Vani Jayaram: మూగబోయిన మధుర‘వాణి’!

అలాంటి తేనెలొలుకు గాత్రం నేడు మూగబోయింది.. పాటనే తన ప్రాణంగా భావించిన ఆమె.. అదే పాటను ఒంటరిని చేసి వెళ్లారు. సినీ సంగీత ప్రియుల్ని శోకసంద్రంలో ముంచెత్తారు. పది రోజుల పసిపాప భవిష్యత్తులో సంగీత ప్రపంచాన్నే ఏలుతుందన్న జోస్యాన్ని నిజం చేస్తూ.. నాలుగు దశాబ్దాల పాటు తన....

Published : 04 Feb 2023 20:59 IST

(Photos: Twitter)

ఆమె పాట కంచిపట్టు చీర.. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు!

ఆమె గొంతు సుస్వరాల అక్షయ పాత్ర.. ఎలాంటి పాట నైనా వినసొంపుగా పలికించగలదు..

కొత్తగా వచ్చే హీరోయిన్‌కు కొత్త గొంతు కావాలంటే చాలు.. సంగీత దర్శకుల కళ్లన్నీ వెతికేది ఆమెనే!

అలాంటి తేనెలొలుకు గాత్రం నేడు మూగబోయింది.. పాటనే తన ప్రాణంగా భావించిన ఆమె.. అదే పాటను ఒంటరిని చేసి వెళ్లారు. సినీ సంగీత ప్రియుల్ని శోకసంద్రంలో ముంచెత్తారు. పది రోజుల పసిపాప భవిష్యత్తులో సంగీత ప్రపంచాన్నే ఏలుతుందన్న జోస్యాన్ని నిజం చేస్తూ.. నాలుగు దశాబ్దాల పాటు తన గాత్రంతో అలరించిన పద్మభూషణ్‌ వాణీ జయరాం తాజాగా కన్నుమూశారు. ఈ నేపథ్యంలో పలు సందర్భాల్లో తన జీవితంలోని కొన్ని కీలక మలుపుల గురించి ఆమె పంచుకున్న విశేషాలు మీకోసం..!

జోస్యం ఫలించింది!

నేను పుట్టిపెరిగింది సంగీత కుటుంబంలో..! అమ్మ ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే కర్ణాటక సంగీతంలో ఆరితేరా. మా అమ్మానాన్నలకు నేను ఐదో అమ్మాయిని. నేను పది రోజుల పాపాయిగా ఉన్న సమయంలో నాన్న నా జాతకం చూపించడానికి వెల్లూరులోని ఓ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లారు. భవిష్యత్తులో నేను గొప్ప గాయనిని అవుతానని ఆయన జోస్యం చెప్పారట. ‘కలైవాణి’ అని పేరు పెట్టమనీ సలహా ఇచ్చారట. ఇక ఈ విషయాలన్నీ అమ్మతో చెప్పగానే తను ఆశ్చర్యపోయిందట. రోజుల పసిపాప గురించి ఇంత గొప్పగా చెప్పడమేంటని నవ్వేసిందట. కానీ ఏళ్లు గడిచే కొద్దీ ఆ జోస్యమే ఫలించింది. ఐదేళ్ల వయసులోనే సంగీత శిక్షణలో చేరిన నేను.. పదేళ్ల వయసులోనే రేడియోలో పాటలు పాడడం, నాటకాలు వేసే స్థాయికి ఎదిగాను. ఇక పెద్దయ్యే క్రమంలో గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల వద్ద కర్ణాటక, హిందుస్థానీ సంగీత పాఠాలు నేర్చుకున్నా. శాస్త్రీయ సంగీతంలో ఓనమాలు దిద్దినా.. నాకు సినిమా సంగీతంలోకి రావాలన్న కాంక్షే చిన్నతనం నుంచి ఉండేది. అది మా వారు జయరాం ద్వారా నెరవేరింది.

బ్యాంకు ఉద్యోగం వదులుకున్నా!

సంగీత శిక్షణ కోసం మావారితో కలిసి హైదరాబాద్‌ నుంచి ముంబయి వెళ్లాను. అక్కడే ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకుంటూ ఉస్తాద్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ ఖాన్‌ దగ్గర శిక్షణలో చేరాను. ఉదయం 10 గంటలకు మొదలయ్యే శిక్షణ.. సాయంత్రం 6 దాకా కొనసాగేది. ఒక్కో రోజు 18 గంటలు సంగీత సాధనలోనే గడిపేసేదాన్ని. ఈ బిజీ షెడ్యూల్‌ వల్ల నేను అప్పటివరకు చేస్తున్న బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదులుకున్నా. ఆపై నేను చేసిన సంగీత కచేరీలు నాకు బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో అనేక అవకాశాలు తెచ్చిపెట్టాయి. అక్కడ నా పాటలకు బోలెడన్ని అవార్డులూ దక్కాయి. ఈ గుర్తింపే నేను దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు దారులు తెరిచింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, ఒరియా.. వంటి భాషల్లో సుమారు 11 ఏళ్ల పాటు బిజీబిజీగా గడిపా.

పాటే ప్రాణం.. ఎలా మర్చిపోగలను?!

14 భారతీయ భాషల్లో, సుమారు 10వేలకు పైగా పాటలు పాడా.. అయినా అవన్నీ గుర్తుపెట్టుకోగలగడం ఆ భగవంతుడి వరం. చాలామంది నన్ను అడుగుతుంటారు.. ‘ఏ పాట అడిగినా సరే.. వెంటనే పాడేస్తారు.. మీరు అలా ఎలా గుర్తుపెట్టుకోగలుగుతారు?’ అని! పాటనే ప్రేమించా, పాటనే ఆరాధించా.. పాటే నా ప్రాణం.. అలాంటిది దాన్నెలా మర్చిపోగలను?! నేను చాలా స్టేజ్‌ షోలలో పాటలు పాడాను.. కెరీర్‌లో బిజీగా, అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడూ అనేక స్టేజ్‌ షోల్లో పాల్గొన్నా. ఇలాంటి వేదికలపై పదే పదే పాటలు పాడడం వల్లేనేమో.. నా పాటలన్నీ అలా గుర్తుండిపోయాయి. ఇక బాలీవుడ్‌లో, దక్షిణాదిన కొత్తగా వచ్చిన హీరోయిన్‌కు కొత్త వాయిస్‌ కావాలన్నా, ఏదైనా కఠినమైన పాట పాడాలన్నా.. సినీ, సంగీత దర్శకులు మరో ఆలోచన లేకుండా నన్ను ఎంచుకునే వారు. నిజానికి ఇవన్నీ సవాళ్లే అయినా ఇష్టంతో ఆకళింపు చేసుకొని మరీ వాటిని అధిగమించా.

అదే నా సీక్రెట్!

నాకు ఇంతటి మధురమైన గాత్రం ఆ దేవుడిచ్చిన వరం.. దాన్ని కాపాడుకోవడం నా కర్తవ్యం. ఈ క్రమంలో కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటించేదాన్ని. ఆహారం విషయంలో ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించేదాన్ని. ఇంటి పట్టునే వండుకొని తినేదాన్ని.. బయటి ఆహారం తినడం, బయటికెళ్లి భోజనం చేయడం.. నాకు నచ్చకపోయేది. వంట చేస్తూ కూడా పాటలు పాడడం, సంగీత సాధన చేయడం నాకిష్టం. అయితే నా చుట్టూ ఉండే చాలామంది.. ‘మీ జీవితం మీకు బోర్‌ కొట్టట్లేదా?’ అనేవారు. కానీ నా గొంతును కష్టపెట్టుకోనంత వరకు ఏం చేసినా నాకిష్టమే! ఇక పాటలు పాడడం కాకుండా.. ఖాళీ సమయాల్లో పాటలు/గేయాలు రాయడం, పాటలకు సంగీతం సమకూర్చడం, బొమ్మలేయడం.. వంటి వాటి పైనా ఎక్కువగా దృష్టి పెట్టేదాన్ని. అలాగే ప్రతి విషయాన్నీ సానుకూల దృక్పథంతో చూడడం నాకు అలవాటు. ప్రతి ఒక్కరి లోనూ ఓ కళ దాగుంటుంది.. దానికి జీవం పోసినప్పుడే మన అస్తిత్వమేంటో ప్రపంచానికి తెలుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్