Savitri Classics: జంప్‌సూట్‌ కావాలంటే.. అమ్మ పరికిణీ కొనిచ్చేది!

వెండితెరపై తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న అలనాటి నటి సావిత్రి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె స్ఫూర్తిదాయక జీవితాన్ని, నట ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ చిత్రీకరించిన ‘మహానటి’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనం చూశాం. ఇక ఇప్పుడు ఆమె సినీ ప్రస్థానానికి ‘సావిత్రి క్లాసిక్స్‌’ పేరుతో ఓ పుస్తక రూపమిచ్చారు ప్రముఖ రచయిత సంజయ్‌ కిషోర్.

Updated : 04 Apr 2024 14:34 IST

వెండితెరపై తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న అలనాటి నటి సావిత్రి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె స్ఫూర్తిదాయక జీవితాన్ని, నట ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ చిత్రీకరించిన ‘మహానటి’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనం చూశాం. ఇక ఇప్పుడు ఆమె సినీ ప్రస్థానానికి ‘సావిత్రి క్లాసిక్స్‌’ పేరుతో ఓ పుస్తక రూపమిచ్చారు ప్రముఖ రచయిత సంజయ్‌ కిషోర్. ఈ పుస్తకాన్ని తాజాగా ‘మెగాస్టార్’ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ వేడుకలో ఆయన సతీమణి సురేఖ, సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి పాల్గొన్నారు. ఇక పుస్తక ఆవిష్కరణ అనంతరం సురేఖ, చాముండేశ్వరితో సరదాగా చిట్‌ చాట్‌ చేశారు. ఈ క్రమంలో సావిత్రమ్మతో ఆమెకున్న అనుబంధం, మహానటి జీవితంలోని కొన్ని కీలక మలుపుల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేశారు. మరి, ఆ విశేషాలేంటో మీరే చదివేయండి!

సురేఖ: అమ్మ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే పలు చిత్రాలు, పుస్తకాలు వచ్చాయి. ‘సావిత్రి క్లాసిక్స్‌’ తీసుకురావాలని ఎందుకు అనిపించింది?

చాముండేశ్వరి: అమ్మ జీవితంపై తెరకెక్కించిన ‘మహానటి’ గొప్ప విజయాన్ని అందుకుంది. ఈ రోజు చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల దాకా అమ్మ గురించి అంత ప్రేమగా మాట్లాడుతున్నారంటే అందుకు ఈ చిత్రమే కారణం. అమ్మ బాల్యం, సినిమా కెరీర్‌, సేవలు, మరణం.. ఇలా అన్నీ ఇందులో చూపించారు. కానీ అమ్మ ‘ఫిల్మోగ్రఫీ’పై ఒక పుస్తకం ఉండాలని భావించా. అలా వచ్చిందే ఈ ‘సావిత్రి క్లాసిక్స్‌’. ఇందులో కేవలం ఆమె నటనకు సంబంధించిన విషయాలు, ఆమె నటించిన పాత్రల ప్రాముఖ్యం, ఆమె ఎందుకు మహానటి అయింది?.. వంటివన్నీ పొందుపరిచారు. ఈ రోజుల్లో పుస్తకాన్ని పుస్తకంలా కాకుండా.. ఓ మంచి ఫొటో, దాని పక్కన రైటప్‌ ఉంటే చదవడానికి ఇష్టపడుతున్నారు. ఈ పుస్తకాన్ని అలాగే తీసుకొచ్చాం.

ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర నటీనటులు, దర్శకులు ఉండగా.. ఈయనతోనే (చిరంజీవి) విడుదల చేయించాలని ఎందుకు అనుకున్నావు?

కొంతమంది చెప్పే మాటలకు, చేసే పనులకు సంబంధం ఉండదు. చిరంజీవి అలా కాదు. ఆయన మాటలు, చేతల్లో నిజాయతీ ఉంటుంది. అమ్మకు ఆయన ఎంతటి వీరాభిమానో నాకు తెలుసు. అందుకే ఆయనతో రిలీజ్‌ చేయించాలనుకున్నా.

చిన్నతనంలో అమ్మతో టైమ్‌ స్పెండ్‌ చేయడానికి వీలు ఉండేదా?

నేను స్కూలింగ్‌లో ఉన్నప్పుడు పేరెంట్‌-టీచర్స్‌ మీటింగ్‌కి రావడానికి అమ్మకు వీలు పడకపోయేది. ఆ సమయంలో అమ్మను మిస్సయ్యేదాన్నని బాధపడేదాన్ని. ఇక అన్నం తినిపించడం, స్కూల్‌కు రెడీ చేయడం ఇలా.. చిన్నప్పుడు మా పనులన్నీ అమ్మమ్మ చేసేవారు. షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా అమ్మ మాకంటూ టైమ్‌ ఇవ్వడానికి చాలా ప్రయత్నించేది. షూట్‌ నుంచి ఇంటికి రాగానే నన్ను తీసుకువెళ్లి.. తన పక్కనే పడుకోబెట్టుకునేది. అమ్మ కూడా మమ్మల్ని ఎంతో మిస్సవుతోందని ఆ తర్వాత్తర్వాత అర్థం చేసుకున్నా. ఇలా రోజూ మాతో గడపకపోయినా.. ఆదివారాలు మాత్రం నన్ను, తమ్ముడిని కార్టూన్‌ షోలకు తీసుకెళ్లేది. తను మా కోసం ఎంతో కష్టపడింది. ఆస్తులు సంపాదించింది. ఎంతోమందికి సాయం చేసింది. అమ్మకు చింతచిగురు అంటే ఇష్టం. ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కడైనా చింత చెట్టు కనిపిస్తే చాలు.. కారు ఆపి చింత కాయలు కోసేది. ఇక పౌర్ణమి రోజున రాత్రి పూట బీచ్‌కు వెళ్లి సరదాగా గడిపేవాళ్లం. అమ్మ కూడా మమ్మల్ని నవ్వించడానికి ఎన్నో సరదా పనులు చేసేది. తిరుపతికి కాలి నడకన వెళ్లడానికి అమ్మ ఇష్టపడేది.

అమ్మ మీకోసం వంట చేసి పెట్టేవారా?

అమ్మమ్మ బాగా వంట చేస్తారు. అమ్మ షూటింగ్‌లో బిజీగా ఉంటే అమ్మమ్మ క్యారేజీలు కట్టి పంపించేవారు. నటీనటులందరూ కలిసి భోజనం చేసేవారు. వీలు కుదిరినప్పుడల్లా అమ్మ ఇంట్లో వంట చేసేది. కోడిగుడ్డు ఆమ్లెట్‌ కర్రీ, చికెన్‌ ఫ్రై బాగా వండేది.

అమ్మ డ్రస్సింగ్‌ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండేవారా?

చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. నేను ‘షర్మీలీ’ సినిమాలో హీరోయిన్‌ రాఖీ వేసుకున్న జంప్‌సూట్‌ చూశాను. నాకూ అలాంటి జంప్‌సూట్‌ కావాలని అమ్మను అడిగాను. కానీ అమ్మ అందుకు ససేమిరా అంది. ఎందుకంటే అది బాగా బిగుతుగా, శరీరానికి అతుక్కున్నట్లుగా ఉంటుందని, నడుం కనిపిస్తుందని అనేది. ప్యాంట్‌ షర్ట్‌ వేసుకుంటే కూడా టాప్‌ మోకాళ్ల కింది దాకా ఉండాలనేది. అమ్మ ఎక్కువగా పట్టు పరికిణీ, లంగా-వోణీ, చీరల్ని బాగా ఇష్టపడేది. నాకూ అలాంటి డ్రస్సింగ్‌నే అలవాటు చేసింది. తనో గొప్ప డిజైనర్‌ కూడా! సొంతంగా చీరల్ని డిజైన్‌ చేసేది. అమ్మ వార్డ్‌రోబ్‌లో బోలెడన్ని చీరలుండేవి. వాటితో నాకు లంగా-వోణీ, స్కర్ట్స్‌ కుట్టించేది. ఎక్కువగా సంప్రదాయబద్ధంగా ఉండడానికి, మమ్మల్నీ అలాగే ఉంచడానికి ఇష్టపడేది.

పెట్స్‌ అంటే ఎవరైనా కుక్క పిల్లలు, పిల్లి పిల్లల్ని ఇష్టపడతారు. కానీ నువ్వు పాముల్ని ఇష్టపడేదానివట.. నిజమేనా?

గతంలో పాముల్ని బుట్టలో ఇంటికి పట్టుకొచ్చి ఆడించేవాళ్లు. అలాంటి పాములోళ్లను అమ్మ నాకోసం తరచూ ఇంటికి పిలిపించేది. ఆడించడం పూర్తయ్యాక అమ్మ వాళ్లకు డబ్బులిచ్చేది. అందులో నాకు బాగా నచ్చేదేంటంటే పాము. దాన్ని తాకడానికి బాగా ఇష్టపడేదాన్ని. దాంతో ఆడుకునేదాన్ని. అలా పాములంటే ఇష్టం పెరిగింది. ఇక అప్పట్నుంచి వారానికోసారి వాళ్లను ఇంటికి పిలిపించి ఆడించేది. ఇలా పాములే కాదు.. పులి పిల్లల్నీ పెంచుకున్నా. ఓసారి కొడైకెనాల్‌కి వెళ్లినప్పుడు రెండు పులి పిల్లల్నీ ఇంటికి తెచ్చుకున్నాం. రెండు వారాలు వాటితో బాగా ఆడుకున్నాం. కానీ ఆ తర్వాత నాన్న వాటిని తిరిగి పంపించేశారు. ఆ తర్వాత అలిగి వారం పాటు నేను భోజనం కూడా చేయలేదు. అమ్మకు జంతువులంటే ప్రాణం. కుందేలు, నెమలి, కుక్కలు, పిల్లులు, పక్షులు, అక్వేరియంలు.. ఇలా మా ఇంట్లో ఓ చిన్న ‘జూ’నే ఉండేది.

ఇంట్లో అమ్మ, అక్క రేఖ.. ఇలా ఇంతమంది ఆర్టిస్టులుండగా నీకెప్పుడూ నటించాలని అనిపించలేదా?

నటించాలని నాకెప్పుడూ అనిపించలేదు. నేనెప్పుడూ గృహిణిగా ఉండాలని అనుకునేదాన్ని. స్కూల్లో కూడా టీచర్‌ అడిగినప్పుడు నా తోటి విద్యార్థులు డాక్టర్‌, ఇంజినీర్‌, ఎయిర్‌హోస్టెస్‌.. అని వాళ్ల కోరికలు చెప్పేవారు. కానీ నేను మాత్రం గృహిణిగానే స్థిరపడతానని అనేదాన్ని. ఎందుకంటే నాకు ఇంటి బాధ్యతలు, పిల్లల్ని పెంచడం అంటే ఇష్టం ఉండేది. బహుశా.. అమ్మ దగ్గర ఇది నేను మిస్సయ్యాను కాబట్టి నాకు అలా అనిపించి ఉండచ్చు. గృహిణిగా ఉండడానికి ఎంతగా ఇష్టపడతానో.. అంతే గర్వపడతాను కూడా!

18 ఏళ్లకే నీకు పెళ్లైంది. ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకోవడానికి కారణం?

నిజానికి 18 కాదు.. 16 ఏళ్లకే నాకు పెళ్లైంది. అప్పుడు అమ్మ ఆరోగ్యం అంత బాగుండకపోయేది. త్వరగా మమ్మల్ని సెటిల్‌ చేస్తే బాగుండని ఎప్పుడూ ఆలోచించేది. తమ్ముడు అప్పుడు చాలా చిన్నవాడు. ముందు నన్ను సెటిల్‌ చేస్తే.. నేను ఆటోమేటిక్‌గా తమ్ముడిని కూడా చూసుకుంటానని.. మా అత్త కొడుకు గోవిందరావుకిచ్చి నా పెళ్లి చేసింది. హమ్మయ్య! చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే చదవక్కర్లేదు.. హోంవర్క్‌ చేయక్కర్లేదు అనుకునేదాన్ని.. (నవ్వుతూ)! కానీ పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాక.. చదువు కొనసాగించా.. డిగ్రీ పూర్తి చేశాను.

అమ్మ చనిపోయే నాటికి నీకు 45 ఏళ్లుంటాయనుకుంటా. ఆ వయసులోనే అమ్మను కోల్పోవడం ఎలా అనిపించింది? నాన్నతో నీ అనుబంధం ఎలా ఉండేది?

అమ్మను కోల్పోవడం నా జీవితంలోనే ఓ భయంకరమైన అనుభవం. అమ్మ కోమాలోకి వెళ్లినప్పుడు నేను బీఏ ఫైనలియర్‌లో ఉన్నా. లాస్ట్‌ ఎగ్జామ్‌కి మూడు రోజులుందనగా నాకు ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత అమ్మను చూసుకోవడానికి సుమారు 19 నెలల పాటు ఆస్పత్రికి, ఇంటికి తిరగాల్సి వచ్చింది. ఆ రోజులు ఎంత గడ్డుగా గడిచాయో తలచుకుంటేనే బాధేస్తుంది. అప్పుడు నాన్నే తమ్ముడి బాధ్యతలు తీసుకొని వాడిని ప్రయోజకుడిని చేశారు. ఇప్పుడు తమ్ముడు యూఎస్‌లో స్థిరపడ్డాడు. నేనూ ఇక్కడ బాగా స్థిరపడ్డాను. చాలామంది మా అమ్మ విషయంలో తప్పుగా అనుకుంటారు. తను బతికుండగానే దానధర్మాల పేరిట ఆస్తిపాస్తులన్నీ పోగొట్టేసింది.. పిల్లలకు ఏమీ మిగల్చలేదని! కానీ అది నిజం కాదు. తన సంపాదనలో మాకంటూ కొంత పక్కన పెట్టింది. మమ్మల్ని సంతోషంగా ఉంచేందుకే ప్రతి క్షణం తపించేది.

‘మహానటి’ సినిమా చూశావ్‌ కదా.. అందులో అమ్మ గురించి అన్నీ చూపించారా? ఇంకా ఏవైనా విశేషాలుంటే బాగుండనిపించిందా?

‘మహానటి’ సినిమాపై బయటి నుంచి చాలా వివాదాలొచ్చాయి. కానీ నాకు అందులో ఎలాంటి అసంబద్ధత కనిపించలేదు. ఎందుకంటే ప్రతిదీ నన్ను అడిగే చేశారు. అందులో చూపించినవన్నీ వాస్తవాలే! ఈ సినిమా రావడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్