చీమలు చెప్పే ‘నాయకత్వ’ పాఠాలు!

చీమ చూడటానికే చిన్న జీవే! అయినా తెలివితేటల్లో మనుషుల ఎన్నో జీవిత ప్రశ్నలకు సమాధానాలివ్వగల మేధావి. చీమల జీవనశైలిని పరిశీలించి ఓ వ్యక్తిత్వ వికాస గ్రంథమే రాసేయచ్చేమో..!

Published : 29 Nov 2023 21:06 IST

చీమ చూడటానికే చిన్న జీవే! అయినా తెలివితేటల్లో మనుషుల ఎన్నో జీవిత ప్రశ్నలకు సమాధానాలివ్వగల మేధావి. చీమల జీవనశైలిని పరిశీలించి ఓ వ్యక్తిత్వ వికాస గ్రంథమే రాసేయచ్చేమో..! మేనేజ్‌మెంట్ గురూలకే పాఠాలు చెప్పగల చీమల పనితీరు గురించి పెద్ద పెద్ద మేనేజ్‌మెంట్ కాలేజీల్లో సైతం పాఠాలుగా చెప్పడం విశేషం. ఈ క్రమంలో- చీమలు చెప్పే లీడర్‌షిప్‌ పాఠాల గురించి మనమూ తెలుసుకుందాం రండి..

నాయకత్వ లక్షణాలు

ఒక బృందాన్ని సమర్థంగా ముందుకు నడిపించాలంటే నాయకత్వం పటిష్టంగా ఉండాలనే పాఠాన్ని మనం చీమల నుంచి నేర్చుకోవచ్చు. ‘ఐకమత్యమే మహాబలం’, ‘కలిసుంటే కలదు సుఖం’ అనే సామెతలు చీమలు కలిసికట్టుగా ఉండే పద్ధతిని చూసే కనిపెట్టారేమో అనడం అతిశయోక్తి కాదు. ఒకే మాటకి బృందమంతా కట్టుబడి ఉండడం, నియమ నిబంధనలను పాటించే విషయంలో అందరూ ఒకేలా వ్యవహరించడం లాంటివన్నీ నాయకత్వం బలంగా ఉన్నప్పుడే జరుగుతాయి.

ఒక లక్ష్యం కోసం..

చీమల ప్రధాన లక్ష్యం ఆహారాన్ని సేకరించడం. అందుకోసం ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకొని అన్నీ కలిసి శక్తివంచన లేకుండా శ్రమిస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక నిర్ణీత బాటలో నడుస్తాయి. చలికాలంలో ఆహారం కోసం వేసవి కాలం నుంచే శ్రమిస్తాయి చీమలు. ఈ పద్ధతి ఒక రకంగా ముందస్తు ప్రణాళిక లాంటిది. ఇలా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ముందుగానే సిద్ధమవ్వడం విజయానికి బాటలు వేసుకోవడమే అన్న విషయాన్ని చీమలు ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాయి.

ప్రణాళికాబద్ధంగా..

సమయపాలన పాటించడం, క్రమశిక్షణతో ముందుకు సాగడం.. వంటి విషయాల్లోనూ చీమలను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏ సమయంలో పని చేయాలో, ఏ సమయంలో పని ముగించాలో చీమలకు బాగా తెలుసు. నిరంతరాయంగా పని చేయడం, ఆ తర్వాత తగినంత విశ్రాంతి తీసుకోవడం చీమల నైజం. పని విషయంలో ఎంత ప్రణాళికాబద్ధంగా ఉండాలో కూడా చీమల్ని చూసి నేర్చుకోవచ్చు.

కలిసికట్టుగా..

చీమలు తమ పుట్టను నిర్మించుకొనే క్రమంలో కూడా అన్నీ కలిసికట్టుగానే శ్రమిస్తాయి. ఒక పుట్టను నిర్మించడం కోసం కొన్ని వందల చీమలు కలిసి పనిచేస్తాయి. అలాగే ఒక సంస్థ నిర్మాణం, అభివృద్ధి ఏ ఒక్క వ్యక్తి వల్లో సాధ్యం కాదని, అనేకమంది ఉద్యోగుల పాత్ర కూడా అందులో ఉంటుందనే విషయాన్ని చీమలు స్పష్టం చేస్తాయి.

శక్తివంచన లేకుండా..

శక్తివంచన లేకుండా పనిచేయడం అనే విషయాన్ని మనం చీమల నుంచే నేర్చుకోవాలేమో. తమ శక్తి సామర్థ్యాలేంటో చీమలకు బాగా తెలుసు. ఒక్కొక్క చీమ తన కంటే అనేక రెట్లు ఎక్కువ ఉన్న బరువును ఇట్టే మోయగలదు. చేపట్టిన బాధ్యతలను విస్మరించకుండా నూటికి నూరు శాతం పరిశ్రమించే జీవి ఏదైనా ఉందంటే అది చీమే అనడంలో సందేహం లేదు.

బృందస్ఫూర్తి..

స్నేహంగా వ్యవహరించడం చీమలకు బాగా తెలుసు. ఒకదానికొకటి సహకరించుకుంటూ అన్నీ కలిసి బృందస్ఫూర్తితో పనిచేయడం, లక్ష్యాన్ని సాధించడంలో వీటికివే సాటి.
సర్దుకుపోతాయి..

చీమలు ఒక ప్రాంతానికే పరిమితమై జీవించవు. అలాగే అన్ని వాతావరణాలకు తగ్గట్టుగా, సర్దుకుపోయి జీవించేలా తమ జీవనశైలిని అలవాటు చేసుకుంటాయి. ఈ క్రమంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొని ముందుకు సాగాలనే సందేశాన్ని చీమలు మనకు చెప్పకనే చెబుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్