Relationship: నా చెల్లెలు.. మావారితో వెళ్లిపోయింది

అమ్మానాన్నలు కుదిర్చిన సంబంధం చేసుకున్నాను. నేను చూపులకు ఏమంత బాగోను. మా చెల్లెలు చాలా అందంగా ఉంటుంది.

Updated : 22 May 2023 15:44 IST

అమ్మానాన్నలు కుదిర్చిన సంబంధం చేసుకున్నాను. నేను చూపులకు ఏమంత బాగోను. మా చెల్లెలు చాలా అందంగా ఉంటుంది. మావారూ, మా చెల్లెలూ ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. అమ్మానాన్నలు బాధతో మంచం పట్టారు. ఇలా ఎక్కడా జరగదేమో! నాకు విరక్తిగా ఉంది.  

 - ఓ సోదరి 

మీ చదువు, ఉద్యోగం, పెళ్లై ఎన్నాళ్లయ్యింది లాంటి వివరాలు లేవు. అయినప్పటికీ ఒక వ్యక్తి పెద్దల సమ్మతంతో పెళ్లి చేసుకుని, మీ చెల్లెలితోనే వెళ్లిపోవడం అన్నది బాధాకరం. ఇది నైతికంగా దిగజారడం. ఇష్టం లేదంటే చేసుకోకుండానే ఉండాలి. సోదరి కూడా మీకు ద్రోహం చేసింది. ఏదేమైనా అయిపోయిన దాని గురించి బాధపడేకంటే నిలకడ, నైతిక విలువలు లేని వ్యక్తి ఎప్పుడైనా ఇలా చేసే అవకాశం ఉందని అర్థం చేసుకోండి. మానసికంగా సమాజపరంగా ఇలాంటి విషయాలు బాధించే మాట నిజమే. మీలో న్యూనత పెరిగే, ఇతరుల వ్యాఖ్యానాలు మిమ్మల్ని గాయపరిచే అవకాశం ఉంది. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే కాలం ఎప్పుడూ అలా ఆగిపోదు. ఇందులో నిజాన్ని గ్రహించిన వాళ్లు మిమ్మల్ని చెడుగా అనుకోరు, చులకన చేయరు. ఒక ప్రమాదం జరిగింది, అందులోంచి బయటపడ్డానని మీకు మీరు నచ్చజెప్పుకోండి, అందుకోసం ప్రయత్నించండి.

అతను మీ సోదరితో లేదా మరెవరితోనో రహస్యంగా సంబంధం పెట్టుకుని మీతో కూడా ఉంటే మీకు రోజురోజూ మానసిక వేదన కలిగేది. ఇప్పుడతడి అసలు స్వరూపం తెలిసింది కనుక.. ఏదో పోగొట్టుకున్నానని బాధపడటం కంటే అలాంటి వ్యక్తితో కాపురం చేయడం తప్పిపోయినందుకు సంతోషించండి. తప్పు చేసింది మీరు కాదు, అపరాధ భావన వాళ్లకి ఉండాలే కానీ మీకు కాదు. దిగులు పడుతుంటే ముందుకు పోలేం, అక్కడే ఆగిపోతామని అమ్మానాన్నలకు కూడా చెప్పండి. మీరు ధైర్యంగా ఉంటూ వాళ్లనీ దృఢంగా ఉంచండి. ఉద్యోగం చేస్తున్నట్టయితే అందులో అభివృద్ధి సాధించేందుకు కృషి చేయండి. ఒకవేళ తగిన చదువు లేదంటే అందుకోసం ప్రయత్నించండి. ఎన్‌జీవో ఆరంభించండి. లేదంటే సమాజ సేవ చేయండి. అలా మీరు ఏదో ఒక వ్యాపకంతో బిజీగా ఉంటే మీ దృష్టి మళ్లుతుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకుంటే అందులో పైకి వచ్చి సంతోషంగా ఉంటారు. మీరు నిలదొక్కుకుని, అమ్మానాన్నల్నీ ఆనందంగా ఉంచగలిగితే జీవితానికి అర్థం తెలుస్తుంది. ఇప్పటిదాకా అమ్మానాన్నల రక్షణలో ఉన్నదాని కంటే మీ చొరవతో రాణించి, వాళ్లకి ఆసరా కల్పించినప్పుడు ఇదొక సవాలుగా అనిపించి సైర్థ్యం కలుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్