Arya Parvathy: 23 ఏళ్ల తర్వాత నాకు చెల్లి పుట్టింది!

చిన్నపిల్లలకు ఓ చెల్లో, తమ్ముడో పుడితే తెగ సంబరపడిపోతారు.. అస్తమానం వారి చుట్టూనే తిరుగుతూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు.. ఇక వాళ్లతో కలిసి ఆడుకున్న జ్ఞాపకాలు, పెట్టుకున్న పేచీలు.. పెద్దయ్యాక ఇలా ప్రతిదీ ఓ మధుర జ్ఞాపకమే! అయితే అలాంటి బంధం కోసం....

Published : 17 Mar 2023 20:26 IST

(Photos: Instagram)

చిన్నపిల్లలకు ఓ చెల్లో, తమ్ముడో పుడితే తెగ సంబరపడిపోతారు.. అస్తమానం వారి చుట్టూనే తిరుగుతూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు.. ఇక వాళ్లతో కలిసి ఆడుకున్న జ్ఞాపకాలు, పెట్టుకున్న పేచీలు.. పెద్దయ్యాక ఇలా ప్రతిదీ ఓ మధుర జ్ఞాపకమే! అయితే అలాంటి బంధం కోసం తాను 23 ఏళ్లుగా ఎదురుచూశానంటోంది మలయాళం టీవీ నటి ఆర్య పార్వతి. 47 ఏళ్ల వయసులో తన తల్లి మరోసారి అమ్మైందని, తనకు చెల్లి పుట్టిందని ఇటీవలే సోషల్‌ మీడియాలో ఈ శుభవార్తను పంచుకుంది. అయితే తన చిన్ననాటి కోరిక ఇన్నేళ్ల తర్వాత నెరవేరుతుందని తాను కలలో కూడా అనుకోలేదని, తన తల్లికున్న ఆరోగ్య సమస్యల కారణంగానే ఇన్నేళ్లుగా తాను తోడబుట్టినవారిని పొందలేకపోయానని అంటోంది ఆర్య. విదేశాల్లో సహజమే అయినా, మన దేశంలో మాత్రం ఇలా లేటు వయసులో గర్భం ధరించి, పిల్లల్ని కన్న మహిళలు సమాజం నుంచి పలు విమర్శలూ ఎదుర్కోవాల్సి వస్తుందంటూ.. తన తల్లి ప్రెగ్నెన్సీ జర్నీని, తన అనుభవాల్ని ఇటీవలే ఓ ‘సోషల్‌ మీడియా బ్లాగ్‌’తో షేర్‌ చేసుకుందీ మలయాళీ కుట్టి.

ఆడుకోవడానికైనా, ఆదుకోవడానికైనా ఓ తోబుట్టువు ఉండాలంటారు. చిన్నతనంలో ఎవరైనా తోబుట్టువులు ఆడుకోవడం చూసి.. ‘నాకూ ఓ అక్కో, తమ్ముడో ఉంటే బాగుండేది’ అనుకునే వాళ్లు మనలో చాలామందే ఉంటారు. అక్కడితో ఊరుకోకుండా ‘అమ్మా.. నాకూ ఓ చెల్లో, తమ్ముడో కావాలం’టూ అమాయకంగా అడిగే వారూ లేకపోలేదు. నేనూ అందుకు మినహాయింపు కాదు..!

ఆ ఎదురుచూపులు ఫలించలేదు!

నా చిన్నతనంలో అమ్మను పదే పదే ఓ విషయం అడిగేదాన్ని. ‘అమ్మా! నాకో చెల్లో, తమ్ముడో కావాలి..’ అని! అయితే కొన్నాళ్లకు అమ్మ తన సమస్యేంటో నాతో పంచుకుంది. నేను పుట్టాక తన గర్భాశయంలో పలు సమస్యలొచ్చాయని, దాంతో మరోసారి గర్భం ధరించడం వీలు కాదని, అందుకే నీకు తోబుట్టువును ఇవ్వలేకపోతున్నానంటూ తను చెబుతుంటే బాధనిపించింది. ఇక అక్కడితో ఆ విషయం వదిలేశా. ఆపై కొన్నాళ్లకు కాలేజీ చదువు కోసం బెంగళూరు వెళ్లా. చదువు పూర్తయ్యాక నటిగా బిజీగా మారా. అయితే గతేడాది వెకేషన్‌ కోసం ఇంటికి వెళ్దామనుకునే లోపే నాన్న నాకు ఫోన్‌ చేసి ‘అమ్మ ప్రెగ్నెంట్‌.. తనకు ఏడో నెల ఉన్నప్పుడు ఈ విషయం మాకు తెలిసింది. ఇప్పుడు తనకు ఎనిమిదో నెల..’ అని చెప్పారు. ఆ సమయంలో ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అప్పటికి అమ్మ వయసు 47, నాకు 23. ఇన్నేళ్ల తర్వాత నేను అక్కను కాబోతుండడంతో నా సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలో పాలుపోలేదు. ఈ ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నా. ‘నా చిన్ననాటి కల ఇన్నేళ్లకు నెరవేరబోతోంది..’ అని అమ్మను హత్తుకొని ఏడ్చేశా. ఇక ఆ తర్వాత అమ్మ, నేను కలిసి రోజూ చాలా సమయం గడిపేవాళ్లం.

‘మెనోపాజ్‌’ అనుకుంది.. కానీ!

నిజానికి అమ్మకు ఏడో నెల వచ్చే వరకు కానీ.. తాను గర్భిణినన్న విషయం తెలియలేదట! ఓసారి అమ్మానాన్నలిద్దరూ కలిసి గుడికి వెళ్లినప్పుడు.. అక్కడ అమ్మ నీరసంతో కళ్లు తిరిగి పడిపోవడంతో నాన్న దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడు అమ్మను పరీక్షించిన వైద్యులు తాను గర్భం ధరించిందని, కొన్ని కారణాల వల్ల పొట్ట బయటికి కనిపించట్లేదని చెప్పారు. అయితే తనకు నెలసరి ఆగిపోవడం, నీరసంతో కళ్లు తిరగడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం.. ఈ లక్షణాలన్నీ మెనోపాజ్‌ సంకేతాలేమోనని అనుకుందట అమ్మ. ఏదేమైనా అమ్మ ప్రెగ్నెన్సీ మా కుటుంబంలో ఎంతో సంతోషాన్ని నింపింది. ఇక ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులు, బంధువులతో పంచుకున్నాం. కొంతమంది పాజిటివ్‌గా స్పందించారు. మరికొందరు ‘లేటు వయసులో ప్రెగ్నెన్సీ’ ఏంటని విమర్శలూ చేశారు. అయినా ఇలాంటివి మేం పట్టించుకోలేదు. అందుకే అమ్మ ప్రెగ్నెన్సీ, ప్రసవం.. రెండూ ప్రశాంతంగా గడిచిపోయాయి.

ఆ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా!

ఇటీవలే నాకు చెల్లి పుట్టింది. తనను తొలిసారి చేతుల్లోకి తీసుకున్న క్షణం ఎప్పటికీ మర్చిపోలేను. తను నన్ను ఎప్పుడు అక్కా అని పిలుస్తుందా అన్న ఆతృతతో ఎదురుచూస్తున్నా. అయితే నాకు, నా చెల్లికి మధ్య ఉన్న వయోభేదం చాలామందికి వింతగా అనిపించచ్చు. కానీ అవేవీ నేను పట్టించుకోదల్చుకోలేదు. ఏదేమైనా ఇన్నేళ్ల నా ఎదురుచూపులకు తెరపడింది. నా చిన్ననాటి కోరిక నెరవేరింది. తోబుట్టువు లేని లోటు నా చెల్లితో తీరిపోయింది. తనకు దూరంగా ఉండడం చాలా కష్టంగానూ ఉంది..’ అంటూ తన అనుభవాలను పంచుకుంది ఆర్య.

అన్నట్లు ఆర్య మంచి డ్యాన్సర్‌, సింగర్‌ కూడా..! మోహినీఅట్టం నృత్యకళలో ఆరితేరిన ఆమె.. ఈ నృత్య ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

సిజేరియన్‌ చేయించుకోమన్నారు!

అయితే లేటు వయసులో గర్భం ధరించడమే ఓ అరుదైన విషయం అనుకుంటే.. ఆర్య తల్లి దీప్తికి సహజ ప్రసవం కావడం మరో విశేషం. అయితే వయసు కారణంగా చాలామంది సిజేరియన్‌ చేయించుకోమన్నారని, కానీ తాను మాత్రం నార్మల్‌ డెలివరీ కోసమే ప్రయత్నించానంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు దీప్తి.

‘ఆర్య నా కడుపులో ఉన్నప్పుడు నేను పూర్తి విశ్రాంతిలోనే ఉన్నా. కానీ నా రెండో ప్రెగ్నెన్సీ సమయంలో పలు క్లిష్ట సమస్యలున్నప్పటికీ చురుగ్గానే గడిపాను. వయసు కారణంగా చాలామంది నన్ను సి-సెక్షన్‌ చేయించుకోమన్నారు. కానీ నేను సహజ ప్రసవం వైపే మొగ్గు చూపాను. మధ్యలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు.. అన్నీ అనుకూలిస్తే సుఖ ప్రసవమే మేలు..’ అని చెప్పుకొచ్చారామె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్