ఇకిగాయ్, హర హచి బు.. వాళ్ల దీర్ఘాయుష్షు వెనుక రహస్యాలెన్నో!

పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే మనకు తెలిసినవి ఇలాంటివే! కానీ వీటితో పాటు మనసునూ చదవాలంటున్నారు....

Updated : 27 Jun 2023 20:18 IST

పోషకాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే మనకు తెలిసినవి ఇలాంటివే! కానీ వీటితో పాటు మనసునూ చదవాలంటున్నారు జపనీయులు. శారీరక ఆరోగ్యానికి సరిసమానమైన ప్రాధాన్యాన్ని మానసిక ఆరోగ్యానికీ ఇస్తుంటారు వారు. అదే వారి దీర్ఘాయుష్షుకు కారణమంటున్నారు నిపుణులు. జపనీయుల సగటు జీవిత కాలం ఏటికేడు పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలూ స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇక్కడి బామ్మలు, తాతయ్యలు సెంచరీలు కొట్టేస్తూ తరచూ వార్తల్లో నిలవడం చూస్తుంటాం. మరి, ఇంతకీ వయసు పైబడుతున్నా.. జపనీయులు ఇంత ఆరోగ్యంగా, చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు? మనమూ తెలుసుకుందాం రండి..

ప్రకృతితో మమేకమవుతూ..!

పచ్చటి ప్రకృతి మధ్య కనీసం 20 నిమిషాలు గడిపినా చాలు.. ఒత్తిళ్లన్నీ దూరమై మానసిక ప్రశాంతత చేకూరుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే జపనీయులు కూడా తమ మానసిక ఆరోగ్యానికి ఇదే సూత్రం ఫాలో అవుతున్నారట! సమస్య వచ్చాక ఇబ్బంది పడడం కంటే.. రాకుండా చూసుకోవడానికే మొగ్గు చూపే వీరు.. ఒత్తిడి, ఆందోళనలు, యాంగ్జైటీ.. వంటి వాటి బారిన పడకుండా ‘ఫారెస్ట్‌ బాతింగ్‌’ ప్రక్రియను పాటిస్తుంటారని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రోజూ ఉదయాన్నే కాసేపు పార్కుల్లో, తమ ఇళ్లకు దగ్గర్లో ఉండే పచ్చటి ప్రదేశాల్లో సమయం గడపడం.. ప్రకృతి ఒడిలో వ్యాయామం చేయడం.. ఇలా రోజును ప్రారంభించే ముందు పచ్చదనానికే తొలి ప్రాధాన్యమిస్తుంటారట! ఫలితంగా శరీరంలో ఒత్తిడి హార్మోన్లు అదుపులో ఉండి.. మనసు ఉత్తేజితమవుతుంది. ఇది పరోక్షంగా రోగనిరోధక శక్తినీ పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇకిగాయ్‌తో.. ఆత్మసంతృప్తి!

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా.. మన గురించి మనం పట్టించుకునే సమయమే మనలో చాలామందికి దొరకదు. ఎంతసేపూ ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు, వృత్తి ఉద్యోగాలతోనే సమయం సరిపోతుంది. ఒకానొక సమయంలో ఇది మనలో తీవ్రమైన అసహనానికి దారితీస్తుంది. అయితే తాము మాత్రం పరిస్థితిని ఇక్కడి దాకా తెచ్చుకోమంటున్నారు జపనీయులు.

ఈ క్రమంలో- తమ తపన, నైపుణ్యాలు, అభిరుచులు, ఆసక్తులు, వృత్తి ఉద్యోగాలు, ఆదాయ వనరులు.. మొదలైన వాటిని అనుసంధానించి, వాటి మధ్య సమతౌల్యం సాధిస్తూ, తద్వారా ఇటు మానసిక ప్రశాంతతను, సంతోషాన్నీ పొందడమే కాకుండా; ఇటు జీవిత పరమార్ధాన్ని సాధించడానికీ కృషి చేస్తారు. ఈ సమతుల్యతే సంతృప్తికి, జీవన నాణ్యతకు కారణమని; ఫలితంగానే వారి ఆయుష్షు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతినే ‘ఇకిగాయ్’గా పిలుస్తుంటారు జపనీయులు.

ఈ క్రమంలో- వ్యక్తిగతంగా అత్యంత సంతోషం కలిగించే పనిని ఎంచుకుని, వివిధ అంశాల మధ్య సమతుల్యత సాధిస్తూ, జీవితానికి ఒక సార్ధకత ఏర్పరచుకోవాలన్నదే 'ఇకిగాయ్' సారాంశం.

కడుపు నిండా తినరు!

ఓ ముద్ద ఎక్కువైనా పర్లేదు కానీ కడుపు మాడ్చుకోకూడదనేది కొంతమంది సిద్ధాంతం. అయితే జపనీయులు మాత్రం ఇందుకు భిన్నం. కడుపునిండా ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం, ఊబకాయం.. వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్న నిపుణుల సలహాలు కచ్చితంగా పాటిస్తుంటారు వారు. అందుకే అతిగా ఆహారం తీసుకునే అలవాటుకు కళ్లెం వేయడానికి ‘హర హచి బు’ అనే సిద్ధాంతాన్ని పాటిస్తుంటారు. అంటే పూర్తిగా కడుపు నిండా తినేయడం కాకుండా 80 శాతం మాత్రమే ఆహారం తీసుకుని, 20 శాతం కడుపును ఖాళీగా ఉంచుకోవడన్న మాట. ఇలా నిర్ణీత మోతాదులో ఆహారం తీసుకునే అలవాటును చిన్నతనం నుంచే తమ పిల్లలకు నేర్పిస్తారు జపాన్‌ తల్లులు. ఫలితంగా జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేయడంతో పాటు పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది ఇతర జీవక్రియల పైనా సానుకూల ప్రభావం చూపడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

నాచు-చేపలు

మధుమేహం, స్థూలకాయం, గుండె జబ్బులు.. ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలే మన ఆరోగ్యాన్ని క్రమంగా క్షీణింపజేస్తుంటాయి. అయితే ప్రపంచ దేశాలతో పోల్చితే.. జపాన్‌లో ఇలాంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో మరణించే వారు చాలా తక్కువమంది అని చెబుతున్నారు నిపుణులు. ఇందుకు కారణం వారు పాటించే ఆహార నియమాలేనని ఓ అధ్యయనం కూడా రుజువు చేసింది. ఇక ఇక్కడి వారు తమ రోజువారీ ఆహారంలో ఏది ఉన్నా లేకపోయినా సీవీడ్‌ (సముద్రపు నాచు)ను తప్పకుండా చేర్చుకుంటారట! ఇందులోని అత్యవసర ఖనిజాలు థైరాయిడ్‌ హార్మోన్‌ పనితీరును మెరుగుపరిచి.. పలు దీర్ఘకాలిక సమస్యలు రాకుండా నివారిస్తాయి. అలాగే ఇందులో క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం.. వంటి ఖనిజాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే జపాన్‌ మహిళలు ఈ సీవీడ్‌తో ప్రత్యేకంగా సూప్స్‌, సలాడ్స్‌.. వంటివి తయారుచేస్తుంటారట! ఇక పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా దీంతో తయారుచేసిన కరకరలాడే నోరీ షీట్స్‌ని అందిస్తారట! ఇదొక్కటే కాదు.. చేపలు, మొక్కల ఆధారిత ఆహార పదార్థాలు, అన్నం, గ్రీన్‌ టీ, మట్చా టీ.. ఇవన్నీ వారి ఆహారంలో ముఖ్యమైనవే.

నలుగురితో కలిసిపోయి..!

మనలో చాలామందికి కనీసం ఇంట్లో వాళ్లతో గడిపే సమయమే ఉండదు.. ఇక బయట నలుగురితో కలవాలన్న ఆసక్తి, ఉత్సాహం అసలే ఉండవు. ఈ ఒంటరితనం ఇటు మన మనసును/ఆరోగ్యాన్నే కాదు.. అటు సామాజిక సంబంధాల్నీ దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. అందుకే జపాన్‌ వాసులు ఈ సిద్ధాంతానికి పూర్తి విరుద్ధం అని చెబుతున్నారు. వారు తమ వ్యక్తిగత, కెరీర్‌ విషయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. తమ కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించేందుకూ ప్రాధాన్యమిస్తారట. మరోవైపు పలు సామాజిక కార్యక్రమాల్లో భాగమవడం, ప్రత్యేక సందర్భాల్ని బృందాలుగా ఏర్పడి జరుపుకోవడం.. వంటివి చేస్తారట! తద్వారా అనుబంధాలు బలపడడంతో పాటు.. మనసులోని ఒత్తిళ్లూ దూరమై ప్రశాంతత చేకూరుతుందని, ఇదే వారిని ఎక్కువ కాలం పాటు జీవించేలా చేస్తుందని అక్కడి నిపుణులు చెబుతున్నారు.

వీటితో పాటు.. రోజూ 5-7 వేల అడుగుల దూరం నడవడం, చిన్న చిన్న అనారోగ్యాలకు ఇంటి వైద్యం పాటించడం.. వంటివీ జపనీయుల దీర్ఘాయుష్షుకు కారణమని చెబుతున్నారు అక్కడి నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్