Kajal Aggarwal: ‘మా ఆయన మేలిమి బంగారం!’

తాను వేసే ప్రతి అడుగులో భర్త తోడు కోరుకుంటుంది భార్య. అనుక్షణం తన వెన్నంటే నిలవాలని ఆరాటపడుతుంది. ఇక గర్భం ధరించిన సమయంలో అతడి ఆలనను కోరుకుంటుంది.. తనను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని ఆశపడుతుంది. అయితే ఈ విషయంలో తాను అందరికంటే అదృష్టవంతురాలినంటోంది అందాల......

Updated : 14 Apr 2022 15:01 IST

(Photos: Instagram)

తాను వేసే ప్రతి అడుగులో భర్త తోడు కోరుకుంటుంది భార్య. అనుక్షణం తన వెన్నంటే నిలవాలని ఆరాటపడుతుంది. ఇక గర్భం ధరించిన సమయంలో అతడి ఆలనను కోరుకుంటుంది.. తనను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని ఆశపడుతుంది. అయితే ఈ విషయంలో తాను అందరికంటే అదృష్టవంతురాలినంటోంది అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌. గౌతమ్‌ రూపంలో ఆ భగవంతుడు తనకు బంగారం లాంటి భర్తనిచ్చాడని మురిసిపోతోంది. ప్రస్తుతం నిండు గర్భిణి అయిన ఈ ముద్దుగుమ్మ.. గత ఎనిమిది నెలలుగా తన భర్త తనను కంటికి రెప్పలా చూసుకున్న తీరును వివరిస్తూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది. మంచి భర్తలానే కాదు.. రాబోయే పాపాయికి మంచి తండ్రిలా ఇప్పటికే తను నూటికి నూరు మార్కులు కొట్టేశాడంటూ తన హబ్బీని ప్రశంసల్లో ముంచెత్తింది కాజల్‌. మొత్తానికి ‘మా ఆయన మేలిమి బంగారం!’ అంటూ ఈ చక్కనమ్మ పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

తమ ఎనిమిదేళ్ల ప్రేమాయణాన్ని 2020లో పెళ్లి పట్టాలెక్కించారు కాజల్‌ అగర్వాల్‌ - గౌతమ్‌ కిచ్లూ జంట. అప్పట్నుంచి ప్రతి సందర్భంలోనూ తమ మాటలు, చేతలతో నేటి జంటలకు రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పుతోన్న ఈ లవ్లీ కపుల్‌.. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ క్రమంలోనే కాబోయే తల్లిగా తన అనుభవాలను సోషల్‌ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంది కాజల్‌. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో పోస్ట్‌ పెట్టిందీ టాలీవుడ్‌ అందం.

నువ్వో గొప్ప భర్తవి, తండ్రివి!

తాను గర్భం ధరించినప్పట్నుంచి తన భర్త తనను, తన కడుపులో పెరుగుతోన్న బిడ్డను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో వివరిస్తూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది కాజల్‌. ఇందుకు ప్రతిగానే అతడికి కృతజ్ఞతలు చెబుతూ.. తన మనసులోని మాటల్ని ఇలా అక్షరీకరించింది.

‘డియర్‌ హబ్బీ..

ప్రతి అమ్మాయి తనకు మంచి భర్త రావాలని, పుట్టబోయే పిల్లల విషయంలో గొప్ప తండ్రి కావాలని ఆరాటపడుతుంది. నీ రూపంలో ఈ రెండూ నాకు దక్కినందుకు థ్యాంక్యూ!

నీ నిస్వార్థమైన మనస్తత్వం ఎప్పటికప్పుడు నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంది..

నేను వేవిళ్లతో బాధపడుతున్న సమయంలో నాతో పాటే నిద్ర లేచావు..

నాకెంతో సౌకర్యంగా అనిపించే నీ ఒళ్లో నన్ను నిద్ర పుచ్చావు..

ఒంట్లో కాస్త నలతగా ఉందని చెప్తే వెంటనే డాక్టర్ సలహా తీసుకున్నావు..

కోరినప్పుడల్లా నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్లావ్..

ఫాల్స్‌ పెయిన్స్‌ వస్తున్నాయని తెలిసి.. ఉపశమనం కోసం సేవలు చేశావ్..

ప్రతి క్షణం నేను సౌకర్యంగా, సంతోషంగా ఫీలయ్యేలా చేశావ్..

ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నావ్‌.. నా శరీరం డీహైడ్రేట్‌ కాకుండా జాగ్రత్తపడ్డావ్..

వీటన్నింటికంటే నాపై అమితమైన ప్రేమను చూపించావు..

ఇలా గత ఎనిమిది నెలలుగా నీలో ఓ గొప్ప భర్తను, తండ్రిని చూశాను. ఇలాగే ప్రతి విషయంలో మన బిడ్డకు నువ్వు ప్రేరణ కావాలని కోరుకుంటున్నా.

ఎన్ని మార్పులొచ్చినా.. నీపై ప్రేమ తరగదు!

పాపాయి పుట్టాక మన జీవితాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇప్పటిలాగా ఏకాంతంగా గడిపే సమయం మనకి దొరక్కపోవచ్చు.. వారాంతాల్లో సినిమాలకు వెళ్లడం కుదరకపోవచ్చు.. నిద్రను త్యాగం చేసి లేట్‌నైట్‌ షోస్‌ చూడలేకపోవచ్చు.. అకస్మాత్తుగా వెళ్లే పార్టీలు/డేట్‌నైట్స్‌.. వంటి సరదాలను మిస్సవ్వాల్సి రావచ్చు.. అయినా వీటన్నింటి కన్నా మన బుజ్జాయి రాక నన్ను చెప్పలేనంత ఆనందంలో ముంచెత్తుతుంది. అలాగే ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి రావచ్చు.. కొన్నిసార్లు పలు అనారోగ్యాలు తలెత్తచ్చు.. సమయం మనది కాదన్న భావనా కలగచ్చు.. అయినా పాపాయితో మనం గడిపే ప్రతి క్షణం మన జీవితాల్లో అత్యుత్తమంగా, మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అయితే ఇన్ని మార్పులు చోటుచేసుకున్నా.. నీపై నాకున్న ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. నీలాంటి గొప్ప భర్తకు భార్యనైనందుకు గర్వపడుతున్నా. నేనెంతో అదృష్టవంతురాలిని! లవ్యూ డియర్‌!’ అంటూ భర్తను ఆకాశానికెత్తేసిందీ చక్కనమ్మ.

అదో అందమైన ప్రయాణం!

ఇప్పుడనే కాదు.. గర్భం ధరించినప్పట్నుంచి తన ప్రతి అనుభవాన్నీ అభిమానులతో పంచుకుంటోన్న కాజల్‌.. ఇటీవలే తన మెటర్నిటీ షూట్‌ ఫొటోల్ని కూడా షేర్‌ చేసుకుంది. అమ్మతనం కోసం సన్నద్ధమయ్యే క్రమంలో ప్రతి మహిళా ఓ వండర్‌ వుమనే అంటోందీ కాబోయే అమ్మ. ‘అమ్మతనం కోసం సన్నద్ధమవడం ఓ అందమైన ప్రయాణం. ఈ క్రమంలో ఒక క్షణం మనకు అనుకూలంగా ఉండచ్చు.. మరుక్షణం నిస్సారంగా అనిపించచ్చు. ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగడం కాబోయే అమ్మలకు మాత్రమే తెలిసిన విద్య. రాబోయే చిన్నారి కోసం చూసే ఎదురుచూపులు, కుటుంబ సభ్యుల ప్రేమే ఈ ప్రయాణంలో మన భావోద్వేగాల్ని అదుపు చేస్తుంది..’ అంటోందీ టాలీవుడ్‌ బ్యూటీ.

అమ్మయ్యే క్రమంలో ఇలా తన అనుభవాలతో పాటు అప్పుడప్పుడూ తాను ఎదుర్కొన్న బాడీ షేమింగ్‌ గురించి స్పందిస్తూ కాజల్‌ పెట్టిన పోస్టులు ఈతరం మహిళల్లో స్ఫూర్తి నింపుతాయని చెప్పడంలో సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్