అక్కలాగే నాపైనా ఆమ్లదాడి చేస్తారేమోనని భయపడేదాన్ని!

కొన్ని జ్ఞాపకాలు మనకు సంతోషాన్ని పంచితే.. మరికొన్ని జ్ఞాపకాలు సందర్భానుసారం మనకు గుర్తొస్తూ మనసును మెలిపెడుతుంటాయి. తన అక్కపై జరిగిన ఆమ్లదాడికి సంబంధించిన చేదు జ్ఞాపకాలు కూడా ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయంటోంది బాలీవుడ్‌ అందాల తార కంగనా రనౌత్‌. తాజాగా దిల్లీలో ఓ యువతిపై జరిగిన యాసిడ్‌ దాడికి చలించిపోయిన....

Updated : 15 Dec 2022 18:23 IST

(Photos: Instagram)

కొన్ని జ్ఞాపకాలు మనకు సంతోషాన్ని పంచితే.. మరికొన్ని జ్ఞాపకాలు సందర్భానుసారం మనకు గుర్తొస్తూ మనసును మెలిపెడుతుంటాయి. తన అక్కపై జరిగిన ఆమ్లదాడికి సంబంధించిన చేదు జ్ఞాపకాలు కూడా ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయంటోంది బాలీవుడ్‌ అందాల తార కంగనా రనౌత్‌. తాజాగా దిల్లీలో ఓ యువతిపై జరిగిన యాసిడ్‌ దాడికి చలించిపోయిన ఆమె.. ఈ సందర్భంగా తన అక్కపై జరిగిన దాడిని, ఆ సమయంలో తానెదుర్కొన్న మానసిక వేదనను ఓసారి నెమరువేసుకుంది. ఈ నేపథ్యంలో అప్పటి సంఘటనల్ని అక్షరీకరిస్తూ ఇన్‌స్టా స్టోరీలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది కంగన. ప్రస్తుతం అది వైరలవుతోంది.

తాజా ఉదంతమిదీ!

‘నాకు దక్కనిది మరెవరికీ దక్కనివ్వను..’ అన్నంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు కొందరు యువకులు. ఈ క్రమంలో తన ప్రియురాలిపై ఆమ్లదాడి చేయడం, ప్రాణాలు తీయడం, వివిధ రకాలుగా హింసించడానికీ వెనకాడట్లేదు. తాజాగా దిల్లీలో జరిగిన ఆమ్లదాడి ఉదంతం కూడా ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 12వ తరగతి చదివే ఓ అమ్మాయి కాలేజీకి వెళ్లడానికి ద్వారకలోని తన ఇంటి నుంచి బయల్దేరింది. రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తున్న ఆమెపై.. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌, మరో స్నేహితుడితో కలిసి బైక్‌పై వచ్చి ఆమ్లదాడి చేశాడు. దీంతో ఆమె ముఖం, మెడపై గాయాలయ్యాయి. అయితే ఈ ఘటన గురించి తెలుసుకొని చలించిపోయిన కంగన.. గతంలో తన అక్కపైనా ఇదే తరహాలో ఆమ్ల దాడి జరిగిందని నాటి చేదు జ్ఞాపకాల్ని ఇన్‌స్టా స్టోరీ రూపంలో గుర్తుచేసుకుంది.

మూడేళ్లలో 52 సర్జరీలయ్యాయి!

‘అప్పుడు నేను టీనేజర్‌ని. మా అక్క రంగోలీకి 21 ఏళ్లుంటాయి. ఆ సమయంలో ఓ ఆకతాయి ఆమెపై ఆమ్లదాడి చేశాడు. దీంతో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. సగం ముఖం కాలిపోయింది.. ఓ కన్ను చూపు కోల్పోయింది.. చెవి పూర్తిగా కరిగిపోయింది.. ఛాతీ చాలా వరకు డ్యామేజ్‌ అయింది. రెండు మూడేళ్లలోనే దాదాపు 52 సర్జరీలయ్యాయంటే తనపై జరిగిన దాడి తీవ్రతను మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ప్రమాదంతో తను శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఎంతో కుంగిపోయింది. మాతో మాట్లాడడమే మానేసింది.. తన ముందు ఏం జరిగినా అలా చూస్తూ ఉండిపోయేది తప్ప.. మరో మాట మాట్లాడేది కాదు. అప్పటికే ఓ ఐఏఎఫ్‌ అధికారితో అక్క పెళ్లి నిశ్చయమైంది. అయితే ఆమ్లదాడి తర్వాత వాళ్లు వివాహం రద్దు చేసుకున్నా ఆమె ఇసుమంతైనా బాధపడలేదు.. ఇలా మానసికంగా చలనం లేని అక్కను చూసి తట్టుకోలేకపోయా. డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్తే ఆమె షాక్‌లో ఉందని చెప్పారు. మందులిచ్చారు.. ఎన్నో థెరపీలు చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. ఈ సమయంలో యోగానే అక్కను తిరిగి మామూలు మనిషిని చేసింది.

అందుకే ముఖం కప్పుకునేదాన్ని!

ఇక ఈ దాడితో తనొక్కర్తే కాదు.. మా కుటుంబం మొత్తం బాధతో కుదేలైంది. నేనూ అక్కలాగే మానసికంగా కుంగిపోయా. తనపై దాడి చేసినట్లుగానే నాపైనా ఎవరైనా ఆమ్లదాడి చేస్తారేమోనని అనుక్షణం భయపడేదాన్ని. నా పక్క నుంచి ఏ అపరిచిత వ్యక్తి వెళ్లినా, కారు-బైక్‌పై ఎవరైనా నన్ను దాటి ముందుకెళ్లినా వణికిపోయేదాన్ని. నా ముఖం వాళ్లకు కనపడకుండా స్కార్ఫ్‌తో కవర్‌ చేసుకునేదాన్ని. అలా అప్పటి చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. దిల్లీ ఘటన వీటిని మరోసారి గుర్తుచేసింది. ఏదేమైనా ఇలాంటి దారుణాలు ఇకనైనా ఆగాలి. వీటికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి..’ అంది కంగన.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్