Miss World: 28 ఏళ్ల తర్వాత ‘అందాల’ అతిథులొచ్చేశారు!

ఇంటికెవరైనా అతిథులొస్తున్నారంటే ముందు నుంచే ఇల్లంతా నీట్‌గా సర్దుకుంటాం.. వారికి చక్కటి ఆతిథ్యాన్ని అందించడానికి సకల సదుపాయాలూ సమకూర్చుకుంటాం.. విదేశీ అతిథుల్ని సంతృప్తిపరచడానికి ప్రస్తుతం భారత్‌ కూడా ఇదే రేంజ్‌లో సిద్ధమైంది.

Updated : 20 Feb 2024 20:18 IST

(Photos: Instagram)

ఇంటికెవరైనా అతిథులొస్తున్నారంటే ముందు నుంచే ఇల్లంతా నీట్‌గా సర్దుకుంటాం.. వారికి చక్కటి ఆతిథ్యాన్ని అందించడానికి సకల సదుపాయాలూ సమకూర్చుకుంటాం.. విదేశీ అతిథుల్ని సంతృప్తిపరచడానికి ప్రస్తుతం భారత్‌ కూడా ఇదే రేంజ్‌లో సిద్ధమైంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 28 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ‘ప్రపంచ సుందరి’ పోటీలకు మన దేశం ఆతిథ్యమిస్తోన్న నేపథ్యంలో ఈ పోటీ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. దాదాపు 20 రోజుల పాటు కొనసాగనున్న ఈ పోటీలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఇలా ఈసారి వందలాది మంది విదేశీ ముద్దుగుమ్మలంతా ‘ప్రపంచ సుందరి’ వేదిక పైకి చేరడంతో ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి భారత్ పైనే ఉంది. మరి, మన దేశ ఆతిథ్యంతో పాటు మరెన్నో ప్రత్యేకతల్నీ సొంతం చేసుకున్న ఈ అందాల పోటీల విశేషాలేంటో తెలుసుకుందామా?!

రెండోసారి!

ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అందాల పోటీలకు ఆతిథ్యమివ్వాలని ప్రతి దేశం ఉవ్విళ్లూరుతుంటుంది. అలా ఈసారి ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం మన దేశానికి దక్కింది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ అందాల పోటీలకు భారత్‌ ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి. గతంలో 1996లో తొలిసారి ఇక్కడ ఈ అందాల పోటీలు నిర్వహించారు. ఆ ఏడాది గ్రీస్ భామ ఇరెనె కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. ఇక ఈసారి ఫిబ్రవరి 20న ప్రారంభ వేడుకతో మొదలుకొని పలు పోటీలు నిర్వహించనున్నారు. మార్చి 9న ఫైనల్‌ జరగనుంది. ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల భామలు కనువిందు చేయనున్నారు. మన దేశం తరఫున కర్ణాటకకు చెందిన సిని శెట్టి ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటం కోసం పోటీ పడుతుండగా, గత విజేత కరోలినా (పోలండ్‌) ఈసారి ప్రపంచ సుందరికి తన స్వహస్తాలతో కిరీటం అలంకరించేందుకు సిద్ధమైంది.


తగ్గేదేలే!

ఈసారి జరుగుతోన్న 71వ ‘ప్రపంచ సుందరి’ పోటీలకు భారత్‌ ఆతిథ్యమివ్వడానికి తోడు.. మన దేశం తరఫున సిని శెట్టి ఈ పోటీల్లో పాల్గొంటుండడంతో అందరి దృష్టీ ఆమె పైనే ఉందని చెప్పాలి. ఇలా ఈసారి తానో పోటీదారుగానే కాకుండా.. భారత్‌ అందిస్తోన్న ఆతిథ్యంలో తానూ భాగమవడం తన జర్నీని మరింత ప్రత్యేకంగా మలచిందంటోందీ అందాల తార.
‘120 దేశాలకు చెందిన అమ్మాయిలంతా ఇక్కడికి చేరుకోవడం, మన ఆతిథ్యాన్ని స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పోటీల్లో నేను పాలుపంచుకోవడం ఒకెత్తయితే.. ఆతిథ్యంలోనూ భాగమవడం మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది. మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా స్ఫూర్తితోనే అందాల పోటీల్లో పాల్గొనాలన్న లక్ష్యం పెట్టుకున్నా. నిర్భయంగా, మనసు చెప్పింది చేసే ముక్కుసూటితనం ఆమె సొంతం. నాకూ నా సిద్ధాంతాల్ని నమ్ముతూ పారదర్శకంగా ఉండడమంటే ఇష్టం. జీవితంలో నేనేదీ ప్లాన్‌ చేసుకోను. ప్రతి సవాలునూ అవకాశంగా స్వీకరిస్తూ ముందుకు సాగుతానే తప్ప వెనకడుగు వేసే ఆలోచనే చేయను.. ఇంతటి ప్రతిష్టాత్మక పోటీ అంటే కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది.. కానీ నేను కూల్‌గానే ఉన్నా..’ అంటోన్న సిని ఈ పోటీల్లో దేశం గర్వించే ప్రదర్శన చేస్తానంటోంది. ఎలాగైతే ఈ ముద్దుగుమ్మ ప్రతిసారీ తన భరతనాట్య ప్రదర్శనతో ప్రేక్షకుల్ని గంటల తరబడి కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తుందో.. మిస్‌ వరల్డ్‌ పోటీల వేదిక పైనా అలాంటి ప్రదర్శనే చేయాలని భారతీయులు ఆకాంక్షిస్తున్నారు.


పుట్టింటికొచ్చినట్లుంది!

2022లో చివరిసారిగా ‘ప్రపంచ సుందరి’ పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో పోలండ్‌ బ్యూటీ కరోలినా అందాల కిరీటం అందుకుంది. అయితే గతేడాది ఓ ఈవెంట్‌ కోసం భారత్‌లో పర్యటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇక్కడి ఆతిథ్యానికి, పర్యటక ప్రదేశాల అందాలకు ముగ్ధురాలినయ్యానంటోంది. ప్రస్తుతం ‘మిస్‌ వరల్డ్‌’ అందాల పోటీల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత్‌లోనే ఉంటోందామె.

‘ప్రపంచదేశాల్లో అత్యుత్తమంగా ఆతిథ్య సేవలందించే దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉంటుంది. ‘మిస్‌ వరల్డ్‌’ పోటీల కోసం గత కొన్ని రోజులుగా నేను ఇండియాలోనే ఉంటున్నా. నేను భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. ఇక్కడికొచ్చిన ప్రతిసారీ పుట్టింటికొచ్చిన భావన కలుగుతుంటుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ అందరూ ఓ కుటుంబంలా కలిసిమెలిసి ఉండడం, ప్రేమ ఆప్యాయతలు, గౌరవమర్యాదలు, దయాగుణం.. ఇవన్నీ నన్నెంతగానో ఆకర్షించాయి. ఈ విలువలే ప్రపంచ దేశాలకూ ఆదర్శంగా నిలుస్తాయి. ఏదేమైనా ఈ పోటీల నేపథ్యంలో మరో నెల రోజుల పాటు ఇక్కడ గడిపే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది..’ అంటోందీ ప్రపంచ సుందరి.


డిజైనర్‌.. ఆమే!

ఈసారి ప్రపంచ సుందరి పోటీలకు భారత్‌ ఆతిథ్యమివ్వడం, సిని శెట్టి ఈ పోటీల్లో పాల్గొనడమే కాదు.. మరో ప్రత్యేకత కూడా మన సొంతమైంది. అదీ ప్రముఖ డిజైనర్‌ అర్చనా కొచ్చర్‌ రూపంలో! ఈసారి మిస్‌ వరల్డ్‌ పోటీలకు ‘అధికారిక ఫ్యాషన్‌ డిజైనర్‌’గా ఆమెను ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే ఈసారి ఈ పోటీల్లో పాల్గొనే 120 దేశాలకు చెందిన అందాల భామలకు ఆమె దుస్తులు రూపొందించనుంది. అయితే వాళ్ల శరీరాకృతి, అభిరుచుల్ని బట్టి ఆయా ఈవెంట్లకు దుస్తులు రూపొందించడమంటే మాటలు కాదు.. అయినా దీన్నో సవాలుగా కాకుండా.. తనకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానంటున్నారు అర్చన. అయితే గతంలోనూ అంతర్జాతీయ వేదికలపై పలు ఫ్యాషన్‌ వీక్స్‌లో తన ఫ్యాషన్‌ నైపుణ్యాల్ని ప్రదర్శించి మెప్పించిన ఆమె.. సెలబ్రిటీ డిజైనర్‌గానూ పేరుప్రఖ్యాతులు సొంతం చేసుకుంది. శ్రద్ధా కపూర్‌, కంగనా రనౌత్‌, సోహా అలీ ఖాన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, సమీరా రెడ్డి, ఇలియానా.. వంటి అగ్రతారలు ఆమె క్లైంట్స్‌ లిస్ట్‌లో ఉన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్