఖ్యంగా ఈ పాటలో దీపిక అందాల ఆరబోత కాస్త వివాదాస్పదమైనప్పటికీ.. చాలామంది ఈ పాటకు కవర్‌ సాంగ్స్‌ చేస్తూ దీన్ని మరింత పాపులర్‌ చేశారు. వారిలో ముంబయికి చెందిన ప్లస్‌ సైజ్‌ మోడల్‌ తన్వీ గీతా రవిశంకర్‌ కూడా ఒకరు. అయితే అందరి కవర్‌ సాంగ్స్‌ మాటేమో గానీ.. తన్వి కవర్‌ సాంగ్‌ మాత్రం తెగ పాపులరైపోయింది. ఇందుకు కారణం.. ఆమె బొద్దుగా ఉన్నా బికినీ వేసుకొని మరీ.. పాటలో మాదిరిగా బెల్లీ డ్యాన్స్‌ మూవ్స్‌ చేయడమే! అదీ అంత లావుగా ఉన్నా ఎంతో సునాయాసంగా, చక్కగా డ్యాన్స్‌ చేసి నెటిజన్ల మనసు దోచుకుందామె. అంతేకాదు.. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘ఎలా ఉన్నామన్న ఆలోచనను పక్కన పెట్టి.. మనసుకు నచ్చిందే చేయండి.. ఇష్టమైన దుస్తులు వేసుకోండి.. ఇతరులు మీ గురించి ఏమనుకున్నా పట్టించుకోకుండా మీకు నచ్చినట్లు జీవించండి.. స్వీయ ప్రేమను మించిందేదీ లేదు..’ అంటూ స్ఫూర్తిదాయక క్యాప్షన్‌ పెట్టింది తన్వి. చాలామంది దీనిపై సానుకూలంగా స్పందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘ఎంతోమందికి మీరు స్ఫూర్తి!’ అంటూ ప్రశంసిస్తున్నారు.

డ్యాన్సర్‌ కావాలనుకొని..!

సుమారు వంద కిలోలకు పైగా బరువున్న తన్వి ప్రస్తుతం ప్లస్‌ సైజ్‌ మోడల్‌గా, డ్యాన్సర్‌గా, సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా రాణిస్తోంది. చిన్నతనం నుంచీ తనకు డ్యాన్స్‌ అంటే ప్రాణం. కానీ తన అధిక బరువు కారణంగా ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌ను కాలేకపోయానంటోంది.

‘సాధారణంగా నాలా లావుగా ఉన్న వారికి రెండుసార్లు నామకరణం జరుగుతుంది. పుట్టగానే పేరెంట్స్ మనకు ఓ పేరు పెడితే.. పెరిగి పెద్దయ్యే క్రమంలో మన శరీరాకృతిని చూసి సమాజం మనకు రకరకాల పేర్లు పెడుతుంది.. నాకూ ఇలాంటి అవహేళనలు తప్పలేదు. అయినా అమ్మ నాకెప్పుడూ ఒక మాట చెబుతుండేది.. నీ దృష్టి నీ శరీరాకృతిపై కాదు.. చదువుపై పెట్టమని! ఇదే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌ని కావాలన్న కలతో పుణే నుంచి ముంబయి చేరుకున్నా. కానీ బరువు తగ్గితే గానీ డ్యాన్స్‌ అకాడమీలో చేర్చుకోమన్నారు. దాంతో ఎలాగైనా బరువు తగ్గి డ్యాన్స్‌ నేర్చుకోవాలని డిసైడయ్యా..’

అసలు సమస్య అదే..!

‘కానీ ఎంత ప్రయత్నించినా బరువులో పెద్దగా మార్పులేవీ కనిపించలేదు. అయితే అదే సమయంలో నాకు ఈటింగ్‌ డిజార్డర్‌ సమస్య ఉందని తెలిసింది. దీనివల్ల శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఆందోళనకు గురయ్యేదాన్ని. దాన్నుంచి బయటపడేందుకు నా డ్యాన్స్‌ నైపుణ్యాలనే నమ్ముకున్నా. దీనికి తోడు నా మెంటార్‌ కూడా నన్ను ప్రోత్సహించారు. అయితే ఈ సమయంలో నన్ను నేను నిరూపించుకోవడానికి మరో అవకాశం వస్తుందని ఊహించలేదు. లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో భాగంగా ప్లస్‌ సైజ్‌ ఫ్యాషన్‌ షో ఒకటి నిర్వహించారు. నాకూ కొత్త కొత్త ఫ్యాషన్లు ప్రయత్నించడం, మోడలింగ్‌ చేయడమంటే చిన్నప్పట్నుంచి చాలా ఇష్టం. ఈ మక్కువతోనే ఆ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నా. ఆ వేదికగా నాలా శరీరాకృతి విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కలిశా. అయినా వాళ్లు ఇవన్నీ పక్కన పెట్టి తమకు నచ్చినట్లుగా ఉండడం, నచ్చిన దుస్తులు ధరించడం చూసి స్ఫూర్తి పొందా. ఇతరుల మాటలు పట్టించుకోవడం మానేసి నలుగురిలో ప్రేరణ కలిగించాలనుకున్నా.. ఈ ఆలోచనతోనే ‘ది చబ్బీ ట్విర్లర్‌’ అనే సోషల్‌ మీడియా వేదికను ప్రారంభించా..’ అంటూ చెప్పుకొచ్చింది తన్వి.

అది మన తప్పు కాదు!

సోషల్‌ మీడియా వేదికగా స్వీయ ప్రేమ, బాడీ పాజిటివిటీని చాటేలా పోస్టులు పెడుతూ ఎంతోమందిలో స్ఫూర్తి రగిలిస్తోన్న తన్వి.. గతేడాది ‘కాస్మోపాలిటన్‌ బాడీ లవ్‌ ఇన్ఫ్లుయెన్సర్‌’ అవార్డునూ అందుకుంది. ‘స్కూల్‌, కాలేజీ, డ్యాన్స్‌ అకాడమీ.. ఇలా ఎక్కడకు వెళ్లినా నాకు నెగెటివ్‌ కామెంట్లు తప్పలేదు. అయితే నేను మాత్రం నా శరీరాన్ని గౌరవిస్తూనే ముందుకు సాగా. చీరలు, జీన్స్, షార్ట్స్‌, బికినీ.. ఇలా అన్ని రకాల దుస్తులు ధరించి తీయించుకున్న ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్నా. మొదట్లో వాటిని చూసి చాలామంది నన్ను విమర్శించినా.. ఆ తర్వాత క్రమంగా ప్రశంసించడం చూసి నా ఆత్మవిశ్వాసం రెట్టించింది.

ఒక మహిళ ‘నాకు ఫ్యాషనబుల్‌గా ఉండాలని ఆసక్తి ఉంది. కానీ బికినీ వేసుకునే ధైర్యం లేదు. మిమ్మల్ని చూసి 42 ఏళ్ల వయసులో మొదటిసారి బికినీ ధరించాను’ అని మెసేజ్‌ చేసింది. మరొక అమ్మాయి ‘నాకు ఊబకాయం సమస్య ఉంది... అందుకే ఇప్పటి వరకు జీన్స్‌ ధరించలేదు. కానీ మిమ్మల్ని చూశాక జీన్స్‌ ధరించాలన్న ధైర్యం వచ్చింది’ అంటూ కామెంట్‌ పెట్టింది. ఇలా నన్ను చూసి చాలామంది ఆడవారు స్ఫూర్తి పొందుతుంటే ముచ్చటేస్తుంటుంది. నేను చేయాలనుకున్నదీ ఇదే! లావుగా ఉండడం తప్పు కాదు.. ఒక్కోసారి అది మన చేతుల్లోనూ ఉండదు. కాబట్టి ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించడం, ప్రేమించడం నేర్చుకుంటే.. జీవితంలో పైకెదగగలం.. నలుగురికీ స్ఫూర్తిగా నిలవగలం..’ అంటోంది తన్వి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్