Guinness World Records: ఐదేళ్లకే పుస్తకం రాసేసింది!

‘ఆసక్తి ఉన్న అంశాల్లో పిల్లల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు..’ ఈ విషయం మరోసారి రుజువైంది. ఇందుకు తాజా ఉదాహరణే.. యూకేకు చెందిన బెల్లా జే డార్క్‌. ఐదేళ్ల వయసున్న ఈ అమ్మాయి తన సృజనాత్మక ఆలోచనలతో ఓ పుస్తకం రాసింది. అంతేకాదు.. ఆ కథకు తగ్గట్లుగా తన చిట్టి చేతులతో అందంగా....

Published : 18 Jun 2022 16:29 IST

(Photos: Instagram)

‘ఆసక్తి ఉన్న అంశాల్లో పిల్లల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు..’ ఈ విషయం మరోసారి రుజువైంది. ఇందుకు తాజా ఉదాహరణే.. యూకేకు చెందిన బెల్లా జే డార్క్‌. ఐదేళ్ల వయసున్న ఈ అమ్మాయి తన సృజనాత్మక ఆలోచనలతో ఓ పుస్తకం రాసింది. అంతేకాదు.. ఆ కథకు తగ్గట్లుగా తన చిట్టి చేతులతో అందంగా ఇలస్ట్రేషన్స్‌ కూడా వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రచురితమైన ఈ పుస్తకం ఇప్పటివరకు వెయ్యి కాపీలకు పైగా అమ్ముడయ్యాయి. దీంతో ‘ప్రపంచంలోనే అతి పిన్న రచయిత్రి’గా తాజాగా గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కిందీ బాలిక. ‘ఆసక్తికి తోడు ఆలోచనా శక్తిని పెంచుకుంటే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా రచయిత్రిగా రాణించచ్చు..’ అంటూ తన ముద్దుముద్దు మాటలతో చెబుతోన్న ఈ చిన్నారి రచయిత్రి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..!

బెల్లా జే డార్క్‌.. యూకేలోని వేమౌత్ అనే ప్రాంతానికి చెందిన ఈ చిన్నారికి ప్రస్తుతం ఐదేళ్లు. పసి వయసు నుంచే బెల్లాకు ఊహాశక్తి అపారం.. మూడేళ్ల వయసు నుంచే లఘు కథలు రాసేదట! అలా రచనలంటే క్రమంగా తనకు ఆసక్తి ఏర్పడిందని చెబుతోంది ఈ చిన్నారి తల్లి చెల్సీ.

ఐదు రోజుల్లోనే..!

డ్రాయింగ్స్‌ వేయడమన్నా బెల్లాకు మక్కువేనట! ఈ క్రమంలోనే ఓసారి పిల్లి బొమ్మ వేస్తున్నప్పుడు దీనిపై ఓ కథ రాయాలని నిర్ణయించుకుందీ చిన్నారి. తన ఊహాశక్తి, సొంత ఆలోచనలతో ఐదు రోజుల్లోనే ‘The Lost Cat’ పేరుతో 32 పేజీల పుస్తకం రాసేసింది బెల్లా. అంతేనా.. అందులో కథకు తగ్గట్లుగా బొమ్మలు కూడా తానే స్వయంగా చిత్రీకరించింది. ఓవైపు ఆసక్తి గొలిపే కథ, మరోవైపు ఆకర్షణీయమైన బొమ్మలతో కూడిన ఈ పుస్తకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘Ginger Fyre Press’ అనే సంస్థ ప్రచురించింది. అప్పట్నుంచి ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచిన ఈ పుస్తకం కాపీలు ఇప్పటిదాకా వెయ్యికి పైగానే అమ్ముడుపోయాయి. గిన్నిస్‌ బుక్‌ రికార్డు ప్రకారం.. సదరు పుస్తకం కమర్షియల్‌ పబ్లిషింగ్‌ హౌస్‌లో ప్రచురితం కావాలి.. అలాగే కనీసం వెయ్యి పుస్తకాలైనా అమ్ముడు పోవాలి. బెల్లా రాసిన పుస్తకం ఆ మార్క్‌ దాటడంతో ‘ప్రపంచంలోనే అతి పిన్న రచయిత్రి’గా అవతరించిందీ అమ్మాయి. ఇప్పటిదాకా ఈ రికార్డు ఆరేళ్ల అమెరికన్‌ రచయిత్రి డొరొథీ స్ట్రెయిట్‌ పేరిట ఉంది. ఇక తన పుస్తకం ప్రచురితమయ్యే నాటికి బెల్లా వయసు 5 ఏళ్ల 211 రోజులు.

అదే చెప్పాలనుకున్నా..!

రికార్డు సంగతి పక్కన పెడితే.. తన పుస్తకం ద్వారా పిల్లలందరికీ ఓ నీతి కథ చెప్పాలనుకున్నా అంటోంది బెల్లా. ‘నేను వేసిన బొమ్మల నుంచే ఈ పుస్తకం పుట్టింది. రాత్రిపూట ఒంటరిగా బయటికి వెళ్లిన పిల్లి తప్పిపోవడం.. అనే అంశం చుట్టూనే కథను అల్లాను. నేను కథ మొదలుపెట్టినప్పుడు.. ‘నువ్వు కచ్చితంగా దీనిపై పుస్తకం రాయగలవు..’ అంటూ అమ్మానాన్న నన్ను ప్రోత్సహించారు. ఈ కథ ద్వారా పిల్లలందరికీ ఒక్కటే విషయం చెప్పాలనుకున్నా.. అదేంటంటే.. రాత్రి పూట ఒంటరిగా బయటికి వెళ్లి ఆపద కొనితెచ్చుకోకూడదని! ఆసక్తి, ఆలోచనలుంటే వయసుతో ప్రమేయం లేకుండా ఎవరైనా పుస్తకాలు రాయచ్చు.. రచయితలుగా నిరూపించుకోవచ్చు. ప్రస్తుతం నా రెండో పుస్తకంపై కసరత్తు ప్రారంభించా. భవిష్యత్తులో రచయిత్రిగా, డ్రాయింగ్‌ ఆర్టిస్ట్‌గా స్థిరపడాలని ఉంది..’ అంటోందీ చిన్నారి. మరోవైపు బెల్లా ప్రతిభకు ఆమె తల్లిదండ్రులు కూడా ఉప్పొంగిపోతున్నారు. బెల్లాకు లాసీ మే అనే అక్క కూడా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్