అందుకే వీళ్ల ఎంగేజ్‌మెంట్ రింగ్స్.. ఎంతో స్పెషల్!

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ అదితీ రావ్‌ హైదరీ-సిద్ధార్థ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారంటూ.. గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా ఇదే వార్త. ఇప్పటిదాకా ఈ వార్తలపై మౌనం వహించిన ఈ జంట.. తాజాగా తామిద్దరూ దిగిన ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంది. తమ నిశ్చితార్థం జరిగిందంటూ ప్రకటించింది....

Published : 30 Mar 2024 13:08 IST

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ అదితీ రావ్‌ హైదరీ-సిద్ధార్థ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారంటూ.. గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా ఇదే వార్త. ఇప్పటిదాకా ఈ వార్తలపై మౌనం వహించిన ఈ జంట.. తాజాగా తామిద్దరూ దిగిన ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంది. తమ నిశ్చితార్థం జరిగిందంటూ ప్రకటించింది. ఎంగేజ్‌మెంట్‌ రింగ్స్‌ని అందరికీ చూపిస్తూ క్లిక్‌మనిపించిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అందులోనూ ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉన్న అదితి నిశ్చితార్థపు ఉంగరం పైనే అందరి దృష్టీ పడింది. ఈ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ గురించి తెలుసుకోవాలని చాలామంది నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు. ఇలా అదితే కాదు.. గతంలో పెళ్లి పీటలెక్కిన కొందరు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలూ ఖరీదైన, విభిన్న డిజైన్లలో రూపొందించిన నిశ్చితార్థపు ఉంగరాలు ధరించి మెరిసిపోయారు. మరి, వాళ్ల ఎంగేజ్‌మెంట్‌ రింగ్స్‌, వాటి విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

డబుల్‌ డైమండ్స్‌.. డబుల్‌ ఆనందం!

బాలీవుడ్‌ బ్యూటీ అదితీ రావ్‌ హైదరీ-నటుడు సిద్ధార్థ్‌తో ప్రేమలో ఉందన్న విషయం తెలిసిందే! అయితే వీళ్లిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ గత రెండుమూడు రోజులుగా వార్తలు షికారు చేశాయి. నిజానికి వీళ్ల వివాహం జరగలేదు.. అయినా తమ పెళ్లి వార్తలపై పెదవి విప్పని ఈ జంట.. తమకు నిశ్చితార్థం జరిగిందంటూ తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఫొటో పోస్ట్‌ చేసింది. ఇద్దరూ తమ నిశ్చితార్థపు ఉంగరాల్ని చూపిస్తూ దిగిన ఈ ఫొటో వైరల్‌గా మారింది. ముఖ్యంగా అదితి ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా ఉంగరమంటే ఒక వజ్రం/రత్నం పొదగడం చూస్తుంటాం. కానీ అదితి ఉంగరంలో రెండు డైమండ్స్‌ పక్కపక్కనే అమర్చారు. వీటిలో ఒకటి గుండ్రటి వజ్రం కాగా, మరొకటి టియర్‌ డ్రాప్‌ ఆకృతిలో ఉన్న డైమండ్‌. తన అభిరుచులు, ఆలోచనలకు అనుగుణంగా అదితే స్వయంగా ఈ ఉంగరాన్ని కస్టమైజ్‌ చేయించుకుందట! ఈ రెండు డైమండ్లు తామిద్దరి ప్రేమకు ప్రతిరూపాలని, వీటిలాగే తామిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటామని తన ఉంగరంతో చెప్పకనే చెప్పిందీ బ్యూటీ. ఇక ఈ అందమైన ఉంగరం ఖరీదు లక్షల్లో ఉంటుందట! ‘మహాసముద్రం’ సినిమాతో తొలిసారి కలిసి పనిచేసిన ఈ జంట.. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఇప్పుడు తమ ప్రేమను శాశ్వతం చేసుకునే క్రమంలో తొలి అడుగు వేశారు.


అదే దాని ప్రత్యేకత!

నెచ్చెలిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌. ఈ విషయానికొస్తే బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, తన ఇష్టసఖి ఆలియా భట్‌ను ఖరీదైన వజ్రపుటుంగరంతో సర్‌ప్రైజ్‌ చేశాడు. తమ నిశ్చితార్థంలో రూ. 3 కోట్ల విలువ చేసే డైమండ్‌ రింగ్‌ను ఆలియా వేలికి తొడిగి.. తన మనసులో ఆమె స్థానమేంటో చెప్పకనే చెప్పాడు. ఆలియా ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ పూర్తిగా వజ్రాలతోనే రూపొందింది. చుట్టూ 8 చిన్న చిన్న డైమండ్స్‌.. మధ్యలో పెద్ద డైమండ్‌ పొదిగి ఈ ఉంగరాన్ని డిజైన్‌ చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వజ్రాభరణాల బ్రాండ్‌ వాన్‌ క్లీఫ్‌-ఆర్పెల్‌.. ఆలియా అభిరుచులకు తగినట్లుగా ఈ రింగ్‌ని కస్టమైజ్‌ చేసింది. ఇలా పలు ప్రత్యేకతలతో కూడుకున్న ఈ రింగ్‌.. ప్రతి సందర్భంలోనూ ఈ చక్కనమ్మకు అదనపు ఆకర్షణను అందిస్తోంది.


‘నిబద్ధత’కు ప్రతిరూపం!

‘షేర్షా’ సినిమాతో ప్రేమలో పడి.. పెళ్లితో తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు బాలీవుడ్‌ జంట కియారా అడ్వాణీ-సిద్ధార్థ్‌ మల్హోత్రా. గతేడాది ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. వివాహం అప్పట్లో ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గా నిలిచింది. ముఖ్యంగా కియారా ధరించిన నిశ్చితార్థపు ఉంగరం.. ఈ తరం అమ్మాయిల కలల ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌గా మారిపోయిందని చెప్పడంలో సందేహం లేదు. తన నిశ్చితార్థం కోసం ఎగ్‌ షేప్‌లో డైమండ్‌ రింగ్‌ని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుందీ ముద్దుగుమ్మ. దీని చుట్టూ చిన్న చిన్న డైమండ్లతో హంగులద్దారు. అయితే ఈ ఆకృతిని నిబద్ధతకు ప్రతిరూపంగా చెబుతారు. ఇలా తమ అనుబంధంలోని కమిట్‌మెంట్‌ను ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ ద్వారా చెప్పకనే చెప్పిందీ బ్యూటీ. ఈ ఉంగరం ధర రూ. కోటికి పైగానే ఉంటుందట!


అచ్చం అలాంటి రింగేనా?!

మధ్యలో నీలం, చుట్టూ చిన్న చిన్న వజ్రాలు పొదిగి తమ ఎంగేజ్‌మెంట్ కోసం కత్రినా కైఫ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఉంగరం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందుకు కారణం.. ఈ ఉంగరం ప్రిన్సెస్‌ డయానా నిశ్చితార్థపు ఉంగరాన్ని పోలి ఉండడమే! న్యూయార్క్‌కు చెందిన టిఫానీ కలెక్షన్‌ నుంచి ఎంతో ముచ్చటపడి తన ఇష్టసఖి ఎంచుకున్న ఈ ఉంగరాన్ని విక్కీ.. లక్షలు వెచ్చించి కొనుగోలు చేశాడట! నిశ్చితార్థపు వేడుకలో కత్రినా వేలికి తొడిగిన ఈ ఉంగరం.. అప్పట్నుంచి ప్రతి అకేషన్‌లోనూ ఆమెను ప్రత్యేకంగా నిలుపుతోంది.


సింపుల్‌ అండ్‌ స్వీట్‌గా!

సింప్లిసిటీని కోరుకుంటూనే.. ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు కొందరు అందాల తారలు. వారిలో బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా ఒకరు. తన పెళ్లిలో దుస్తుల దగ్గర్నుంచి, మేకప్‌ దాకా.. ప్రతి విషయంలోనూ సింపుల్‌గా కనిపించడానికే ప్రాధాన్యమిచ్చిన ఈ చక్కనమ్మ.. నిశ్చితార్థపు ఉంగరాన్నీ అంతే సింపుల్‌గా ఎంచుకుంది. మూడు క్యారట్ల డైమండ్‌ పొదిగిన ఉంగరం చుట్టూ చిన్న చిన్న వజ్రాలతో డిజైన్‌ చేశారు. లక్షల విలువ చేసే ఈ ఉంగరాన్ని తన ఇష్టసఖుడు రాఘవ్‌తో తొడిగించుకున్న పరి.. క్యూట్‌ బ్రైడ్‌ అంటూ అందరిచేతా కితాబునందుకుంది.

వీళ్లే కాదు.. సోనమ్‌ కపూర్‌, మౌనీరాయ్‌, దీపికా పదుకొణె, అనుష్కా శర్మ, ప్రియాంక చోప్రా.. వంటి ముద్దుగుమ్మలూ తమ నిశ్చితార్థపు వేడుకల్లో కస్టమైజ్‌డ్‌ డైమండ్‌ రింగ్స్‌తో మెరిసిపోయారు. ఆకర్షణీయమైన డిజైన్లతో కూడిన ఈ ఉంగరాల ఫొటోలు అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్