అందం, ప్రతిభ కలగలిసిన అలీనా.. పుతిన్ ప్రేయసి గురించి ఇవి తెలుసా?

సెలబ్రిటీలే అయినా కొంతమంది తమ వ్యక్తిగత జీవితం, కెరీర్.. తెరిచిన పుస్తకంలా ఉండాలనుకుంటారు. మరికొంతమంది రహస్య జీవితం గడపడానికి ఇష్టపడుతుంటారు. అయితే తాను ప్రైవసీకే ప్రాధాన్యమిస్తానంటోంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రేయసి అలీనా కబయేవా. గతేడాది ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం....

Published : 04 Mar 2023 19:05 IST

(Photos: Instagram)

సెలబ్రిటీలే అయినా కొంతమంది తమ వ్యక్తిగత జీవితం, కెరీర్.. తెరిచిన పుస్తకంలా ఉండాలనుకుంటారు. మరికొంతమంది రహస్య జీవితం గడపడానికి ఇష్టపడుతుంటారు. అయితే తాను ప్రైవసీకే ప్రాధాన్యమిస్తానంటోంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రేయసి అలీనా కబయేవా. గతేడాది ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి అప్పుడప్పుడూ పలు విషయాల నేపథ్యంలో వార్తల్లో నిలుస్తోన్న ఆమె.. తాజాగా మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇందుకు కారణం.. ప్రస్తుతం తాను నివసిస్తోన్న విలాసవంతమైన భవంతి. మాస్కోకు 400 కిలోమీటర్ల దూరంలో, రూ. 990 కోట్ల విలువైన ఎస్టేట్‌లో పుతిన్‌ ఆమెతో కలిసి రహస్య జీవనం గడుపుతున్నట్లు ఇటీవలే వచ్చిన ఓ కథనం వైరలైంది. దీంతో చాలామంది ఆమె వ్యక్తిగత జీవితం గురించి, ఆ భవంతి గురించి తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్‌ ప్రియసఖి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు..!

నాన్న స్ఫూర్తితో..!

నాటి సోవియట్‌ యూనియన్‌లో భాగమైన తాష్కెంట్‌ (ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్‌ రాజధాని)లో జన్మించింది అలీనా. ఆమె తండ్రి మరాట్‌ కబయేవ్‌.. రష్యన్‌ ఫెడరేషన్‌లో అతిపెద్ద మైనార్టీ వర్గానికి చెందిన వారు. తల్లి ల్యూబోవ్‌ కబయేవా రష్యన్‌. వృత్తిరీత్యా ఫుట్‌బాల్‌ క్రీడాకారుడైన ఆమె తండ్రిని చూస్తూ పెరిగిన అలీనా.. తానూ క్రీడల్లో రాణించాలని కోరుకుంది. చిన్నతనంలో తన తండ్రి క్రీడా పోటీల నేపథ్యంలో ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్‌, రష్యా.. దేశాల్లో తరచూ ప్రయాణించేది. ఆటల్లో భాగంగా ముఖ్యంగా జిమ్నాస్టిక్స్‌ను ఇష్టపడిన ఆమె.. మూడో ఏట నుంచే రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌లో మెలకువలు నేర్చుకోవడం ప్రారంభించింది. ఇక 11 ఏట తన తల్లితో కలిసి మాస్కోకు చేరిన ఆమె.. ప్రముఖ రిథమిక్‌ జిమ్నాస్ట్‌ ఇరినా వినెర్‌ దగ్గర శిక్షణ పొందింది. అత్యుత్తమంగా సాగిన తన జిమ్నాస్టిక్స్‌ కెరీర్‌లో ఇరినాదే కీలక పాత్ర అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది అలీనా.

‘ఒలింపిక్‌’ విన్నర్!

1998లో తన 15 ఏళ్ల వయసులో ‘యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్స్‌’ గెలిచి పతకాల వేట ప్రారంభించిన అలీనా.. ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ సమయంలో రష్యన్‌ జిమ్నాస్టిక్స్‌ టీమ్‌లో అతిపిన్న వయస్కురాలిగానూ నిలిచిందామె. ఆ తర్వాత పలు ‘ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌’, ‘యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్స్‌’లోనూ బంగారు పతకాలు సాధించిన అలీనా.. సిడ్నీ, ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లోనూ మెడల్స్ తన ఖాతాలో వేసుకుంది. ఒలింపిక్‌ గేమ్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌, ప్రపంచకప్‌ ఫైనల్‌, గ్రాండ్‌ ప్రి ఫైనల్‌.. ఇలా అన్ని గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్లను గెలుచుకున్న ప్రపంచంలోని ముగ్గురు జిమ్నాస్ట్‌లలో అలీనా ఒకరు.

రాజకీయాల్లోనూ ముద్ర!

జిమ్నాస్టిక్స్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాకారిణిగా నిలిచిన అలీనా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలో 2007-14 వరకు యునైటెడ్‌ రష్యా పార్టీకి ప్రాతినిథ్యం వహించారు. పార్లమెంట్‌ సభ్యురాలిగానూ వ్యవహరించారు. ఇందులో భాగంగా యువజన విధానాలు, క్రీడల అభివృద్ధికి కృషి చేశారామె. అంతేకాదు.. చట్టవిరుద్ధమైన చర్యల ద్వారా ప్రభావితమైన చిన్నారులు, యువత హక్కుల రక్షణ కోసం గళమెత్తారు అలీనా. ఆమె చొరవతో సంబంధిత చట్టం ఆమోదితమవడం విశేషం. మరోవైపు నేషనల్‌ మీడియా గ్రూప్‌ డైరెక్టర్ల బోర్డు ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఈ కంపెనీకి రష్యాలోని అన్ని ప్రధాన మీడియా సంస్థల్లో మెజార్టీ వాటాలున్నాయి.

మనసున్న అలీనా!

అలీనాలో సేవా దృక్పథం కూడా ఎక్కువే! ఈ క్రమంలోనే 2008లో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి.. దీని ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు పేద పిల్లలకు, ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు విద్యాఫలాలు అందిస్తున్నారు. యువత కోసం ప్రత్యేకమైన విద్యా కార్యక్రమాల్ని ఏర్పాటుచేస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు, పలు స్కూళ్లలో కంప్యూటర్‌ తరగతులు, యువతకు జర్నలిజం పాఠాలు బోధించడంతో పాటు.. క్రీడల్లో ఆసక్తి ఉన్న వారిని ఈ దిశగా ప్రోత్సహిస్తున్నారామె. జిమ్నాస్టిక్స్‌లో ఆమె ప్రతిభ, ఈ క్రీడ కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన ‘అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌ మండలి (FIG)’ అలీనాను ‘తొలి రిథమిక్ జిమ్నాస్టిక్స్‌ అంబాసిడర్‌’గా బాధ్యతల్ని అప్పగించి గౌరవించింది.

పుతిన్‌ ప్రేయసిగా..!

‘నేను ప్రైవసీనే ఇష్టపడతాను.. నా వ్యక్తిగత జీవితంలో ఎవరు జోక్యం చేసుకున్నా సహించను..’ అంటోన్న అలీనా.. గతేడాది రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభ సమయం నుంచి అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. పుతిన్‌ తన ప్రేయసి అలీనా, వీళ్లిద్దరి ముగ్గురు పిల్లల్ని స్విట్జర్లాండ్‌లో రహస్యంగా, సురక్షితంగా ఉంచారని ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే! ఇక ఇప్పుడు ఆమె పేరు మరోసారి వార్తల్లోకెక్కింది. మాస్కోకు 400 కిలోమీటర్ల దూరంలో దాదాపు రూ. 990 కోట్ల విలాసవంతమైన ఎస్టేట్‌లో పుతిన్‌ ఆమెతో రహస్యంగా జీవితం గడుపుతున్నట్లు ఓ వార్తా కథనం పేర్కొంది. ఈ ఎస్టేట్‌లో అనేక భవనాలున్నాయట. వారి ముగ్గురు పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా సువిశాలమైన ఆటస్థలం కూడా ఏర్పాటు చేయించినట్లు వార్తలు వచ్చాయి. సుమారు 13 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఈ భవంతి నిర్మాణంలో బంగారాన్ని కూడా ఉపయోగించినట్లు చెబుతుంటారు. ఆయా కార్యక్రమాల్లో భాగంగా వీరిద్దరి ఫొటోలు అప్పుడప్పుడూ బయటికి వస్తుంటాయి. నిజానికి అలీనా తన 18వ ఏటే తొలిసారి పుతిన్‌తో కలిసి ఫొటోలకు పోజిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్