Nita Ambani: కార్లు.. నగలు.. చీరలు.. ఏదైనా లక్షలు, కోట్లలోనే!

డైమండ్‌ ఎంబ్రాయిడరీ చేసిన చీరలు, ఆభరణాలు పొదిగిన హ్యాండ్‌బ్యాగ్స్‌, దుస్తులకు తగ్గట్లుగా కస్టమైజ్‌డ్‌ లిప్‌స్టిక్‌/మేకప్.. ఒక్కసారి నీతా అంబానీ క్లోజెట్‌లోకి తొంగిచూస్తే ఇలాంటి విభిన్న లగ్జరీ వస్తువులే దర్శనమిస్తాయి. సంప్రదాయ కట్టూ-బొట్టూతో ఎప్పుడూ నిండుదనం ఉట్టిపడేలా కనిపించే ఈ మిసెస్‌ అంబానీని చూస్తే.. ఎక్కువగా బ్యూటీ, దానికి సంబంధించిన యాక్సెసరీస్‌కే ప్రాధాన్యమిస్తారేమో అనిపిస్తుంది.

Published : 12 Apr 2024 15:28 IST

(Photos: Instagram)

డైమండ్‌ ఎంబ్రాయిడరీ చేసిన చీరలు, ఆభరణాలు పొదిగిన హ్యాండ్‌బ్యాగ్స్‌, దుస్తులకు తగ్గట్లుగా కస్టమైజ్‌డ్‌ లిప్‌స్టిక్‌/మేకప్.. ఒక్కసారి నీతా అంబానీ క్లోజెట్‌లోకి తొంగిచూస్తే ఇలాంటి విభిన్న లగ్జరీ వస్తువులే దర్శనమిస్తాయి. సంప్రదాయ కట్టూ-బొట్టూతో ఎప్పుడూ నిండుదనం ఉట్టిపడేలా కనిపించే ఈ మిసెస్‌ అంబానీని చూస్తే.. ఎక్కువగా బ్యూటీ, దానికి సంబంధించిన యాక్సెసరీస్‌కే ప్రాధాన్యమిస్తారేమో అనిపిస్తుంది. కానీ ఆటోమొబైల్‌ గ్యాడ్జెట్స్‌ పైనా మనసు పారేసుకున్నారు నీతా. ఇందుకు ఆమె గ్యారేజ్‌లో ఉన్న పలు ఖరీదైన కార్లే ప్రత్యక్ష ఉదాహరణ! తాజాగా ఆ కార్ల లిస్టులోకి మరో లగ్జరీ కారు చేరిపోయింది. తాను కావాలనుకున్న ప్రతి వస్తువునూ తన అభిరుచులకు తగినట్లుగా కస్టమైజ్‌ చేయించుకునే నీతా.. తాజాగా తాను కొన్న ఈ కారునూ కస్టమైజ్‌ చేయించుకున్నారు. ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కిన ఈ కారు ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, ఈ కారు ప్రత్యేకతలు తెలుసుకుంటూనే.. మిసెస్‌ అంబానీ సొంతమైన కొన్ని ఖరీదైన వస్తువులు/యాక్సెసరీస్‌పై ఓ లుక్కేసేద్దాం రండి..


కస్టమైజ్‌డ్ కారు.. ధరెంతంటే?

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం నీతా అంబానీ సొంతం. మొదట్లో స్కూల్‌ టీచర్‌గా పనిచేసి రూ. 800 జీతం అందుకున్న ఆమె.. ఇప్పుడు కొన్ని లక్షల కోట్లకు అధిపతి! అయినా ఆమె కట్టూ-బొట్టు, నడవడికలో ఇసుమంతైనా గర్వం కనిపించదు. ఇక తనకు నచ్చిన వస్తువుల్ని తన అభిరుచులకు తగినట్లుగా కస్టమైజ్‌ చేయించుకోవడం నీతాకు ముందు నుంచీ అలవాటు! అలా చీరలు, ఆభరణాలు, విభిన్న యాక్సెసరీసే కాదు.. ఓ కారునూ కస్టమైజ్‌ చేయించుకున్నారామె.

కార్లంటే మక్కువ చూపే ఈ మిసెస్‌ అంబానీ.. తాజాగా Rolls Royce Phantom VIII EWB కారును కొనుగోలు చేశారు. అందులో పలు భాగాల్ని తన అభిరుచులకు తగినట్లుగా డిజైన్‌ చేయించుకున్నారు నీతా. ట్విన్‌ టర్బోఛార్జ్‌డ్‌ ఇంజిన్‌ కలిగిన ఈ కారును గోల్డ్‌ క్వార్ట్జ్‌ కలర్‌లో కస్టమైజ్‌ చేయించుకున్నారామె. అంతేకాదు.. విశాలమైన సీటింగ్‌ సదుపాయం ఉన్న ఈ కారు సీట్‌ హెడ్‌ రెస్ట్‌లపై ‘నీతా ముకేశ్‌ అంబానీ’ పేరులోని తొలి అక్షరాలు NMAతో ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీ చేయించుకున్నారు. ఇలా తన ఇష్టాయిష్టాలకు తగినట్లుగా కస్టమైజ్‌ చేయించుకున్న ఈ కారు ఇటీవలే గట్టి బందోబస్తు నడుమ ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ కారు ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘నీతా మేడమా.. మజాకా.. ఆమె టేస్టే వేరు!’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ కారు ధరెంతో తెలుసా? రూ. 12 కోట్లకు పైమాటేనట! ఇదే కాదు.. గతేడాది దీపావళి కానుకగా ముకేశ్‌ తన ముద్దుల భార్య నీతాకు Rolls-Royce Cullinan కారును ప్రజెంట్ చేశారట! అంతకుముందు సుమారు రూ. 90 కోట్లు ఖర్చు పెట్టి ఎంతో ముచ్చటపడి Audi A9 Chameleon కారును కొనుగోలు చేశారు నీతా. వీటితో పాటు Maybach, Ferrari, Bentley, Benz.. వంటి ఎన్నో లగ్జరీ కార్లు నీతా అంబానీ గ్యారేజ్‌లో కొలువుదీరాయి.


హ్యాండ్‌బ్యాగులకు హంగులు!

దుస్తులకు నప్పిన యాక్సెసరీస్‌ ధరించడం చాలామందికి అలవాటు! ఇక సెలబ్రిటీలైతే మ్యాచింగ్‌ హ్యాండ్‌బ్యాగ్‌లూ ఎంచుకుంటుంటారు. ఈ విషయంలో నీతా మరో నాలుగాకులు ఎక్కువే చదివారు. డ్రస్‌కు నప్పే రంగులో ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ను ఎంచుకోవడమే కాదు.. కొన్ని బ్యాగులపై ఏకంగా ఆభరణాలతో డిజైన్‌ చేయించుకుంటుంటారు. సన్నటి చెయిన్స్‌, వజ్రాలు, రాళ్లు, ముత్యాలు.. వంటి వాటితో దగ్గరుండి మరీ హ్యాండ్‌బ్యాగ్‌కు అదనపు హంగులద్దించుకుంటారు నీతా. Jimmy Choo, Hermes, Mulberry, Fendi, Prada, Louis Vuitton.. వంటి పలు అంతర్జాతీయ బ్రాండ్లు రూపొందించిన ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ కలెక్షన్‌తో తన గదిలో ప్రత్యేకంగా ఓ క్లోజెట్‌నే ఏర్పాటు చేసుకున్నారామె. వీటి ధర కూడా రెండున్నర కోట్లకు పైగానే ఉంటుందట!


బంగారు టీ-సెట్!

ఆయా వస్తువుల్ని తనకు నచ్చినట్లుగా కస్టమైజ్‌ చేయించుకోవడమే కాదు.. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ తానెంతో ఇష్టపడిన వస్తువుల్నీ కొనుగోలు చేస్తుంటారు నీతా. ఇలా జపాన్‌ వెళ్లినప్పుడు రూ. 1.5 కోట్లు ఖర్చు పెట్టి ఓ టీ-సెట్‌ని కొనుగోలు చేశారామె. జపనీయుల ప్రాచీన సంస్కృతికి అద్దం పట్టే బొమ్మలతో తీర్చిదిద్దిన ఈ కప్‌-సాసర్‌ సెట్‌ని 22 క్యారట్ల బంగారంతో తయారుచేశారట! దీనిపై అక్కడక్కడా ప్లాటినంతో హంగులద్దారట! జపాన్‌లోని అతి పురాతనమైన క్రాకరీ సంస్థ ‘Noritake’ డిజైన్‌ చేసిన ఈ కప్పుతోనే ఉదయం టీ తాగి తన రోజును మొదలుపెడతారట నీతా.


వేసిన నగల్ని వేయకుండా..!

దుస్తుల్లాగే నగల్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు చాలామంది అమ్మాయిలు. ఈ భావనతోనే ఒక్కసారి వేసిన వాటిని తిరిగి రిపీట్‌ చేయరు. నీతా అంబానీ కూడా అంతే! ఆమె రిపీట్‌ చేసే ఆభరణాలు చాలా అరుదు. పైగా దుస్తులకు తగినట్లుగా బంగారం, వజ్రవైఢూర్యాలతో రూపొందించిన నగల్ని ఎంచుకునే ఈ అంబానీ లేడీ వార్డ్‌రోబ్‌లో ఉన్న నగల కలెక్షన్‌ ధర సుమారు రూ. 100 కోట్లుంటుందని అంచనా! వీటిలో వజ్రాభరణాలు, సంప్రదాయబద్ధంగా కస్టమైజ్‌ చేయించుకున్న బంగారు ఆభరణాలు, వజ్రపుటుంగరాలు, నవరత్నాలు పొదిగిన హారాలు, చోకర్‌ నెక్లెస్‌ సెట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె వద్ద లేని నగ లేదంటే అతిశయోక్తి కాదు. ఇలా నగల ఎంపికలోనూ తనదైన ఫ్యాషన్‌ మార్క్‌ను చాటుకుంటున్నారీ మిసెస్‌ అంబానీ.


ఆ చీరకు ‘గిన్నిస్‌’ రికార్డు!

సందర్భానికి తగినట్లుగా దుస్తుల్ని ఎంచుకోవడంలో నీతా అంబానీది అందె వేసిన చేయి. పెళ్లిళ్లు, పండగలు, పూజలు.. వంటి ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ శాతం చీరలు, లెహెంగాల్లోనే దర్శనమిచ్చే ఆమె.. తన ఫ్యాషన్‌ అభిరుచులతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. ఇలా 2015లో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ఇంట్లో జరిగిన వివాహానికి హాజరయ్యారు నీతా. ఈ వేడుక కోసం రూ. 40 లక్షల విలువ చేసే బేబీ పింక్‌ చీరను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్నారామె. వజ్రాలు, బంగారు జరీ, పచ్చలు, కెంపులు, ముత్యాలు.. వంటి విలువైన రత్నాలతో హంగులద్దిన ఈ చీర ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. ఇక ఈ చీరకు మ్యాచింగ్‌గా ఆమె ధరించిన బ్లౌజ్‌పై శ్రీకృష్ణుడి ఆకృతిని ఎంబ్రాయిడరీ చేసి డిజైన్‌ చేయడం విశేషం. అప్పట్లో ఈ చీరకు ‘ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీర’గా గిన్నిస్‌ రికార్డు దక్కింది. ఇవే కాదు.. మరెన్నో ట్రెడిషనల్‌, మోడ్రన్‌ దుస్తులకు నీతా అంబానీ క్లోజెట్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటుంది.


బర్త్‌డే గిఫ్ట్‌గా.. విమానం!

చాలామంది ప్రముఖులకు సొంత కార్లున్నట్లే సొంత విమానాలూ ఉంటున్నాయి. తమ అభిరుచులకు తగినట్లుగా ఈ ప్రైవేట్‌ జెట్స్‌ని డిజైన్‌ చేయించుకుంటున్నారు. ముకేశ్‌ అంబానీ కూడా తన సతీమణికి ఇలాంటి ఓ లగ్జరీ ప్రైవేట్‌ జెట్‌ని కానుకిచ్చారు. 2007లో నీతా 54 పుట్టినరోజును పురస్కరించుకొని ఈ ఖరీదైన బహుమతిచ్చారాయన. సోఫా, విశాలమైన లివింగ్‌ ప్రదేశం, పడకగది.. ఇలా ఎన్నెన్నో సదుపాయాలు కలిగిన ఈ విమానంలోనే దేశవిదేశాలకు వెళ్తుంటారు నీతా. ఇక ఈ ప్రైవేట్‌ జెట్‌ ధర.. రూ. 240 కోట్లకు పైగానే ఉంటుందట!


లిప్‌స్టిక్‌ ఖరీదు లక్షల్లో!

వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందంతో కనిపించే నీతా.. మేకప్‌తోనూ మెస్మరైజ్‌ చేస్తుంటారు. ముఖ్యంగా ఆమె ఎంచుకునే లిప్‌స్టిక్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే.. వీటిని కూడా తన దుస్తులకు నప్పేలా, తన లుక్‌ని ద్విగుణీకృతం చేసేలా కస్టమైజ్‌ చేయించుకుంటారట నీతా. బంగారం, వెండి వంటి లోహాల్ని వాడి ప్రత్యేకంగా తయారుచేయించుకున్న ఈ లిప్‌స్టిక్స్‌లో బోలెడన్ని షేడ్స్‌ ఆమె బ్యూటీ వార్డ్‌రోబ్‌లో ఉన్నాయి. ఇలా ఒక్క లిప్‌స్టిక్స్‌ కోసమే ఇప్పటివరకు రూ. 40 లక్షలకు పైగా ఖర్చు చేశారట ఈ లేడీ బాస్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్