ఎంత బాగా పని చేసినా ప్రమోషన్ ఇవ్వడం లేదు..!

నేనొక సంస్థలో కొన్నేళ్లుగా పని చేస్తున్నాను. మూడేళ్లుగా పదోన్నతి లేదు. నాలో నిరుత్సాహం పెరిగిపోతోంది. ఎంత కష్టపడి పనిచేసినా.. నా కష్టానికి తగిన గుర్తింపు రాలేదనిపిస్తోంది. మరో ఉద్యోగం చూసుకోవాలని అనుకుంటున్నాను. నా నిర్ణయం....

Published : 15 Nov 2022 21:18 IST

నేనొక సంస్థలో కొన్నేళ్లుగా పని చేస్తున్నాను. మూడేళ్లుగా పదోన్నతి లేదు. నాలో నిరుత్సాహం పెరిగిపోతోంది. ఎంత కష్టపడి పనిచేసినా.. నా కష్టానికి తగిన గుర్తింపు రాలేదనిపిస్తోంది. మరో ఉద్యోగం చూసుకోవాలని అనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా? - ఓ సోదరి

జ. చక్కని లక్ష్యాలు రూపొందించుకొని, దానికి అనుగుణంగా కష్టపడి పనిచేస్తే పదోన్నతి తప్పకుండా వస్తుందనుకున్నారు. రాకపోయేసరికి ఏం చేయాలో తెలియని సందిగ్ధావస్థ మీది. ఇప్పుడు ఎన్ని విధాలుగా ఆలోచించినా.. మీ దగ్గర ప్రశ్నలే తప్ప సమాధానాలు లేవు. కాబట్టి తొందరపాటులో ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా, ఏం చేయాలనే అవగాహన మీకుండటం ఈ సమయంలో చాలా అవసరం.

ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు చాలామంది హడావిడిగా బాస్ దగ్గరకు వెళ్లి ప్రమోషన్ పొందేందుకు తామెంత అర్హులో చెబుతారు. దాని వల్ల మీపై ఉన్న మంచి అభిప్రాయం పోతుంది. మీ కోపాన్ని, అసంతృప్తిని వెంటనే చెప్పడం కూడా మంచి పద్ధతి కాదు. కొంత కాలం మౌనం వహించడం మంచిది. అలాగే ఉద్యోగానికి రాజీనామా చేసి మరో కంపెనీలో చేరాలనుకోవడం కూడా మంచి నిర్ణయం అనిపించుకోదు. తొందరపడకుండా మీ ఆలోచనను కొంతకాలం పాటు వాయిదా వేయండి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేక మీ అసంతృప్తిని సహోద్యోగుల వద్ద వ్యక్తం చేయడం వంటివి చేయొద్దు.

ఈ విషయాన్ని కాస్త లోతుగా ఆలోచించండి. సంస్థ నిర్ణయాల్లో భాగంగా ప్రమోషన్లు ఇవ్వడాన్ని వాయిదా వేసి ఉండొచ్చు. ఇప్పటికే మీ పనిని మీ ఉన్నతాధికారులు గమనించినప్పటికీ మీక్కూడా అందరితో పాటు ప్రమోషన్ ఇవ్వాలని అనుకొని ఉండవచ్చు. ఇవే కాదు, మీ చుట్టూ ఉన్న సహోద్యోగుల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మీలాగే పనిలో ప్రతిభ చూపించినప్పటికీ గుర్తింపు లభించని వాళ్లు ఉండే ఉంటారు. ఒకేసారి ఎక్కువ మందిని వెన్నుతట్టి ప్రోత్సహించడం ఏ సంస్థకూ అన్నివేళలా సాధ్యం కాదు. కొందరి పనికి వెంటనే గుర్తింపు లభిస్తే, మరికొందరికి కాస్త ఆలస్యం అవుతుంది. తర్వాత ఇద్దాం అనుకొని చర్చించిన జాబితాలో మీ పేరు ఉందేమోనని ఎందుకు అనుకోకూడదు!

పదోన్నతి రాకపోవడానికి గల కారణాలనూ విశ్లేషించుకోండి. మీరెంత కష్టపడి పనిచేస్తారనే విషయాన్ని, ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేసిన తీరును బాస్‌కు చెప్పడంలో మీరు విఫలమయ్యారా? ఇంకెక్కడైనా వెనుకబడినట్టు మీకనిపిస్తోందా? ఈ విషయాలపై మీ పై అధికారితో మాట్లాడి వారి సలహా తీసుకోండి. మీలో ఉన్న చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటే నిజాయతీగా ఆ ప్రయత్నాన్ని చేయండి.

ఈ ఆలోచనలన్నింటిపై స్పష్టమైన అవగాహనకు వచ్చాక అప్పుడు ఓ నిర్ణయానికి రండి. ఏ రకంగా చూసినా మీ ప్రయత్నంలో లోపం లేదు. కంపెనీ మీ సేవల్ని గుర్తించలేదు, పదోన్నతి రాకపోవడమనే సమస్య భవిష్యత్తులోనూ ఎదురవుతుందని అనిపిస్తే వేరే ఉద్యోగం చూసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్