సీన్‌ రివర్స్.. ఈ అత్తకేమో జీన్స్.. కోడలికేమో చీరలంటే ఇష్టమంట!

అమ్మాయిలు పెళ్లికి ముందు పుట్టింట్లో ఎలా ఉన్నా నడుస్తుంది.. జీన్స్‌ వేసుకున్నా, చీర కట్టుకున్నా అడిగే వారుండరు. కానీ అత్తింట్లో అడుగుపెట్టాక.. మోడ్రన్‌ దుస్తులు ధరించాలని ఉన్నా ధరించలేకపోతారు కొందరు. అత్తమామల ముందు పద్ధతిగా ఉండాలన్న ఒత్తిడీ వారిపై ఉంటుందనుకోండి.

Updated : 22 Nov 2023 13:03 IST

(Photos: Instagram)

అమ్మాయిలు పెళ్లికి ముందు పుట్టింట్లో ఎలా ఉన్నా నడుస్తుంది.. జీన్స్‌ వేసుకున్నా, చీర కట్టుకున్నా అడిగే వారుండరు. కానీ అత్తింట్లో అడుగుపెట్టాక.. మోడ్రన్‌ దుస్తులు ధరించాలని ఉన్నా ధరించలేకపోతారు కొందరు. అత్తమామల ముందు పద్ధతిగా ఉండాలన్న ఒత్తిడీ వారిపై ఉంటుందనుకోండి. కానీ ఇక్కడ మాత్రం సీన్‌ రివర్సైంది. అత్తింట్లో సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలన్న అత్తలున్న ఈ రోజుల్లో.. తన కోడలిని మాత్రం పూర్తి మోడ్రన్‌గానే చూడాలనుకుందీ అత్తగారు. ఇంకేం.. కోడలికి నచ్చే నిర్ణయమేగా అనుకుంటే మీరు పొరపడినట్లే! ఎందుకంటే ఈ స్టోరీలో అత్తగారిలాగే కోడలూ రివర్సే! అందుకే తాను జీన్స్‌ వేసుకోను.. చీరే కట్టుకుంటానని మొండికేసింది. డ్రస్సింగ్‌ విషయంలో ఇద్దరి మధ్య మొదలైన చిన్న గొడవ.. ఇప్పుడు పోలీస్‌ కంప్లైంట్‌ దాకా వెళ్లింది.. చర్చనీయాంశమైంది!

పెళ్లయ్యాక భార్యాభర్తలు విడిగా ఉన్నప్పుడు ఎంత మోడ్రన్‌గా రడీ అయినా.. అత్తమామలతో కలిసున్నప్పుడు మాత్రం పద్ధతిగా చీరకట్టుకోవడమో లేదంటే చుడీదార్స్‌ వంటి నిండైన దుస్తులు ధరించడమో చేస్తుంటారు కోడళ్లు. ఒకవేళ కోడలిగా తమ ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయికి తమ కుటుంబ ఆచారాలు తెలియకపోయినా.. అత్తగారు వివరించి చెప్పడం పరిపాటే! అయితే ఉత్తరప్రదేశ్‌ ఆగ్రా జిల్లాలోని హరిపర్వత్‌ అనే ప్రాంతంలో ఇందుకు పూర్తి భిన్నమైన సంఘటన చోటుచేసుకుంది.

జీన్సే ధరించాలన్న అత్తగారు!

హరిపర్వత్‌కు చెందిన ఓ యువకుడికి.. ఎత్మాద్‌పుర్‌ పరిధిలో నివాసముండే ఓ యువతితో కొన్ని నెలల క్రితం పెళ్లైంది. ఆ అమ్మాయిది గ్రామీణ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో పుట్టింట్లో ఉన్నన్నాళ్లూ చీర, చుడీదార్స్‌.. వంటి దుస్తులే ధరించేది. అయితే వివాహమై అత్తింట్లోకి అడుగుపెట్టాక.. అక్కడి వాతావరణం చూసి ఒక్కసారిగా అవాక్కైందామె. ఇందుకు కారణం.. ఆమె అత్తగారు రోజూ జీన్స్‌-టీషర్ట్స్‌/టాప్స్‌ ధరించడమే! అత్తగారి డ్రస్సింగ్‌ ఎలా ఉన్నా.. తాను మాత్రం రోజూ చీరలే కట్టుకోవాలని డిసైడైందీ కోడలు పిల్ల. అయితే ఇది ఆమె అత్తగారికి నచ్చలేదు. కోడలినీ తనలా మోడ్రన్‌గా మార్చేయాలనుకుంది.. ఈ క్రమంలోనే జీన్స్‌-టీషర్ట్స్‌ ధరించాలంటూ కోడలిపై ఒత్తిడి తెచ్చింది. అయితే కోడలు మాత్రం ఇందుకు ససేమిరా అంది. ఇలా రోజూ డ్రస్సింగ్‌ విషయంలో అత్తాకోడళ్ల అభిప్రాయాలు పొసగక.. ఇంట్లో మనశ్శాంతి కరువైంది. పోనీ.. భర్తైనా తనను అర్థం చేసుకుంటాడనుకుంటే.. అతడూ తన తల్లికే వంత పాడడంతో.. ఇక చేసేది లేక పోలీసులను ఆశ్రయించిందీ కోడలు పిల్ల. హరిపర్వత్‌ ఠాణాలో నమోదైన ఈ వింత కేసు ప్రస్తుతం వైరలవుతోంది.

చీరకట్టుకుంటే వెక్కిరించేది!

తన అత్తగారు జీన్స్‌ వేసుకోవాలని పోరు పెట్టడమే కాదు.. తన చీరకట్టునూ అవమానించేదని వాపోతోందీ కోడలు.

‘మాది గ్రామీణ నేపథ్యం ఉన్న కుటుంబం. పెళ్లికి ముందు చీరలే ఎక్కువగా కట్టుకునేదాన్ని. ఇక పెళ్లయ్యాకా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నా. అయితే ఇది మా అత్తగారికి నచ్చలేదు. నేను చీరకట్టుకోవడం మానేసి జీన్స్‌ వేసుకోవాలని ఒత్తిడి తెచ్చేది. కానీ నేను చీరే కట్టుకుంటానని చెప్పేదాన్ని. దాంతో చీరకట్టులో ఉన్న నన్ను చూసి హేళన చేసేది. ఇలా ఆవిడ పోరు భరించలేక.. ఓసారి మావారితో ఈ విషయం చెప్పాను. ఆయనా నన్ను సపోర్ట్‌ చేయకపోగా.. వాళ్లమ్మకే వంత పాడాడు. జీన్స్‌-టాప్స్‌ ధరించమంటూ ఇబ్బంది పెట్టేవాడు.. ఒక్కోసారి చేయి కూడా చేసుకునేవాడు.. ఇక భరించడం నా వల్ల కాలేదు.. అందుకే పోలీస్‌ స్టేషన్‌ని ఆశ్రయించా..’ అంటూ చెప్పుకొచ్చిందీ మహిళ. అయితే ఈ కేస్‌ను డీల్‌ చేస్తోన్న అక్కడి ‘ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌’ ఏసీపీ సుకన్యా శర్మ.. ఇప్పటికే ఓసారి అత్తాకోడళ్ల మధ్య సయోధ్య కుదర్చాలని ప్రయత్నించారు. మొదటి ప్రయత్నం విఫలమవడంతో మరోసారి ప్రయత్నించనున్నట్లు చెబుతున్నారామె.

ఇష్టాయిష్టాల్ని గౌరవించుకుంటే..!

ఏదేమైనా.. అత్తారింట్లో ట్రెడిషనల్‌, మోడ్రన్‌ అన్న కట్టుబాట్లతో చాలా సందర్భాల్లో కోడళ్లే సర్దుకుపోవాల్సి వస్తోందన్న మాట మాత్రం నిజం. ఒకవేళ అత్తింటి వారి నిర్ణయాన్ని కాదన్నా, భర్త అభిప్రాయానికి గౌరవం ఇవ్వకపోయినా.. పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజా సంఘటన ఇదే విషయం మరోసారి నిరూపిస్తోంది. ఇలాంటి అభిప్రాయభేదాలతో అనుబంధాల్ని దూరం చేసుకునే కంటే.. అత్తాకోడళ్లు పరస్పరం తమ ఇష్టాయిష్టాల్ని గౌరవించుకుంటే.. ఒకరికొకరు గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటే.. వారి మధ్య అనుబంధం దృఢమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఏమంటారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్